English   

నంద‌మూరి హీరోల‌ను వాడేస్తున్నాడా..?

Naga-Shaurya
2018-06-30 17:07:27

ఇప్పుడు కుర్ర హీరోల‌కు సీనియ‌ర్ హీరోల‌ను వాడుకోవ‌డం అల‌వాటుగా మారిపోయింది. ఇప్పుడు నాగ‌శౌర్య కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. కాక‌పోతే ఈయ‌న ఒకే కుటుంబాన్ని టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడు ఈయ‌న న‌టిస్తున్న సినిమాకు న‌ర్త‌న‌శాల అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య కాసేపు గే పాత్ర‌లో న‌టిస్తాడ‌ని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో అజ‌య్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈయ‌న పాత్ర సినిమా అంతా గే గానే ఉంటుంద‌ని.. కాసేపు కారెక్ట‌ర్స్ మార్చుకోవాల్సి వ‌చ్చిన‌పుడే శౌర్య అలా మార‌తాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే న‌ర్త‌న‌శాల పేరుతో ఎన్టీఆర్ 60 ఏళ్ల కిందే సినిమా చేసాడు. అది ఆల్ టైమ్ క్లాసిక్. ఇదే టైటిల్ తో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నాగ‌శౌర్య‌. ఛ‌లో త‌ర్వాత మ‌రోసారి సొంత బ్యాన‌ర్ లో ఈయ‌న న‌టిస్తున్న సినిమా ఇది. ఇది కాకుండా భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద్ ప్ర‌సాద్ తో ఈ మ‌ధ్యే కొత్త ద‌ర్శ‌కుడు రాజా కొల‌స‌తో ఓ సినిమా మొద‌లుపెట్టాడు. 

దీనికి బాల‌య్య కామెడీ క్లాసిక్ నారినారి న‌డుమ మురారి టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టించ‌బోతున్నారు. రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. ఈ రెండు టైటిల్స్ నంద‌మూరి హీరోల‌కు సంబంధించిన‌వే. అనుకుని పెట్టారా లేదంటే క‌థ‌కు అలా కుదిరిందా తెలియ‌దు కానీ ఒకేసారి రెండు నంద‌మూరి టైటిల్స్ ను వాడేసుకుంటున్నాడు నాగ‌శౌర్య‌. పైగా రెండూ క్లాసిక్ టైటిల్స్. మ‌రి వీటితో శౌర్య హిట్ కొట్ట‌క‌పోయినా ప‌ర్లేదు కానీ చెడ్డ‌పేరు తీసుకురాక‌పోతే చాలంటున్నారు అభిమానులు. ఎందుకంటే ఈ మ‌ధ్య శంక‌రాభర‌ణం.. జంబ‌ల‌కిడిపంబ లాంటి క్లాసిక్ టైటిల్స్ ను వాడుకుని పూర్తిగా నాశ‌నం చేసారు. అందుకే ఇప్పుడు నంద‌మూరి అబిమానులు నాగ‌శౌర్య‌ను చూసి భ‌య‌ప‌డుతున్నారు.  
 

More Related Stories