English   

అఖిల్ సినిమాలో నాగార్జున హ్యాండ్.. రీషూట్ చేయాలంటూ డిమాండ్..

Nagarjuna
2020-06-04 16:17:43

నాగార్జున అద్భుతమైన హీరోనే కాదు.. మంచి ఎడిటర్ కూడా. తన సినిమాలతో పాటు తన కొడుకుల సినిమాలు కూడా పూర్తయిన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో కూర్చొని వాటికి మార్పులు చేర్పులు చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకు నాగార్జున కొన్ని మార్పులు సూచించాడని తెలుస్తోంది. సినిమా మొత్తం చూసిన తర్వాత దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కొన్ని సీన్లు ఎడిట్ చేయాలని ఆర్డర్ వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఎడిట్ రూంలో కూర్చొని కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా నాగార్జున తీసి వేయించారని వార్తలు వినిపిస్తున్నాయి. అవసరమైతే కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాలని భాస్కర్ కు నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. 

అఖిల్ కెరీర్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కీలకంగా మారింది. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ కావడంతో నిలబడాలి అంటే కచ్చితంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా హిట్ కావాల్సిందే. దానికితోడు అప్పుడెప్పుడో పదేళ్ల కింద పరుగు సినిమాలో పర్లేదనిపించిన బొమ్మరిల్లు భాస్కర్ దీనికి దర్శకుడు కావడంతో అంచనాలు కూడా పెద్దగా లేవు. అయితే గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండటంతో కాస్తోకూస్తో ఆసక్తి పెరిగింది. ఇక ఇప్పుడు సినిమా మొత్తం పూర్తయిన తర్వాత చూస్తే కొన్ని సన్నివేశాలు నాగార్జునకు నచ్చలేదని తెలుస్తోంది. దాంతో వాటిలో కొన్ని మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నాడు బొమ్మరిల్లు భాస్కర్. 

ముందు ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలి అనుకున్నా కరోనా కారణాలతో ఇప్పుడు ఆగస్టు లేదంటే సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. పూజా హెగ్డే ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా నటిస్తోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. మరి నాగార్జున చెప్పిన మార్పులతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 

More Related Stories