పచ్చీస్ టైటిల్ లోగో ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నాగార్జున

ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ పతాకాలపై కౌశిక్ కుమార్ కత్తూరి, రామసాయి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'పచ్చీస్'. ఆద్యంతం ఉత్కంఠతను రేకెత్తించే క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకృష్ణ, రామసాయి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ అయిన రామ్స్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. సినిమాలో శ్వేతా వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్‌ను కింగ్ నాగార్జున ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఆవాసా చిత్రం, రాస్తా ఫిలిమ్స్ కలిసి రామ్స్ హీరోగా నిర్మిస్తోన్న 'పచ్చీస్' మూవీ మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నాను. టైటిల్, ఫస్ట్ లుక్ బాగున్నాయి. రామ్స్ నాకు పదేళ్ల నుంచీ తెలుసు. నా 'రగడ' చిత్రానికి పనిచేశాడు.
వెరీ హార్డ్‌వర్కింగ్, వెరీ క్రియేటివ్. ఎప్పుడూ కాస్ట్యూమ్ డిజైనింగే చేస్తాడా లేక సినిమాల్లోకి వస్తాడా.. అని మనసులో అనుకొనేవాడ్ని. నేను అనుకున్నట్లే ఇప్పుడు 'పచ్చీస్' సినిమాతో హీరోగా వస్తున్నాడు. కచ్చితంగా ఇది అతనికి సక్సెస్ నిస్తుందని నాకు తెలుసు. డైరెక్టర్ శ్రీకృష్ణకు మంచి పేరు, విజయం దక్కాలని ఆశిస్తున్నాను" అని చెప్పారు. లోగో, ఫస్ట్ లుక్‌లను హీరో నాగార్జున లాంచ్ చేసినందుకు హీరో రామ్స్.. డైరెక్టర్ శ్రీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్‌కు చెందిన ఆరేడుగురు స్టూడెంట్స్ ఈ సినిమాకు వర్క్ చేశారని వారు చెప్పడంతో నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. తాను టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు ఇతర భాషాల్లోనోని హీరోలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశానని రామ్స్ చెప్పారు. ఇప్పటికే 'పచ్చీస్' సినిమా షూటింగ్ పూర్తయ్యిందని. సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుదిదశలో ఉన్నాయని అన్నారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.