English   

నాని ఇంకా స్టార్ హీరో కాలేదా

Gangleader.jpg
2019-09-15 23:15:40

అదేంటి హిట్ సినిమాల నానిని పట్టుకుని స్టార్ హీరో కాలేదు అనడం ఏమైనా బాగుందా.. అసలు ఆయన ఇప్పుడు స్టార్ట్ కాకపోవడం ఏంటి.. చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ కోరుకునే హీరో నాని ఒక్కడే కదా అనుకుంటున్నారా. నిజమే కానీ నాని కోరుకున్న ఇమేజ్ మార్కెట్ మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఒప్పుకోడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఎందుకంటే నిన్న గాక మొన్న వచ్చిన విజయ్ దేవరకొండ సినిమాలు తొలి రోజు ఎలాంటి టాక్ వచ్చినా కూడా 10 కోట్ల షేర్ వసూలు చేస్తున్నాయి. మొన్న విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా కూడా తొలి రోజు పది కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది.

ఒక స్టార్ హీరోకు ఉండాల్సిన ప్రధాన లక్షణం టాక్ తో పనిలేకుండా ఓపెనింగ్స్ తీసుకురావడం. ఈ విషయంలో నాని చాలా వెనుకబడి ఉన్నాడు. ఈయన సినిమాలు తొలిరోజు ఇంకా నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలోనే వసూలు చేస్తున్నాయి. ఇదే ఇప్పుడు దర్శక నిర్మాతలను కంగారు పెడుతున్న విషయం. ఎందుకంటే వరుస విజయాలతో దుమ్ములేపుతున్న నాని స్టార్ ఇమేజ్ విషయంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నాడు. ఇప్పుడు విడుదలైన గ్యాంగ్ లీడర్ సినిమా కూడా తొలి రోజు కేవలం ఆరు కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. నిజానికి నాని విక్రమ్ కె కుమార్ ఇమేజ్ బట్టి ఈ సినిమా తొలి రోజు 10 కోట్ల వరకు తీసుకు వస్తుందని అంచనా వేశారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ అలాంటి అద్భుతాలు జరగలేదు. సినిమా కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసింది. రెండో రోజు 5 కోట్ల వరకు వసూలు చేసింది. నాని ఎప్పుడైతే టాక్ తో పనిలేకుండా తొలిరోజు 10 కోట్ల వరకు షేర్ తీసుకొస్తాడో అప్పుడే పూర్తిస్థాయి స్టార్ హీరో అయినట్లు అంటున్నారు ట్రేడ్ పండితులు.

రెండేళ్ల కింద విడుదలైన ఎంసీఏ సినిమా యావరేజ్ టాక్ తో తొలి రోజు 9 కోట్లకు పైగా షేర్ తీసుకువచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నాని సినిమాలు అలా చేయడం లేదు. జెర్సీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కూడా కేవలం ఆరు కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుని 6 కోట్ల దగ్గరే ఆగిపోయింది. మరి ఫ్యూచర్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.

More Related Stories