English   

నీదినాది ఒకేక‌థ‌ రివ్యూ

Needi-Naadi-Oke-Katha-Review,
2018-03-23 07:59:07

కొన్ని సినిమాలు టైటిల్ తోనే ఆస‌క్తిని పుట్టిస్తుంటాయి. అలాంటి సినిమా నీదినాది ఒకేక‌థ‌. ఏంటో తెలియ‌దు కానీ ఈ సినిమాపై మొద‌ట్నుంచీ పెద్ద‌గా అంచ‌నాల్లేవు కానీ ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఏదో ఉంద‌నే ఆస‌క్తి మొద‌లైంది. మ‌రి ఇప్పుడు సినిమా విడుద‌లైంది. నిజంగానే ఈ చిత్రంలో అంత విష‌యం ఉందా..? ఈ క‌థ ఎలా ఉంది..? 

క‌థ‌: చ‌దువు రాక‌.. డిగ్రీ కూడా పాస్ కాలేక ఇంట్లోనే తండ్రితో చివాట్లు తినే ఓ కొడుకు సాగ‌ర్(శ్రీ‌విష్ణు). ఎప్పుడూ క్రికెట్.. సినిమాలు అంటూ అల్ల‌రిగా ఫ్రెండ్స్ తో తిరుగుతుంటాడు. డిగ్రీ కూడా పాస్ కాలేని కొడుకుని చూసి.. జీవితంలో ఏం అవుతాడో అని నిత్యం కంగారు ప‌డే తండ్రి (దేవీ ప్ర‌సాద్). తాను ఓ టీచ‌ర్ అయ్యుండి త‌నయున్నే దారిలో పెట్ట‌లేక‌పోయానే అని బాధ ప‌డుతుంటాడు. తండ్రి బాధ చూడ‌లేక తండ్రికి న‌చ్చిన‌ట్లు మారదాం  అని ఫిక్స్ అయిపోయి ఏవేవో చేస్తాడు సాగ‌ర్. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ కాదు. ఆ స‌మ‌యంలో సాగ‌ర్ జీవితంలోకి వ‌స్తుంది ధార్మిక (స‌ప్న‌టైటిస్). ఏళ్లు గడుస్తున్నా ఏం చేయాలో తెలియ‌క మాన‌సిక రోగిలా మారిపోతుంటాడు సాగ‌ర్. చివ‌రికి ఇత‌ను ఏం అయ్యాడు..? త‌ండ్రి మెప్పు పొందాడా లేదా అనేది అస‌లు క‌థ‌.

క‌థ‌నం: త‌మ‌కు న‌చ్చిందే చేయాల‌ని పిల్ల‌ల‌పై అభిప్రాయాల‌ను రుద్దే పేరెంట్స్.. త‌న‌కు న‌చ్చింది మాత్ర‌మే చేస్తాను.. మీరు చెప్పింది నాకు రాదు అని వాళ్ల‌తో వాదించే పిల్ల‌లు. ఇది ప్ర‌తీ ఇంట్లో జ‌రిగే తంతే. దీన్నే సినిమాగా తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల‌. చిన్న‌ప్ప‌ట్నుంచీ వాళ్లేం కావాలో కూడా పేరెంట్సే నిర్ణ‌యిస్తుంటారు. కానీ వాళ్ల‌కు మాత్రం మ‌న‌సు మ‌రో ద‌గ్గ‌ర ఉంటుంది. అది అర్థం చేసుకోవ‌డం చాలా క‌ష్టం. దాన్ని అర్థం చేసుకునేవాళ్లు కూడా చాలా త‌క్కువ మందే ఉంటారు. అలాగ‌ని పేరెంట్స్ ను త‌ప్పు అనలేం. పిల్ల‌లు మంచి పొజిష‌న్ లో ఉంటే ముందుగా ఆనందించేది త‌ల్లిదండ్రులే. కానీ వాళ్ల ప‌రువు ప్ర‌తిష్ట కోసం పిల్ల‌ల‌పై త‌మ భావాలు రుద్దేస్తున్నార‌నే విష‌యాన్ని సున్నితంగా చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు ద‌ర్శ‌కుడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదే నీదినాది ఒకేక‌థ‌. ఫ‌స్టాఫ్ లో చాలా వ‌ర‌కు సీన్స్ ఫ‌న్నీగా ఉన్నాయి. ఎంట‌ర్ టైనింగ్ గానే వెళ్లింది సినిమా. హీరో ఎంట్రీ నుంచి త‌ను చేసే ప్ర‌తీ ప‌ని కామెడీగానే చూపించాడు ద‌ర్శ‌కుడు. క‌థ‌లో సీరియ‌స్ నెస్ వ‌చ్చేస‌రికి మ‌రీ వేదాంత ధోర‌ణిలోకి వెళ్లిపోయింది సినిమా. ఏ తండ్రి కూడా త‌న కొడుకు మ‌రీ అంత‌గా దిగ‌జారిపోతుంటే చూడ‌లేడు.. అలాగ‌ని కొడుకు కూడా తండ్రిని బాధ పెట్టాల‌ని అనుకోడు.. ఈ బ్యాలెన్సింగ్ సీన్స్ ఇంకాస్త బాగా రాసుకునుంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ మ‌రీ ఈజీగా తేల్చేసాడు ద‌ర్శ‌కుడు. న్యాచుర‌ల్ గా ఉంటుంద‌ని చెప్పాడో ఏమో కానీ ఇది చాలా మందికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. కానీ ప్ర‌శంస‌ల ద‌గ్గ‌ర మాత్రం ఆగే సినిమా అవుతుంది ఇది.

న‌టీన‌టులు:  కెరీర్ మొద‌ట్నుంచీ డిఫెరెంట్ సినిమాల‌తో అల‌రిస్తున్న శ్రీ‌విష్ణు.. ఈ సారి కూడా బాగానే న‌టించాడు. సాధార‌ణ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ఇళ్ల‌లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకుని.. ఎలా ఉండాలో తెలుసుకోలేని అయోమ‌య ప‌రిస్థితుల్లో ఉండే చ‌దువు రాని అబ్బాయిగా బాగా న‌టించాడు శ్రీ‌విష్ణు. ఇక హీరోయిన్ స‌ప్న‌టైటిస్ ప‌ర్లేదు. న‌ట‌న ప‌రంగా ఓకే. దేవీప్ర‌సాద్ కారెక్ట‌ర్ సినిమాకు బ‌లం. తండ్రి పాత్ర‌లో ఆయ‌న బాగా న‌టించాడు. తండ్రీ కొడుకుల మ‌ధ్య వ‌చ్చే సీన్స్ బాగున్నాయి. పోసాని ఉన్న‌ది రెండు సీన్లే అయినా బాగున్నాయి. ఇక మిగిలిన పాత్ర‌ల్లో ఎవ‌రి పాత్ర ప‌రిధి మేర‌కు వాళ్లు బాగానే న‌టించారు.

టెక్నిక‌ల్ టీం: సురేష్ బొబ్బిలి సంగీతం బాగుంది. ఆర్ఆర్ ప‌ర్లేదు కానీ మ‌రీ ఆఫ్ బీట్ సినిమాకు కొట్టిన‌ట్లుగా అనిపించింది. తోట రాజు ఎడిటింగ్ ఓకే. రెండు గంట‌ల సినిమానే ఉన్నా కూడా ఎందుకో కానీ సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన‌ట్లు అనిపించింది. సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్పుకోడానికి ఏమీ లేదు. అన్నీ న్యాచుర‌ల్ లొకేష‌న్లు కాబ‌ట్టి సింపుల్ గా బాగుంది. ఇక ద‌ర్శ‌కుడు వేణు ఉడుగుల తొలి సినిమాకే చాలా స్ట్రాంగ్ కంటెంట్ తీసుకున్నాడు. స‌మాజానికి ఏదో మెసేజ్ ఇద్దామ‌ని రాసుకున్న క‌థ ఇది. కానీ అది అంత బాగా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ ఈయ‌న చెప్పాల‌నుకున్న క‌థ మాత్రం ప్రేక్ష‌కుల‌కు రీచ్ అవుతుంది. తండ్రి కొడుకు.. ఇక్క‌డ ఎవ‌రూ త‌ప్పు కాదు.. అందుకే ఎవ‌ర్నీ త‌క్కువ చేయ‌కుండా చేసే బ్యాలెన్సింగ్ లో క‌థ‌లో బ్యాలెన్స్ త‌ప్పింది. ద‌ర్శ‌కుడిగా తొలి అడుగు ఆలోచింప‌చేసే సినిమాతో వేసాడు వేణు. దానికి అత‌డు అభినంద‌నీయుడు.

చివ‌ర‌గా:  నీదినాది ఒకేక‌థ‌.. ఇది అంద‌రిక‌థే.. కాక‌పోతే క‌నెక్ట్ అయ్యేది కొంద‌రికే..

రేటింగ్: 2.75/5

More Related Stories