English   

నేల‌టికెట్ మూవీ రివ్యూ

నేల‌టికెట్ మూవీ రివ్యూ
2018-05-25 13:56:22

రివ్యూ: నేల‌టికెట్ 
న‌టీన‌టులు: ర‌వితేజ‌, మాళ‌విక శ‌ర్మ‌, జ‌గ‌ప‌తిబాబు, కౌముది, శ‌ర‌త్ కుమార్, సంప‌త్..
స్క్రీన్ ప్లే: స‌త్యానంద్
సంగీతం: శ‌క్తికాంత్ కార్తిక్
నిర్మాత‌: రామ్ తళ్లూరి
క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌

నేల‌టికెట్.. ఈ టైటిల్ లోనే చాలా మాస్ ఉంది.. పైగా సినిమాలో మాస్ రాజా ఉన్నాడు. ఇంకేంటి సినిమా అదిరిపోతుంది అనే అంచ‌నాలున్నాయి. పైగా సోగ్గాడే చిన్నినాయ‌నా, రారండోయ్ వేడుక చూద్దాం త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా.. దాంతో నేల‌టికెట్ పై ఆస‌క్తి పెరిగింది. మ‌రి వాటిని ఈ చిత్రం అందుకుందా..? ర‌వితేజ కోరుకున్న హిట్ ఈ చిత్రం అందించిందా..?

క‌థ‌:
ర‌వితేజ ఓ అనాథ‌. ఆయ‌న చుట్టూ న‌లుగురు హ్యాపీగా ఉంచాల‌నుకునే ర‌కం. త‌న‌తో పాటు ఓ చెల్లి.. న‌లుగురు స్నేహితులు ఉంటారు. విశాఖలో ఓ దొంగ సాక్ష్యం చెప్పి పోలీసుల ద‌గ్గ‌ర లాక్ అయిపోతాడు ర‌వితేజ‌. దాంతో అక్క‌డ్నుంచి త‌ప్పించుకుని హైద‌రాబాద్ వ‌స్తాడు. వ‌చ్చిన వెంట‌నే తొలి చూపులోనే డాక్ట‌ర్ మాళ‌విక‌(మాళ‌విక శ‌ర్మ‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె కోసం తిరిగి ప్రేమ‌లో ప‌డేస్తాడు. అదే స‌మ‌యంలో హోమ్ మినిస్ట‌ర్ ఆదిత్య భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు) తో గొడ‌వ‌ పెట్టుకుంటాడు. అంద‌రి ముందు ఆయ‌న‌కు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. ఆ త‌ర్వాత ర‌వితేజ జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి.. అస‌లేంటి ఆ సంఘ‌ట‌న‌లు..? అస‌లు రిపోర్ట‌ర్ గౌత‌మి(కౌముది)తో ర‌వితేజ‌కు ఏంటి సంబంధం అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: 
ర‌వితేజ సినిమాలంటే కొత్త క‌థ‌లు ఎవ‌రూ ఊహించ‌రు కానీ క‌నీసం ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంద‌ని మాత్రం న‌మ్ముతారు. ఆయ‌న సినిమాల‌న్నీ అలాగే ఉంటాయి కూడా. కానీ ఇప్పుడు అది పోతుంది.. నేల‌టికెట్ చూసిన త‌ర్వాత ర‌వితేజ నుంచి ఇంకా ఇలాంటి సినిమాలు ఎందుకు వ‌స్తున్నాయి అని అనుమానం వ‌స్తుంది. న‌లుగురుకు సాయం చేయాల‌నేది మంచి క‌థ‌. అనాథ‌గా ఉన్న హీరో అంద‌రికీ మంచి చేయాల‌నుకోవ‌డం.. త‌న చుట్టూ క‌ష్టం క‌నిపిస్తే ఎదురెళ్లి యుద్ధం చేయ‌డం నిజానికి మంచి లైన్. కానీ దానికి ప‌ర్ ఫెక్ట్ స్క్రీన్ ప్లే కూడా ప‌డాలి క‌దా..! ఆ విష‌యంలో సీనియ‌ర్ రైట‌ర్ స‌త్యా నంద్ స‌రైన న్యాయం చేయ‌లేక‌పోయాడు. తెలిసిన క‌థ‌నే మ‌రింత రొటీన్ స్క్రీన్ ప్లే ఇచ్చి నేల‌టికెట్ ను నేల‌కు దించేసారు. తొలి సీన్ నుంచి ఇది ప‌క్కా రొటీన్ సినిమా అనేలా ముద్ర ప‌డిపోతుంది. ఎక్క‌డా కొత్త‌ద‌నం క‌నిపించ‌కుండా మూస‌గా వెళ్లిపోతుంటుంది. హీరోకు అవ‌స‌రం అయిన‌పుడు ఓ గొడ‌వ‌.. కావాల‌నుకున్న‌పుడు హీరోయిన్ తో ఓ పాట‌.. బోర్ కొడితే కావాల‌ని వ‌చ్చే కామెడీ.. ఇలా సాగిపోతుంది నేల‌టికెట్. బ్ర‌హ్మానందం ఎందుకు ఈ చిత్రంలో ఉన్నాడో ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కు అయినా క్లారిటీ ఉందో లేదో మ‌రి..? క‌థ‌తో సంబంధం లేకుండా పృథ్వీ అండ్ బ్యాచ్ తో కామెడీ వ‌స్తుంది. అది కూడా న‌వ్వించ‌లేని కామెడీ. హోమ్ మినిస్ట‌ర్ తో గొడ‌వ కూడా ఊహించిన‌ట్లుగానే ఉంటుంది. హీరో, విల‌న్ మ‌ధ్య స‌రైన వైరం కూడా చూపించ‌డు ద‌ర్శ‌కుడు. రియాలిటీకి మరీ దూరంగా ఉండే స‌న్నివేశాలు కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సందేశాన్ని ఇవ్వాల‌నుకున్నా అది స‌రైన దారిలో వెళ్ల‌క‌పోయేస‌రికి విజిల్స్ వేయించుకునే స‌బ్జెక్ట్ కాస్తా నేల‌కు జారిపోయింది. 

న‌టీన‌టులు:
ర‌వితేజ న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఎప్ప‌ట్లాగే చంపేసాడు. అనాధ‌గా మొద‌లై.. చుట్టూ ప‌దిమంది చేరిపోయే వ‌ర‌కు త‌న పాత్ర‌ను బాగానే ర‌క్తి క‌ట్టించాడు మాస్ రాజా. కానీ క‌థే ఆయ‌న‌కు స‌హ‌క‌రించలేదు. ఇక హీరోయిన్ మాళ‌విక అనుకున్న‌ట్లుగానే కేవ‌లం అందాల ఆర‌బోత‌తో పాటు పాట‌ల‌కు ప‌నికొచ్చింది. ర‌వితేజ చెల్లిగా కౌముది ప‌ర్లేదు. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా రొటీన్ అనిపించాడు. కొత్త‌గా అయితే ఏం లేదు కానీ బాగానే చేసాడు. శ‌ర‌త్ కుమార్ గెస్ట్ అప్పియ‌రెన్స్ బాగుంది. హీరో ఫ్రెండ్స్ గా అలీ, ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ బాగా చేసారు. మిగిలిన వాళ్లంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం:
నేల‌టికెట్ కు అతిపెద్ద మైన‌స్ మ్యూజిక్. ఫిదాకు అదిరిపోయే సంగీతం అందించిన శ‌క్తికాంత్ కార్తిక్ ఈ సారి మాత్రం పూర్తిగా తేలిపోయాడు. పూర్తిగా మాస్ స‌బ్జెక్ట్ కావ‌డంతో త‌న మార్క్ చూపించ‌లేదు. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు. ఎడిటింగ్ వీక్.. ఎందుకంటే మూడు గంట‌ల సినిమా చూడ‌లేరు ప్రేక్ష‌కులు. మ‌ధ్య‌లో కొన్ని సీన్లు బోర్ కొట్టించేసాయి. అస‌లు బ్ర‌హ్మానందం ఎందుకున్నాడో ఎవ‌రికీ అర్థం కాదు. క‌థ మంచిదే కానీ క‌థ‌నం బాగోలేదు. తెలిసిన క‌థే కావ‌డంతో క‌ళ్యాణ్ కృష్ణ కొత్త ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది.. కానీ లేదు అందుకే సినిమా కూడా నేల‌టికెట్ మాదిరి నాసీరకంగానే ఉంది. ప్రొడ‌క్ష‌న్ వైజ్ గా మాత్రం సినిమా రిచ్ అనిపించింది.

చివ‌ర‌గా:
నేల‌టికెట్.. విజిల్స్ క‌ష్ట‌మే బాసూ..!

రేటింగ్ : 2/5

More Related Stories