English   

స్టార్స్ భళా.. క్రేజ్ లేదేలా..?

Nani-nagarjuna
2018-09-25 11:08:12

స్టార్స్ ఫుల్.. క్రేజ్ నిల్.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. యస్.. ఈ 27న విడుదల కాబోతోన్న సినిమాలకు సంబంధించిన ఈ మాట బాగా పనిచేస్తుంది. పేరుకు డబ్బింగ్ సినిమా అయినా నవాబ్ భారీ సినిమా. పైగా దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న దర్శకుడు మణిరత్నం నుంచి చాలాకాలం తర్వాత వస్తోన్న మల్టీస్టారర్. ఇప్పటికే కథ విషయంలో కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిజమా కాదా అనేది తర్వాతి విషయమైతే.. మరో మూడు రోజుల్లో విడుదల కాబోతోన్న ఈ మూవీపై పెద్దగా ఆ మాటకొస్తే అసలు క్రేజ్.. లేదనే చెప్పాలి. మణిరత్నంతో పాటు మనకు బాగా తెలిసిన అరవింద్ స్వామి, శింబుతో పాటుగా సమ్మోహన సోయగం అదితిరావు హైదరి, జ్యోతిక వంటి వారూ ఉన్నారు. మనకు పెద్దగా తెలియకపోయినా మంచి ఆర్టిస్ట్ అనిపించుకున్న విజయ్ సేతుపతి సైతం ఉన్నాడీ మూవీలో. అయితేనేం అక్కడెలా ఉందో కానీ తెలుగులో మాత్రం నవాబ్ గురించి పట్టించుకున్నవారే లేరు. ఆఖరికి మణిరత్నంను విపరీతంగా అభిమానించేవారు కూడా నవాబ్ విషయం పట్టించుకోవడం లేదు. ఆశ్చర్యంగా దాదాపు ఇదే సిట్యుయేషన్ తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ అనుకున్న దేవదాస్ పై కూడా ఉంది. 

నాగార్జున, నాని కలిసి తొలిసారిగా నటించిన మల్టీస్టారర్ దేవదాస్ పై ఊహించినంత గొప్ప క్రేజ్ అయితే లేదనేది నిజం. నిజానికి ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్నారంటే ప్రేక్షకులు చాలా ఊహించుకుంటారు. అందుకు తగ్గట్టుగా అటు మాస్ .. ఇటు క్లాస్ నూ ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ నాగార్జున మాగ్జిమం ఇంటర్వ్యూస్ లో ఇది కామెడీ సినిమా అంటున్నాడు. ఇంత క్రేజ్ ఉన్న స్టార్స్ కామెడీ సినిమా చేస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది పెద్ద ప్రశ్న. పైగా డాన్ క్యారెక్టర్ కూడా చాలా తక్కువ టైమ్ ఉంటుందని చెబుతున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై నిర్మాతగా అశ్వనీదత్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఒకప్పుడు మెగా ప్రొడ్యూసర్ అన్న పేరున్నా.. ఆయన్నుంచి ఆ స్థాయి విజయం వచ్చింది ఇంద్రతోనే. తర్వాత మళ్లీ ఇంత వరకూ హిట్ మొహం చూడలేదాయన. ఈ సారైనా తన ఆశ నెరవేరి ఈ సినిమా పెద్ద విజయం ఇస్తుందనుకుంటే వీళ్లేమో ఇది కామెడీ పీస్ అంటున్నారు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా ఉన్న రష్మిక మందన్నా ఎఫెక్ట్ కూడా ఈ మూవీపై ఏ మాత్రం కనిపించడం లేదు. తనసలు ప్రమోషన్స్ లోనే లేదు. కనీసం ట్విట్టర్ లో అయినా ఈ సినిమా గురించి ఒక్కముక్కా పాజిటివ్ గా మాట్లాడిందీ లేదు. అటు మళ్లీ రావాతో ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీకి లేటెస్ట్ గా సెన్సార్ నుంచి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ వచ్చింది. మొత్తంగా సెన్సార్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైందట. నాగ్, నాని వంటి హీరోలను ఇలా కామెడీ సినిమాలో చూస్తారా అని.. మరి ఈ రెండు సినిమాలను కాదని అడల్ట్ సర్టిఫికెట్ తెచ్చుకున్న ‘నాటకం’ కమర్షియల్ గా సక్సెస్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు ట్రేడ్ అనలిస్ట్ లు. అసలే ఈ మధ్య ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ 27న జరిగే బాక్సాఫీస్ నాటకంలో నవాబ్ లు గా నిలిచే సత్తా దేవదాస్ కు ఉందా..?

More Related Stories