English   

బాలయ్య ఎన్టీఆర్ అయిన వేళ

NTR-BIOPIC

ఎన్నాళ్లుగానో ఊరిస్తోన్న నందమూరి తారకరామారావు బయోపిక్ మొదలైంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఓపెనింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎందరో సినిమా, రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభ వేడుకకు హాజరుకావడం చూస్తోంటే ఈ సినిమాపై బాలయ్యకు ఎంత నమ్మకముందో తెలుస్తోంది. ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడే వచ్చాడంటే ఇంక చెప్పేదేముందీ. మెగా క్యాంప్ నుంచి అల్లు అరవింద్ వచ్చాడు. సినిమా వారి ఆత్మబంధువు సుబ్బిరామిరెడ్డి వచ్చాడు.. ఒక్కముక్కలో చెప్పాలంటే అతిరథమహారథులంతా హాజరైన వేళ బాలకృష్ణ ఎన్టీఆర్ లా మారిపోయి ఆయన డైలాగులే చెప్పేశాడు. 

ఎన్టీఆర్ కెరీర్ లో మణిమకుటం లాంటి సినిమా దానవీరశూరకర్ణ. ఈ సినిమాలో ఆయన పోషించిన దుర్యోధనుడి పాత్ర నభూతో అన్నట్టుగా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ ఓపెనింగ్ ను బాలకృష్ణ ఆ పాత్రతోనే మొదలుపెట్టాడు. అచ్చంగా తండ్రిలా డైలాగ్స్ చెబుతూ.. ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ను అనుకరిస్తూ చెప్పిన డైలాగ్స్ కు సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఎన్టీఆర్ కీర్తిని శ్లాఘించాడు. ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అంటే తెలుగువారంతా తెలుగులో మాట్లాడ్డమే అని తేల్చి చెప్పారు.ఈ సినిమా అద్భుత విజయం సాధించాలని ఆకాక్షించారు. మొత్తంగా ఇవాళ ప్రారంభమైన ఈ సినిమాలో బాలయ్య కాక తెలిసిన మొహం అంటే శివాజీరాజా మాత్రమే ఉన్నాడు. టెక్నీషియన్స్ పరంగా ఈ సినిమాకు ప్రధాన హైలెట్ కీరవాణి సంగీతం సమకూర్చడానికి ఒప్పుకోవడమే. ఇక ఇతర తారాగణం, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు. 

More Related Stories