English   

ఆఫీస‌ర్ రివ్యూ

ఆఫీస‌ర్ రివ్యూ
2018-06-01 13:41:06

వ‌ర్మ సినిమా వ‌స్తే ఒక‌ప్పుడు ఎలా ఉంది అని అడిగేవాళ్లు ప్రేక్ష‌కులు. కానీ ఇప్పుడు అలా అడ‌గ‌డం కూడా మానేసారు. ఎందుకంటే ఆయ‌న సినిమా అంత నాసీరకం అయిపోయిందిప్పుడు. ఒక‌ప్పుడు సంచ‌ల‌నాలు సృష్టించిన ద‌ర్శ‌కుడే ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తుంటే అభిమానులు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. ఇలాంటి ద‌ర్శ‌కుడి నుంచి ఇప్పుడొచ్చిన సినిమా ఆఫీస‌ర్. మ‌రి ఇదెలా ఉంది.. నాగార్జున ఆశ‌ల్ని వ‌ర్మ నిల‌బెట్టాడా..? 

క‌థ‌: శివాజీ రావ్ (నాగార్జున‌) హైద‌రాబాద్ లో పోలీస్ ఆఫీస‌ర్. సిన్సియారిటీకి మారుపేరు. ఆ ఆఫీస‌ర్ ను ముంబైలోని ఓ కేస్ ఇన్వెస్టిగేష‌న్ లో వేస్తారు. ఆ కేస్ లో ఇరుక్కున్న మ‌రో పోలీస్ ఆఫీస‌ర్ ప‌సారి (సుధీర్ చంద్ర ప‌దిరి). ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ ను అంతం చేసిన ఈయ‌న‌పై మ‌ర్డ‌ర్ కేస్ మోపుతారు. కానీ శివాజీ టీం దాన్ని ప్రూవ్ చేయలేక‌పోవ‌డంతో మ‌ళ్లీ ప‌సారి పోలీస్ ఆఫీస‌ర్ గా ఛార్జ్ తీసుకుంటాడు. ఈ సారి త‌నే ఓ అండ‌ర్ వ‌ర‌ల్డ్ గ్యాంగ్ సిద్ధం చేస్తాడు. దాన్ని ఛేదించే క్ర‌మంలో ప‌సారి ఆడిన పాట‌కు బ‌లైపోతాడు శివాజీ. దాన్నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు.. శివాజీ చివ‌రికి ఏం చేసాడు అనేది మిగిలిన క‌థ‌..!

క‌థ‌నం: ఓ బైక్ తుడుచుకునే వాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. వాన్ని ప‌ట్టుకునే క్ర‌మంలో ప‌దిమంది పోలీసులు చ‌చ్చిపోతారు.. పెద్ద సీన్ క్రియేట్ అవుతుంది.. వాడు పోలీస్ క‌స్ట‌డీలో ఉండ‌గానే బ‌య‌టికి తీసుకొచ్చి మ‌రీ చంపేస్తారు. ఎలా చ‌చ్చిపోతాడు.. ఎవ‌రు చంపేస్తారు.. హీరో లాంటి ఆఫీస‌ర్ నీడ‌లో ఉన్న సాక్షి ఎలా చ‌చ్చిపోతాడు..? ఆ వెంట‌నే అది మ‌రిచిపోయి మ‌రో సీన్ లోకి వెళ్లిపోతాడు. అస‌లు ఈ సీన్ లో సినిమాకు సంబంధించిన క‌థే ఉండ‌దు. ఆఫీస‌ర్ లో ఇది ఓ సీన్ మాత్ర‌మే. ఇలాంటి అల్లుకునే సీన్స్ చాలానే ఉన్నాయి. అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ అంటాడు.. ఐదు నిమిషాల్లో వాన్ని క‌నిపెట్టి పోలీసులు చంపేస్తారు. పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఉన్న‌వాడే అంతా చేస్తుంటాడు కానీ ఎవ‌రికీ తెలియ‌న‌ట్లే ఉంటాడు. పోలీస్ యూనిఫామ్ లో ఉంటూ మాఫియాకు ప‌నిచేసే ఓ క్రిమిన‌ల్ ఆఫీస‌ర్ ను మ‌రో సిన్సియర్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టించాడ‌నేది ఈ క‌థ‌. ఇదే క‌థ‌ను పాత వ‌ర్మ అయితే మ‌రో రేంజ్ లో తీసుండేవాడు కానీ ఏం చేస్తాం ఇప్పుడు వ‌ర్మ మారిపోయాడు. ఆయ‌న బుర్ర కూడా మారింది. దాంతో ఈ ఆఫీస‌ర్ ను భ‌రించ‌డం క‌ష్టం. 

అర్థం ప‌ర్థం లేని సీన్స్ వ‌చ్చి బుర్ర‌ల్ని పాడు చేస్తుంటాయి. క‌థ బాగానే ఉంటుంది కానీ ఎక్క‌డో ఏదో మిస్ అయిన ఫీలింగ్ సినిమా అంతా వెంటాడుతూనే ఉంటుంది. నాగార్జున‌కు కూడా చాలా రోజులైంది క‌దా యాక్ష‌న్ సినిమాలు చేసి.. అస‌లు చేయ‌లేదు కూడా ఇలాంటి సినిమా.. అందుకే వ‌ర్మ ఏం చెబితే దానికి సై అనేసాడు. దొరికాడు క‌దా అని నాగార్జున‌ను కూడా త‌న‌కు న‌చ్చిన‌ట్లు చూపించాడు ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు మాఫియా సినిమాలంటే వ‌ర్మ‌లా తీయాల్రా అనుకునేవాళ్లు ద‌ర్శ‌కులు కానీ ఇప్పుడు బాబోయ్ ఎలా తీసినా ప‌ర్లేదు వ‌ర్మ‌లా తీయ‌క‌పోతే చాలు అంటున్నారు. రొటీన్ స్క్రీన్ ప్లే.. సాగిపోయే సీన్లు.. మ‌ధ్య‌లో అసంద‌ర్భంగా వ‌చ్చే పాట‌లు.. ఇవ‌న్నీ చూసిన త‌ర్వాత వ‌ర్మ ఎందుకు ఇంకా సినిమాలు చేస్తున్నాడా అనిపిస్తుంది. ఒక‌ప్పుడు అంత గొప్స సినిమాలు చేసింది ఈయ‌నేనా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

న‌టీన‌టులు: నాగార్జున న‌ట‌న గురించి ఏం చెప్పాలి..? ఈయ‌న త‌న పాత్ర‌లో బాగానే న‌టించాడు కానీ క‌థ ఎక్క‌డుంది న‌టించ‌డానికి. ఆఫీస‌ర్ గా చాలా అందంగా ఉన్నాడు ఈ హీరో. ఈ ఏజ్ లో కూడా ప‌ర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేస్తున్నాడు. ఇక మైరాస‌రీన్ హీరోయిన్ కాదు.. అలాగ‌ని స‌పోర్టింగ్ కారెక్ట‌ర్ కాదు.. అదోర‌కం. సుధీర్ చంద్ర విల‌న్ గా ప‌ర్లేదు. కానీ తెలుగు ఫేస్ కాదు క‌దా ఏదో డ‌బ్బింగ్ సినిమా చూసిన‌ట్లు ఉంటుంది. అజ‌య్ స‌పోర్టింగ్ కాప్ గా బాగానే చేసాడు. మిగిలిన వాళ్లంతా ఓకే.. 

టెక్నిక‌ల్ టీం: వ‌ర్మ ఈ ఆఫీస‌ర్ గురించి చెప్పిన ప్ర‌తీసారి సౌండ్స్ గురించి చాలా చెప్పాడు. కానీ ఆయ‌న చెప్పినంత‌గా ఏం అనిపించ‌వు. అవి కొన్నిసార్లు ఏదో కావాల‌ని చేసిన శ‌బ్ధాల్లా అనిపించాయి కానీ టెక్నాల‌జీలా కాదు. ఇక కెమెరా యాంగిల్స్ కేవ‌లం వ‌ర్మ‌కు మాత్ర‌మే తెలుసు. బీర్ సీసా మూతి మీద పెట్ట‌డం.. కెమెరాను హీరోల చుట్టూ తిప్ప‌డం.. ఇవ‌న్నీ వ‌ర్మ‌కు తెలిసిన విద్య‌లే. సినిమాటోగ్ర‌ఫీ ప‌ర్లేదు.. ఎడిటింగ్ ఏమ‌నాలో తెలియ‌దు. క‌థ గురించి అడ‌క్క‌పోతే బెట‌ర్.. ఎందుకంటే ఇప్ప‌టికే చాలా సినిమాల్లో వ‌ర్మ ఇదే క‌థ చెప్పాడు. కానీ మ‌రిచిపోయిన‌ట్లున్నాడు. శివ లాంటి సినిమా వ‌చ్చిన కాంబినేష‌న్ లోనే ఈ ఆఫీస‌ర్ వ‌చ్చింది.. ఏం చేస్తాం..! కాలం మారింద‌ని స‌రిపెట్టుకోవ‌డం త‌ప్ప‌. 

చివ‌ర‌గా: ఆఫీస‌ర్.. వ‌ర్మ మార్క్ మిస్సింగ్..

రేటింగ్: 1.5/5

More Related Stories