ప్రివ్యూ: ఆఫీసర్

ఆఫీసర్.. వర్మ నుంచి వస్తోన్న సినిమా ఇది. అన్ని సినిమాల మాదిరి దీన్ని కూడా లైట్ తీసుకుందామా అంటే నాగార్జున ఇందులో హీరో. ఒకటి రెండు కాదు.. పాతికేళ్ల తర్వాత మరోసారి వర్మను నమ్మి ఆఫర్ ఇచ్చాడు నాగ్. అది కూడా శివ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నాడు. మరిప్పుడు ఈయన మాటల్ని ఎలా నమ్మేది..? ఈ ఊహలన్నీ ప్రేక్షకుల బుర్రలో గిర్రున తిరుగుతుండగానే ఆఫీసర్ సెన్సార్ పూర్తైపోయింది. వాళ్లు కూడా దీన్ని చూసి బాగుందనే సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత వర్మ నుంచి ఓ మంచి సినిమా వచ్చిందంటున్నారు. యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్న కారణంతో యు కు తోడుగా ఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వర్మ నుంచి ఇప్పుడు అద్భుతాలు ఆశించడం అత్యాశే. కానీ ఆయన మనసు పెడితే కచ్చితంగా అద్భుతం కాకపోయినా ఆకట్టుకునే సినిమా అయితే వస్తుంది. ఆఫీసర్ అదే అవుతుందంటున్నాడు నాగార్జున. ముంబై నేపథ్యం లోనే ఈ చిత్రం అంతా తెరకెక్కింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన కేస్ పనిమీద ముంబై వెళ్లే ఆఫీసర్ కథ ఇది. అతడికి ఓ కూతురు ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆ కేస్ విషయంలో తన కూతురు కూడా ఇన్ వాల్వ్ అవుతుంది. అక్కడ్నుంచి ఆఫీసర్ తన కూతుర్ని కాపాడుకుని.. ఆ కేస్ ను ఎలా సాల్వ్ చేసాడనేది అసలు కథ. ఈ చిత్రం జూన్ 1 విడుదల కానుంది. హాలీవుడ్ సినిమా టేకెన్ నుంచి ఈ చిత్రాన్ని స్పూర్థి పొందారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పూర్తిగా కాకపోవడంతో నైజాంలో తానే విడుదల చేస్తున్నాడు వర్మ. మరి చూడాలిక.. ఈ ఆఫీసర్ నాగార్జున నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతాడో..?