మాస్టర్ OTT లో వర్కవుట్ కాదు.. థియేటర్స్‌లోనే..

దక్షిణాదిలో వరస విజయాలు సాధించి మార్కెట్ మరింత పెంచుకుంటున్న హీరో విజయ్. ఒకప్పుడు ఈయనకు తమిళనాట మాత్రమే ఇమేజ్ ఉండేది కానీ ఇప్పుడు తెలుగులో కూడా విజయ్ దూసుకుపోతున్నాడు. ఇక్కడ కూడా వరస విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా ఈయన నటించిన మాస్టర్ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారంటూ వచ్చిన వార్తలను నిర్మాతలు ఖండించారు. అలాంటి ఆలోచనలు తమకు లేవని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను ముందు ఎప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఈ సినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి.
ఇదిలా ఉంటే ఓటిటి రిలీజ్ పై దర్శక నిర్మాతలు కూడా స్పందించారు. థియేటర్స్ యాజమాన్యం కూడా ఓ స్టార్ హీరో ఇలా రిలీజ్ చేయడం వర్కవుట్ కాదని అంటున్నారు. దీనిపై చిత్ర నిర్మాతలు స్పష్టత ఇచ్చారు. అన్ని అడ్డంకులు తొలగిపోయిన తర్వాత తమ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేస్తామని.. కచ్చితంగా 300 కోట్లకు పైగా వసూలు చేసే సత్తా ఉన్న సినిమా మాస్టర్ అంటున్నారు వాళ్లు. గతేడాది విజయ్ నటించిన విజిల్ 280 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంత బిజినెస్ ఓటీటీలో వర్కవుట్ కాదని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట. అందుకే థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు మాస్టర్ రాదని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు.