English   

OTTలో సినిమాలు.. ఆందోళనలో డిస్ట్రిబ్యూటర్లు..

ott
2020-05-16 15:00:44

OTT.. కొన్నేళ్ల కింది వరకు కూడా దీంతో పెద్దగా పరిచయం లేదు.. కానీ ఇప్పుడు దీని గురించి పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని ఇళ్లలోకి ఈ ఓటిటి వచ్చేసింది. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైన తర్వాత ఒరిజినల్ ప్రింట్ రావాలంటే దాదాపు ఆర్నెళ్లు లేదంటే ఏడాది పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు.. విడుదలైన నెల రోజుల్లోనే ఓటిటిలో దర్శనమిస్తున్నాయి. దాంతో థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకులు కూడా తగ్గిపోతున్నారు. అయినా కూడా నిర్మాతలకు డిజిటల్ రైట్స్ రూపంలో కోట్లకు కోట్లు వస్తున్నాయి కాబట్టి పర్లేదు అనుకోవచ్చు. కానీ ఈ ఓటిటి ఎప్పుడో ఓసారి ఇండస్ట్రీ కొంప ముంచేస్తుంది అంటూ ముందు నుంచి కూడా సురేష్ బాబు లాంటి నిర్మాతలు నెత్తినోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే నెల రోజుల్లో ఒరిజినల్ ప్రింట్ అంటే థియేటర్స్ కు జనం రావడం లేదని ఆయన చెబుతుంటే.. ఇప్పుడు ఏకంగా ఓటిటిలోనే సినిమాలు విడుదల చేయాలని చూస్తున్నారు కొందరు నిర్మాతలు.

ఈ క్రమంలోనే ఆ మధ్య అమృతరామమ్ సినిమాను నేరుగా ఓటిటి ప్లాట్ ఫామ్ జి5లో విడుదల చేసారు. తెలుగులో ఇలా చేసిన తొలి సినిమా ఇదే. డిజిటల్ లో ఒరిజినల్ ప్రింట్ ఇలా విడుదల చేస్తే ఎలా అంటూ కొందరు నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. సినిమాలో దమ్ము లేక ఇలా చేస్తున్నారా.. లేదంటే నిజంగానే కరోనాకు భయపడి ఇక థియేటర్స్ కు జనం రారని ముందుగానే ఫిక్సైపోతున్నారో అర్థం కావడం లేదు. పైగా తమిళనాట కూడా తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన పొన్ మగల్ వందాల్ సినిమాను కూడా అమెజాన్ లో విడుదల చేస్తున్నారు. దాంతో థియేటర్స్ సంఘం యజమానులు సూర్యపై ఫైర్ అయ్యారు. ఆయన నిర్మించే సినిమాలను ఇకపై థియేటర్స్ లో విడుదల చేయనివ్వమని గట్టిగానే చెప్పారు. ఇప్పుడు దాంతో పాటే మరో ఆరు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ లో వచ్చేస్తున్నాయి. అందులో అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరో సినిమా కూడా ఉంది.
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన పెంగ్విన్ కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదలవుతుంది. రెండు కన్నడ.. ఓ తమిళ.. ఓ మలయాళ.. ఓ హిందీ సినిమా కూడా రానున్న నెల రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నాయి. ఇలా నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదంటున్నారు విశ్లేషకులు. ఇలా నేరుగా విడుదల చేస్తే థియేటర్స్ ఉండి లాభమేంటి..? అసలు కోట్లు ఖర్చు చేసి సినిమాలు ఎందుకు తీయాలి..? లక్షలకు ఆశపడి ఇలా రిలీజ్ చేస్తే ఎలా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇదేం కొత్త ట్రెండా అంటూ అడుగుతున్నారు. సినిమా తీసిన తర్వాత ముందు థియేటర్స్ లో రావాలి.. ఆ తర్వాత డిజటల్, టీవీలో విడుదల చేయాలి. కానీ నేరుగా ఇలా చేస్తే మధ్యలో చాలా మంది నష్టపోతారు కదా అంటున్నారు. ఇప్పుడు కష్టకాలం నడుస్తుందని.. భయపడి వెనకడుగు వేసి ఇలా సినిమాలన్నీ డిజిటల్ లోకి వెళ్లిపోతే రేపు రాబోయే సినిమాలకు వీళ్లేం చెబుతున్నట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు సినిమా అభిమానులు కూడా.

ఓటిటిలో విడుదల చేయాలనుకోవడం మంచిదే కానీ ఇప్పుడు ఇలా మాత్రం కాదంటున్నారు అంతా. సినిమాను నమ్ముకుని ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎన్నో వేల మంది బతుకుతుంటారు. అలా కాకుండా ఇలా డైరెక్టుగా డిజిటల్ లోకి విడుదల చేస్తే ఇండస్ట్రీ ఏమైపోతుంది.. దీనికి ఇండస్ట్రీ పెద్దల నుంచి కూడా సపోర్ట్ కావాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఏదేమైనా కూడా మొన్న అమృతరామమ్ టీం కొన్ని డబ్బుల కోసం తీసుకున్న నిర్ణయం రేపటి చిన్న సినిమాలకు శాపంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా ఇప్పుడు చాలా సినిమాలు కూడా ఓటిటిలో విడుదల కానుండటంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా టెన్షన్ పడుతున్నారు. ఎలాగూ థియేటర్స్ దొరకవు కదా ఇలా విడుదల చేద్దాం అని అంతా అనుకుంటే ఈ రోజు పెళ్లి చూపులు లాంటి సినిమాలు ఉండేవి కావు.. విజయ్ దేవరకొండ లాంటి వాడు వచ్చేవాడు కాదు. దయచేసి ఈ విషయం అర్థం చేసుకుని నిర్మాతలంతా ఉంటే బాగుంటుందని అంతా ఆశిస్తున్నారు.

 

More Related Stories