English   

పెద్ద సినిమాలు OTTలో విడుదలవ్వాలంటున్న ఆ నిర్మాతలు..

bollywood
2020-05-16 11:41:28

కరోనా వైరస్ కారణంగా చాలా సినిమాలు విడుదలకు నోచుకోలేదు. అన్ని భాషల్లో కలిపి రెండు నెలలుగా దాదాపు 100 సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇప్పుడు అవేం చేయాలో కూడా అర్థం కావడం లేదు. నిర్మాతలకు నిద్ర కూడా పట్టడం లేదు. ఇలాంటి సమయంలో వాళ్ల కంటి ముందు కనిపిస్తున్న ఒకే ఒక్క దారి ఓటిటి. అంటే నచ్చిన రేట్ మాట్లాడుకుని నేరుగా డిజిటల్ లో సినిమా విడుదల చేయడమే. తాజాగా అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖుర్రానా లాంటి స్టార్స్ నటించిన గులాబో సీతాబో సినిమాను జూన్ 12న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు. ఇది నిజంగానే సంచలనం. దాంతో పాటు విద్యా బాలన్ లాంటి స్టార్ హీరోయిన్ నటించిన శకుంతలా దేవి సినిమాను కూడా అమెజాన్ లోనే విడుదల చేస్తున్నారు. కానీ అలా విడుదల చేస్తే కొన్ని అనుకోని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించడంతో.. బాలీవుడ్ గిల్డ్ ప్రొడ్యూసర్లు దీనిపై స్పందిస్తున్నారు. 

వాళ్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ల యాజమానులకు ఇలాంటి కష్ట సమయాలలో తట్టుకొని నిలబడ్డానికి.. అవసరమైతే వాళ్లకు నిర్మాతలు అండగా నిలబడ్డానికి ముందుకొస్తారని గిల్డ్ తెలిపింది. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు తీవ్ర నష్టాల పాలైపోయారని.. వాళ్లు చేసిన సినిమాలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో పడిపోయాయని గిల్డ్ భావిస్తుంది. అలాంటి వాళ్లకు తమ పెట్టుబడిని వెనక్కి తీసుకురావడానికి ఇప్పుడు ఓటిటిని మించిన మార్గం లేదని గిల్డ్ అభిప్రాయపడింది. మల్టీప్లెక్స్ యజమానులు ఇస్తున్న పనికి రాని హెచ్చరికలకు నిర్మాతల గిల్డ్ ఓ మినహాయింపు కూడా ఇచ్చింది. థియేటర్లు ఓపెన్ కావడానికి చాలా సమయం పడుతుందని.. ఒకవేళ ఓపెన్ అయినా కూడా కరోనా కారణంగా ప్రేక్షకులు రారని తెలిపింది. అదే జరిగితే.. ఓవర్సీస్ మార్కెట్ దెబ్బ తింటుందని.. చిన్న బడ్జెట్ సినిమాల పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ చెబుతున్నారు. ఆ నష్టాల నుంచి తప్పించుకోవాలన్నా.. నిర్మాత బతికి బట్ట కట్టాలన్నా సినిమాలు నేరుగా ఓటిటిలో విడుదల అవ్వాల్సిన అవసరం వచ్చిందని చెబుతున్నారు వాళ్లు. పెద్ద సినిమాలు కూడా అలా విడుదలైతే పరిస్థితులు మారిపోతాయని వాళ్లు చెప్తున్నారు. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..? 
 

More Related Stories