English   

రేణు దేశాయ్ పెళ్లి కొందరికి చెంపపెట్టు

Renu-Desai-engaged
2018-06-25 09:23:53

అభిమానం హద్దులు దాటితే.. అసభ్యంగా మారడం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. తాము అభిమానించే నటుడు ఏం చేసినా తమకు నచ్చడం వారి ఇష్టం. కానీ ఆ నటులకు సంబంధించిన లేదా సంబంధించని వ్యక్తులు కూడా తమకు నచ్చినట్టే ఉండాలనుకోవడం.. తమకు నచ్చినట్టే బతకాలనుకోవడం అవివేకం కూడా కాదు మూర్ఖత్వం. అలాంటి మూర్ఖపు అభిమానులు నేడూ రేపూ బాగా పెరుగుతున్నారు. వీళ్లు అవతలి వారి నిర్ణయాలను బెదిరిస్తారు.. వ్యతిరేకిస్తారు. ఏడుస్తారు.. కానీ ఆ వ్యక్తి మానసిక స్థితి గురించి కనీసం ఆలోచించరు. బట్.. తమ వెనక తమ హీరోలు ఏం చేసినా చెల్లిపోతుంది. వాళ్లు తప్పులు చేసినా వీరికి ఒప్పే. ఇంకా చెబితే తమ దేవుడు అంటారు. దేవుడు తప్పు చేసినా ఒప్పే అంటారు. అది వారి వ్యక్తిగతం. కానీ ఈ వ్యక్తితో సామాజికంగా విడిపోయిన వ్యక్తికీ.. వ్యక్తిగత జీవితం ఉంటుంది.. కోరికలు, ఆశలూ ఉంటాయి. అవేవీ వీళ్లు ఆలోచించరు.. ఇప్పుడు రేణూదేశాయ్ రెండో పెళ్లి విషయంలో కొందరు అభిమానుల పేరుతో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. నిజానికి రేణు ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ ఈ గొడవ కాస్తైనా తగ్గేంత వరకూ ఆగాలనే ఇంత టైమ్ తీసుకుంది అని ఆమె సన్నిహితులు చెబుతారు. అంటే తమ అభిమాన నటుడి మాజీ భార్య మళ్లీ పెళ్లి చేసుకోకూడదు. అనే కొందరి మూర్ఖపు ఆలోచన నుంచి వారిని మళ్లించడానికి తను చాలా టైమే తీసుకుంది. 

మొత్తంగా రేణూ దేశాయ్ తనకు నచ్చిన వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఈ తంతు చూడకూడదనే కొడుకును తండ్రి వద్దకు పంపించింది అని కూడా అనుకోవచ్చు. అంటే తల్లిగా తన బాధ్యత నిర్వర్తిస్తూనే ఒక మహిళగా తనకు తోడు కావాలనుకుంది. ఆ వచ్చే వ్యక్తి పిల్లల్ని సరిగా చూసుకుంటాడా లేదా అనేది అభిమానులం అని చెప్పుకునేవారికి అనవసరం. వచ్చే వ్యక్తి చూసుకున్నా లేకపోయినా.. పిల్లల బాధ్యత ఖచ్చితంగా రేణూదేశాయ్ తో పాటు పవన్ కళ్యాన్ దే. ఈ విషయం వారికి తెలియనిది కాదు.. చూడకుండానూ వదిలిపెట్టరు. ఇవేవీ తెలియకుండానే రేణూదేశాయ్ కొత్త జీవితాన్ని కోరుకుంది అనుకోవడం ఎంత అవివేకం.. 

ఇక కొందరైతే రేణూ ఎంగేజ్మెంట్ గురించి చెప్పగానే విచిత్రంగా మాట్లాడుతున్నారు. ‘మా దేవుడికి చెడ్డపేరు తీసుకురావద్దు’ అని. ఈ మాట ఎంత సిల్లీగా ఉంది అనేది ఏ మాత్రం వివేచనతో ఆలోచించినా తెలిసిపోతుంది. అసలు మరో వ్యక్తి వ్యక్తిగత జీవితం తమకు నచ్చినట్టు ఉండాలనుకోవడం ఒక రకంగా నేరం కూడా. పోనీ తనేమైనా చేయరాని పనేమైనా చేస్తోందా.. చట్ట ప్రకారం విడిపోయింది. అదే చట్ట ప్రకారం ఆమెకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కుంది. ఆమె హక్కును ప్రశ్నించడం, వ్యతిరేకించడం లేదా తప్పుపట్టడం ఖచ్చితంగా నేరం. ఎందుకంటే ఆమె చర్య సమాజానికి ఏ రకంగానూ ఇబ్బంది కాదు. 
అసలు ఇన్ని చెబుతోన్న వీళ్లు.. ఇన్నాళ్లూ ఒంటరిగా ఆమె ఎలా బతికింది అనేది ఎప్పుడైనా ఆలోచించారా..? ఒంటరి మహిళలపట్ల(వారు ఏ స్థాయిలో ఉన్నా) సమాజం ఎలా ప్రవర్తిస్తుందనేది వీరికి తెలుసా..? తెలియదు.. కానీ ఆమెకు అన్నీ ‘దేవుడే’ చేస్తున్నాడు అనే భ్రమలో ఉంటారు. ఆ భ్రమల్లోనే బ్రతికేస్తుంటారు. కానీ అందరూ ఆ భ్రమల్లో ఉండరు కదా.. వారికి జీవితం కావాలి. జీవితానికో తోడు కావాలి. ఒకసారి పొరబాటు జరిగింది కాబట్టి.. అది మళ్లీ రిపీట్ కాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే తనిప్పుడీ స్టెప్ వేసి ఉంటుంది.. ఒక మాట మాత్రం నిజం.. పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరు ఆమెను చాలా ఇబ్బంది పెట్టారు. పెడుతున్నారు.. ఇది కరెక్ట్ కాదు అనేది వారికి వారే తెలుసుకోవాలి. తనిప్పుడు వారి ‘ఒదిన’ కాదు. అలా పిలవద్దని కూడా చెప్పింది. అసలు ఈ పెళ్లి చేసుకుంటే తనిక తెలుగు రాష్ట్రాలతో సంబంధం కూడా పూర్తిగా తెంచుకుంటుంది. ఇది నిజం. అంటే తన బ్రతుకేదో తను బ్రతుకుతుంది. ఒకవేళ తన పెళ్లి వల్ల వీరి ‘దేవుడి’ రాజకీయ జీవితానికి ఇబ్బంది అనుకోవడానికి కూడా లేదు కదా.. ఆమె ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడలేదు. మాట్లాడబోదు.. ఒకవేళ మాట్లాడేదే అయితే ఇప్పటికే ఏదో చెప్పి ఉండాలి.
 
ఏదేమైనా రేణూదేశాయ్ పెళ్లి కొందరు మూర్ఖపు అభిమానులకు చెంపపెట్టు. శుష్కవాదనలతో ఆమెను ఇబ్బంది పెడుతోన్న వాళ్లు ఇకనైనా అన్నీ మూసుకుని.. వారి దేవుడు లాగా మహిళలను గౌరవిస్తే మంచిది.. ఇప్పటికే ఆమెను చాలా డిస్ట్రబ్ చేశారు. ఇక ఆపేస్తే మంచిది. ఓ మహిళ తన జీవితాన్ని తాను వెదుక్కుంది. అంతే.. అంత వరకూ చూసి వీళ్లు వీళ్ల దేవుడిని ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తీసుకుంటే ఇంకా బావుటుంది.. 

More Related Stories