English   

ప్రకాష్ రాజ్ కు మరో కీలక పాత్ర

Prakash-Raj
2018-07-12 16:53:41

మోస్ట్ వెర్సటైల్ యాక్టర్స్ లో ప్రకాష్ రాజ్ ఫస్ట్ రోలో ఉంటాడని కొత్తగా చెప్పక్కర్లేదు. ఏ పాత్రైనా పాదరసంలా మారిపోతాడు. సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ ఎప్పుడో ప్రూవ్ చేసుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన కాల్షీట్ లోకి మరో మంచి పాత్ర వచ్చింది. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో ఆంధ్రుల అన్నగారు నందమూరి తారకరామారావు బయోపిక్ లో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఎన్టీఆర్ స్టార్ హీరోగా నిలదొక్కుకోవడం అత్యంత కీలక పాత్ర.. ఇంకా చెబితే గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి బి నాగిరెడ్డి. ఆయన స్థాపించిన విజయా బ్యానర్ లో వచ్చిన మొదటి చిత్రం షావుకారు నుంచి ఉమాచండీ గౌరీశంకరుల కథ వరకూ ఎన్టీఆరే హీరో. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అత్యంత గొప్పగా చెప్పుకునే పాతాళభైరవి(ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కు హీరోగా ఓ స్టార్డమ్ వచ్చింది). తర్వాత పెళ్లి చేసి చూడు, మాయా బజార్, మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు వరకూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఇవే ఎన్టీఆర్ ను ఆంధ్రుల ఆరాధ్య నటుడుగా మార్చాయంటే అతిశయోక్తి కాదు. అంటే బి నాగిరెడ్డికి ఎన్టీఆర్ బయోపిక్ లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడా పాత్రలోనే ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడు. క్రిష్ డైరక్షన్ లో వస్తోన్న ఎన్టీఆర్ బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇతర పాత్రల్లోనూ చాలా వరకూ ఉద్ధండులైన నటుల్నే తీసుకోవాలనుకుంటున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ లోకి ప్రకాష్ రాజ్ ఎంట్రీ సినిమాకు అదనపు బలం తెస్తుందనడంలో అతిశయోక్తే లేదు. 

More Related Stories