English   

షూటింగ్ అంటే భయపడుతున్న దర్శక నిర్మాతలు..

shoot
2020-05-30 07:25:58

పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రభుత్వం దగ్గరకి వెళ్లి తమ సినిమాల షూటింగ్ చేసుకోవడానికి అనుమతి కావాలి అంటూ ముందుకు వెళ్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ పెరుగుతున్న కరోనా కేసులు చూసి మాత్రం వాళ్లు కూడా భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా కేసులు ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. మే 29న ఏకంగా ఒకే రోజు 169 కొత్త కేసులు రావడంతో సినిమా ఇండస్ట్రీలో భయం మొదలైంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే జనాలతో కిటకిటలాడే ఇండస్ట్రీ. ఇక్కడ కొంత మంది ఉంటే పని జరగదు. ఒక్కొక్క సినిమాకు వందలాది మంది పని చేస్తుంటారు. ఇక రాజమౌళి లాంటి దర్శకుడి సినిమా వేలాది మంది కార్మికులు నిత్యం పనిచేస్తూనే ఉంటారు. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ నుంచి తప్పించుకొని షూటింగ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి.

దానికి తోడు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జూన్ మొదటి వారం నుంచి సినిమా షూటింగులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అనుమతులు జారీ చేస్తుంది. కానీ ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ఆలోచించాల్సిన విషయం అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం కూడా లేకపోలేదు. సినిమాకు పని చేస్తున్న యూనిట్ లో ఏ ఒక్కరికి పొరపాటున కరోనా వైరస్ వచ్చిన కూడా అది అందరికీ వ్యాపించే అవకాశం చాలా వేగంగా ఉంటుంది. అది హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు.. లేదంటే దర్శకుడు కావచ్చు. ఈ మహమ్మారి ముందు అందరూ ఒకటే.. అందుకే పెరుగుతున్న కేసులు చూసి కాస్త వెనకడుగు వేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నటీనటులు కూడా ఇప్పట్లో షూటింగ్ అంటే రావడం కష్టంగానే మారింది.

More Related Stories