PSPK 29 త్రివిక్రమ్.. PSPK 30 పూరీ జగన్నాథ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరస సినిమాలతో దుమ్ము దులిపేస్తున్నాడు. ఒక్కోసారి ఒక్క సినిమా చేయడానికే రెండు మూడేళ్లు తీసుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఏడాదికి మూడు సినిమాలు చేస్తున్నాడు. అసలు ఈయన స్పీడ్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఒకేసారి పవన్ ఇన్ని సినిమాలు చేస్తుంటే అంతా పరేషాన్ అవుతున్నారు. అయితే ఈయన మాత్రం పక్కా ప్లానింగ్ తోనే వరస సినిమాలు ఒప్పుకుంటున్నాడు.
ఇప్పటికే ఈయన 26వ సినిమా వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 15న విడుదల కానుంది. దాంతో పాటు క్రిష్ సినిమా కూడా పూర్తి చేస్తున్నాడు పవన్. ఈ సినిమా కూడా 2020లోనే విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ 28వ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రం 2020 డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. 2021 సమ్మర్ లో హరీష్ శంకర్ సినిమా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 29, 30వ సినిమాలు కూడా ఫిక్స్ అయిపోయాయని ప్రచారం జరుగుతుంది. అందులో PSPK 29 త్రివిక్రమ్.. PSPK 30 పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరూ పవన్ తో పని చేసిన దర్శకులే కావడంతో అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ కు భారీగానే బాకీ పడిపోయాడు త్రివిక్రమ్. ఆ లోటు త్వరలోనే తీరుస్తానంటున్నాడు.
ఇక పూరీ కూడా కెమెరామెన్ గంగతో రాంబాబుతో అంచనాలు అందుకోలేకపోయాడు. దాంతో ఈ సారి గట్టిగా కొడతానంటున్నాడు. పూరీ పొలిటికల్ టచ్ ఉన్న సినిమానే పవన్ తో చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇక గీతాఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ సినిమా ఉండబోతుంది. ఈ రెండు సినిమాలు 2021, 22 వరకు విడుదల కానున్నాయి.