English   

ఇవివి దారిలో వెళ్తోన్న పూరీ.. 

Puri-Jagannath
2018-04-30 10:08:10

ఇవివి స‌త్య‌నారాయ‌ణ‌తో పూరీ జ‌గ‌న్నాథ్ కు ఏంటి సంబంధం..? ఆయ‌న ఈయ‌న ఒక్క స్కూల్ కాదే అనుకుంటున్నారా..? ఒక్క విష‌యంలో మాత్రం ఇప్పుడు ఇవివిని ఫాలో అవుతున్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. అదే కొడుకు విష‌యంలో. అవును.. ఇవివి స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసాడు. కానీ ఎప్పుడైతే త‌న‌యులు న‌రేష్.. ఆర్య‌న్ రాజేష్ హీరోలు అయ్యారో.. అప్ప‌ట్నుంచి బ‌య‌టి హీరోల‌తో సినిమా చేయ‌డం మానేసారు. ఎప్పుడో ఒక‌సారి బ‌య‌ట చేయ‌డం మిన‌హాయిస్తే.. ఆయ‌న బ‌తికున్న చివ‌రి ప‌దేళ్లు త‌న‌యుల కోస‌మే క‌ష్ట‌ప‌డ్డారు. ఇప్పుడు పూరీ కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇన్నాళ్లూ బ‌య‌టి హీరోలంద‌రితోనూ సినిమాలు చేసిన పూరీ.. ఇప్పుడు త‌న‌యుడు ఆకాశ్ పై దృష్టి పెట్టాడు. ఇప్ప‌టికే త‌న‌యుడితో చేసిన మెహ‌బూబా సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మే 11న రానుంది ఈ చిత్రం. ప్ర‌స్తుతం ఈ చిత్ర ప్ర‌మోష‌న్ లోనే ఉన్నాడు పూరీ జ‌గ‌న్నాథ్. త‌న‌యుడు ఆకాష్ గురించి మాట్లాడుతూ మెహబూబా కోసం వాడు చాలా క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పాడు పూరీ. ప్రతీ సీన్లో పర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టాడని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈ సినిమా విడుద‌ల‌వ్వ‌గానే మ‌రో సినిమాను త‌న‌యుడితోనే చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేసాడు పూరీ. ఇప్ప‌టికే క‌థ కూడా రాయ‌డం మొద‌లుపెట్టాన‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ రెడీ అవ్వ‌గానే అన్ని వివ‌రాలు చెప్తానంటున్నాడు పూరీ. చూస్తుంటే ఈయ‌న కూడా ఇవివి దారిలోనే వెళ్తాడేమో..? త‌న కొడుకు ఆకాశ్ ను హీరోగా నిల‌బెట్ట‌డానికి ఇక బ‌య‌టి హీరోల‌తో సినిమాలు చేయ‌డం ఆపేస్తాడేమో మ‌రి..? 
 

More Related Stories