వైసీపీని టార్గెట్ చేసిన బండ్ల గణేష్.. PVP పై డైరెక్ట్ వార్..

సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ ఎప్పుడు ఎలా మారిపోతాడో ఎవరికీ తెలియదు. నిన్నటికి నిన్న ఈయన పరారీలో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇది జరిగి కొన్ని గంటలు కూడా గడవక ముందే ట్విట్టర్లో రెచ్చిపోయాడు ఈయన. నిర్మాత, బిజినెస్ మెన్ పీవీపీని పరోక్షంగా టార్గెట్ చేసుకొని ట్వీట్ల వర్షం కురిపించాడు గణేష్. ముఖ్యంగా తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించాడు గణేష్. ఈ ఇద్దరి మధ్య టెంపర్ సినిమా చిచ్చుపెట్టింది. టెంపర్ సినిమా వివాదం కారణంగా ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఇప్పుడు మరోసారి ఈ నిర్మాతనే టార్గెట్ చేసాడు గణేష్. ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్‌ను కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీది అంటూ మొదటి ట్వీట్‌తో రెచ్చిపోయాడు గణేష్. దానికి కొనసాగింపు ఇస్తూ.. ప్రపంచంలో నేను ఎక్కడికైనా వెళ్తే హ్యాపీగా తిరిగి వస్తాను. కొందరు స్కామ్రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తారట. అందరూ అంటుంటే నాకు తెలిసింది. అది నిజమో కాదో నాకు తెలియదు అంటూ మరో ట్వీట్ చేసాడు గణేష్.
ఇక ఆయన సినిమా తీస్తే.. ప్రతీ హీరోతో గొడవే. ప్రతీ డైరెక్టర్‌తో పంచాయితీనే. ప్రతీ నటుడితో గొడవలే. మాట్లాడితే కోర్టులు, కేసులు, ఇండస్ట్రీకి హిట్లు, బ్లాక్బస్టర్లు తెలుసు గానీ.. కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా.. డేకి, వర్కింగ్ డేకి, కాల్షీట్కు తేడా తెలియదంటూ మరో సెటైర్ వేశాడు. అలాగే మేకప్‌కు ప్యాకప్కు కూడా తేడా తెలియదు. ఇండస్ట్రీని స్కామ్ రాజాలు భ్రష్టుపట్టించారు అంటూ బండ్ల గణేష్ మరో సంచలన ట్వీట్ చేసాడు. ఇలా ఒకేరోజు వరసగా అన్ని ట్వీట్స్ చేసి అన్నింటిని వైసీపీకి ట్యాగ్ చేయడం సంచలనంగా మారుతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ డైరెక్ట్ వార్ పై పివిపి ఎలా స్పందిస్తాడో..?