English   

చ‌ర‌ణ్ ను వాడుకోలేదా ఇన్నాళ్లూ..? 

Ram-Charan
2018-04-02 13:40:42

రామ్ చ‌ర‌ణ్ అంటే కేరాఫ్ చిరంజీవి.. ఇప్ప‌టికీ కూడా. ప‌దేళ్లైంది.. ప‌ది సినిమాలు చేసాడు.. కావాల్సినంత మాస్ ఇమేజ్ ఉంది.. ఇండ‌స్ట్రీ హిట్ కూడా కొట్టాడు అయినా కూడా ఇప్ప‌టికీ చిరంజీవి కొడుకు రామ్ చ‌ర‌ణ్ అంటారు. న‌టుడిగా ఈయ‌న్ని గుర్తించ‌ని వాళ్లే చాలా మంది ఉన్నారు. చ‌ర‌ణ్ కూడా ఎప్పుడూ త‌న‌ను తాను నిరూపించుకునే పాత్ర‌ల్లో న‌టించ‌లేదు. రొటీన్ క‌థ‌ల‌తో కాలం గ‌డిపేసాడు. దాంతో విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిసింది ఈ హీరోపై. దీనికి ఎప్పుడూ బాధ ప‌డ‌లేదు.. త‌న అవ‌కాశం కోసం చూసాడు. ఇప్పుడు వ‌చ్చింది. రంగ‌స్థ‌లంలో కొత్త రామ్ చ‌ర‌ణ్ ను అందరికీ ప‌రిచ‌యం చేసాడు మెగా వార‌సుడు. గ‌త ప‌దేళ్ల‌లో చూసిన చ‌ర‌ణ్ ఈ కుర్రాడు కాదు.. ఈయ‌నెవ‌రో కొత్త‌వాడు. ఇన్నాళ్లూ ఈ హీరోలో ఉన్న ఇమేజ్ మాత్ర‌మే చూసారంతా.  కానీ సుకుమార్ ఒక్క‌డే న‌టున్ని చూసాడు. అందుకే రంగ‌స్థ‌లం వ‌చ్చింది.. అందులో సిట్టిబాబు అనేవాడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అస‌లు మ‌నం చూస్తున్న‌ది నిజంగా రామ్ చ‌ర‌ణ్ నేనా అనే అనుమానం వ‌చ్చేంతగా ఈ పాత్ర‌లోకి లీన‌మైపోయాడు చెర్రీ. ఇదే ఇప్పుడు ఆయ‌న‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంది. రంగ‌స్థ‌లం చూసిన త‌ర్వాత అంద‌రికీ అనిపించేది ఒక్క‌టే.. ఇన్నాళ్లూ రామ్ చ‌ర‌ణ్ ను ఏ ద‌ర్శ‌కుడు స‌రిగ్గా వాడుకోలేదు. ఆయ‌న‌లోనూ ఓ నటుడు ఉన్నాడు.. కానీ నిద్ర‌పోతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఆ న‌టున్ని లేప‌లేదు.. క‌నీసం ట‌చ్ చేయ‌లేదు. దాంతో అత‌డు బండ‌బారిపోయాడు. ఇప్పుడు సుకుమార్ దాన్ని త‌ట్టిలేపాడు. వ‌స్తూ వ‌స్తూనే విశ్వ‌రూపం చూపించాడు. మ‌రి ఇప్పుడు ఇన్నాళ్లూ త‌ప్పు రామ్ చ‌ర‌ణ్ లో ఉందా.. లేదంటే కొత్త క‌థ‌లు ఈయ‌న ద‌గ్గ‌రికి తీసుకెళ్ళ‌లేని ద‌ర్శ‌కుల్లో ఉందంటారా..?

More Related Stories