English   

రంగ‌స్థ‌లం 100 డేస్.. చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్..!

Ram-Charan
2018-07-09 08:42:56

అవును మ‌రి.. కాక త‌ప్ప‌దు. స‌రిగ్గా మూడు నెల‌ల కిందివ‌ర‌కు రామ్ చ‌ర‌ణ్ సినిమా అంటే కొంద‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు ప‌ట్టుకుని రెడీగా ఉండేవారు. ఏముంటుంది ఆయ‌న సినిమాల్లో.. ఓ న‌ట‌న రాదు.. చిరంజీవి పేరు పాడు చేస్తున్నాడు.. రొటీన్ సినిమాల‌తో వ‌స్తున్నాడు.. ప్ర‌యోగాలంటే భ‌యంతో వ‌ణికిపోతాడు.. చిరు ఇమేజ్ తో బ‌తికేస్తున్నాడంటూ చ‌ర‌ణ్ పై ఎన్నో విమ‌ర్శ‌లు. అందుకే క‌మ‌ర్షియ‌ల్ గా స్టార్ అనిపించుకున్నా న‌టుడిగా మాత్రం అక్క‌డే ఉన్నాడు చ‌ర‌ణ్. అలాంటి టైమ్ లో వ‌చ్చింది రంగ‌స్థలం. తాను హీరోని కాదు.. న‌టున్ని అని నిరూపించుకోడానికి చ‌ర‌ణ్ చేసిన ఈ చిత్రం సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఇలాంటి సినిమా త‌న‌కు ఇచ్చినందుకు మ‌నసారా సుకుమార్ కు థ్యాంక్స్ చెప్పాడు రామ్ చ‌ర‌ణ్. త‌న బుర్ర‌లో ఇలాంటి ఆలోచ‌న వ‌చ్చుండ‌క‌పోతే అస‌లు రంగ‌స్థ‌లం అనే ఓ సినిమా వ‌చ్చేది కాద‌న్నాడు మెగా వార‌సుడు.

ఈ రోజుల్లో సినిమాలు మూడు రోజులు దాటితే చాలనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌రీ బాగుంటే వారం రోజులు.. ఇంకా బాగుంటే మ‌రో వారం అంతే.. అక్క‌డితో దుకాణం బంద్. చాలా కొద్ది సినిమాలు మాత్ర‌మే మూడు వారాలు దాటినా కూడా థియేట‌ర్స్ లో ఉంటాయి.. క‌లెక్ష‌న్లు తీసుకొస్తూ ఉంటాయి. గ‌తేడాది బాహుబ‌లి 2, ఫిదా ఇలాగే మాయ చేసాయి. ఇక ఈ ఏడాది రంగ‌స్థ‌లం చేసింది ఈ మాయ‌. ఐదు వారాలు వ‌సూళ్లు తెచ్చిన ఈ చిత్రం.. ఆరు, ఏడు వారాంతాల్లోనూ చెప్పుకోద‌గ్గ షేర్స్ తీసుకొచ్చింది. 50 రోజుల త‌ర్వాత కూడా కొన్ని ఏరియాల్లో వ‌సూళ్లు రాబ‌ట్టింది. అమేజాన్ లో ఒరిజిన‌ల్ ప్రింట్ విడుద‌లైన త‌ర్వాత కూడా షేర్ తీసుకొచ్చిన సినిమా ఇది. ఫుల్ ర‌న్ లో 123 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అమ్మింది మాత్రం 78 కోట్ల‌కే. 

అంటే 45 కోట్ల లాభాలు తీసుకొచ్చాడు సిట్టిబాబు. తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్లు దాటేసింది ఈ చిత్ర వ‌సూళ్లు. బాహుబ‌లి కాకుండా మ‌రే సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో 80 కోట్ల షేర్ అందుకోలేదు. మార్చ్ 30న విడుద‌లైన ఈ చిత్రం ఛ‌ల్ మోహ‌న్ రంగా, కృష్ణార్జున యుద్ధం, భ‌ర‌త్ అనే నేను లాంటి సినిమాల‌ను దాటేస్తూ ఇంత స‌త్తా చూపించింది. ఒక్క యుఎస్ లోనే 3.5 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసింది. మిగిలిన దేశాల్లో క‌లిపి మొత్తం 4.8 మిలియ‌న్ వ‌సూలు చేసింది ఈ చిత్రం. దానికితోడు నైజాంలో నాన్ బాహుబలి కేట‌గిరీలో 28 కోట్ల షేర్ అందుకున్న తొలి సినిమాగా చ‌రిత్ర తిర‌గ రాసింది. మొత్తానికి 15 సెంట‌ర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. 

More Related Stories