English   

రంగ‌స్థ‌లంలో ఆ ఐదుగురే ప్రాణం.. 

Ram-charan

రంగ‌స్థ‌లం.. రంగ‌స్థలం.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ చిత్రంపై అంచ‌నాలు కూడా భారీగా పెరిగిపోయాయి. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆస‌క్తి కూడా రెండింత‌లు అవుతుంది. పైగా ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌న్నీ ఛార్ట్ బ‌స్ట‌ర్స్ కావ‌డంతో రంగ‌స్థ‌లం ఎక్క‌డో ఉంది ఇప్పుడు. బిజినెస్ కూడా ఏకంగా 80 కోట్ల‌కు చేరిపోవ‌డంతో బ‌య్య‌ర్ల‌లో భ‌యం కూడా అలాగే ఉంది. అయితే ఈ చిత్రంలో ఐదు పాత్ర‌లే కీల‌కం కానున్నాయ‌ని తెలుస్తుంది. క‌థ మొత్తం ఈ పాత్ర‌ల చుట్టూనే తిరుగుతుంది. రామ్ చ‌ర‌ణ్ కూడా ఇదే చెబుతున్నాడు. రంగ‌స్థ‌లంలో సిట్టిబాబు.. రామ‌ల‌క్ష్మీ.. కుమార్ బాబు.. ప్రెసిడెంట్.. ప్ర‌కాశ్ రాజ్.. ఇలా ఐదు పాత్ర‌ల చుట్టూనే క‌థ అంతా అల్లుకున్నాడు సుకుమార్. సిట్టిబాబుగా చ‌ర‌ణ్.. రామ‌ల‌క్ష్మిగా స‌మంత‌.. ప్రెసిడెంట్ గా జ‌గ‌ప‌తిబాబు.. కుమార్ బాబుగా ఆది న‌టించారు. ఇక ప్ర‌కాశ్ రాజ్ స‌పోర్టింగ్ కారెక్ట‌ర్ చేసారు. ఇది చ‌ర‌ణ్ కు స‌పోర్ట్ చేసే పాత్ర‌. సినిమాలో ఎమోష‌న్ కు పెద్ద‌పీట వేసాడు సుకుమార్. క్లైమాక్స్ కు వ‌చ్చేస‌రికి ప్ర‌తీ ఒక్క‌రు కంట‌నీరు పెట్ట‌డం ఖాయం అని చెబు తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఒక్క‌సారి కూడా క‌ళ్లు చెమ‌ర్చ‌క‌పోతే వాళ్లు మ‌నిషే కాదంటున్నాడు చ‌ర‌ణ్. ఓ సినిమా గురించి ఇంత‌పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే హీరోకు చాలా ధైర్యం ఉండాలి.. చ‌ర‌ణ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా ఏ సినిమా గురించి కూడా చెప్ప‌లేదు. ఫ‌స్ట్ టైమ్ రంగ‌స్థ‌లంకు ఇంతగా ఎగ్జ‌యిట్ అవుతున్నాడు. మ‌రి చూడాలిక‌.. రేపు సినిమాలోనూ ఇది క‌నిపిస్తుందేమో..? మ‌రి ఆ ఐదు పాత్ర‌లు ఎలాంటి మాయ చేయ‌బోతున్నాయో మ‌రో మూడు రోజుల్లో తేలిపోనుంది. 

More Related Stories