English   

నిన్న రంగ‌స్థ‌లం.. నేడు మ‌హాన‌టి.. 

mahanati-Rangasthalam
2018-05-11 16:55:02

ఓ సినిమాకు ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అయితే ఇంత‌గా నెత్తిన పెట్ట‌కుంటారా..? ఈ అనుమానం ఇప్పుడు రంగ‌స్థ‌లంను చూస్తే క‌లుగుతుంది. ఈ చిత్రం ఏకంగా 122 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. బాహుబ‌లి త‌ర్వాత ఓ సినిమాకు ప్రేక్ష‌కులు ఇంత‌గా బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డం ఇదే తొలిసారి. వంద కోట్ల‌కు పైగా షేర్ ఇచ్చారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు ఇది ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా మాయ చేసిందో అని..! ఈ చిత్రం ఇంత‌గా విజయం సాధించ‌డానికి కార‌ణం రియాలిటీ. అవును.. నిజ జీవితానికి ద‌గ్గ‌ర‌గా ఉండే పాత్ర‌లు.. స‌హ‌జ‌త్వంతో సుకుమార్ తెర‌కెక్కించిన విధాన‌మే రంగ‌స్థ‌లం విజ‌యానికి కార‌ణాలు. పైగా రామ్ చ‌ర‌ణ్ తో పాటు సినిమాలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు ఇది సినిమాలో న‌టిస్తున్నాం అని కాకుండా నిజంగానే ఓ ఊళ్లో జ‌రుగుతున్న క‌థ‌లా చూపించారు. అంత స‌హ‌జంగా న‌టించారు కాబ‌ట్టే ఈ రోజు సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. రంగ‌స్థ‌లంలో ఏ ఒక్క‌రి పాత్ర‌ను కూడా తీసిపారేయ‌లేం. చివ‌రికి చ‌ర‌ణ్ కింద ప‌ని చేసే మ‌హేశ్ పాత్ర‌తో స‌హా. అంత‌గా ఒక్కో పాత్ర‌పై దృష్టి పెట్టాడు సుకుమార్. అందుకే సినిమా ఇంత‌గా ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. మ‌న మ‌న‌సుకు చేరువైతే ఏ సినిమా అయినా చ‌రిత్ర‌లో నిలిచిపోవాల్సిందే.

రంగ‌స్థ‌లం త‌ర్వాత అలాంటి గొప్ప సినిమా రావ‌డానికి మ‌ళ్లీ టైమ్ ప‌డుతుందేమో అనుకున్నారంతా. కానీ నెల తిర‌క్కుండానే మ‌ళ్లీ అలాంటి గొప్ప చిత్ర‌రాజం వ‌చ్చేసింది. అదే మ‌హాన‌టి. సావిత్రమ్మ జీవితం ఆధారంగా నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి నీరాజ‌నాలు ప‌డుతున్నారు జ‌నాలు. అల‌నాటి అమ్మ‌ను చూడ్డానికి.. ఇప్పుడు థియేట‌ర్స్ కు క‌దులుతున్నారు ప్రేక్ష‌కులు. ఒక్క‌రో ఇద్ద‌రో కాదు.. ఒకేసారి ఫ్యామిలీ టికెట్లు తెగుతున్నాయి ఈ చిత్రానికి. గొప్ప సినిమా తీసావంటూ నాగ్ అశ్విన్ కు పొగడ్త‌ల వ‌ర్షం కురుస్తుంది. పైగా ఇందులోనూ పాత్రల ఎంపిక ద‌గ్గ‌ర్నుంచీ.. అవి తెర‌పై క‌నిపించే వ‌ర‌కు నాగ్ అశ్విన్ తీసుకున్న జాగ్ర‌త్త ప్ర‌శంస‌నీయం. స‌హ‌జ‌త్వానికి ద‌గ్గ‌ర‌గా కీర్తిసురేష్ తో పాటు అంతా న‌టించారు కాదు కాదు.. జీవించారు కాబ‌ట్టే ఈ రోజు మ‌హాన‌టిని గొప్ప సినిమాగా చెప్పుకుంటున్నాం. రంగ‌స్థ‌లం కానీ.. మ‌హాన‌టి కానీ ఇంత‌గా విజ‌యం సాధించ డానికి కార‌ణాలు జీవితానికి ద‌గ్గ‌రగా ఉండే క‌థ‌లే. ఇవి ఎక్క‌డో ఆకాశం నుంచి ఊడిప‌డిన క‌థ‌లు కావు.. మ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉండే స‌హ‌జ‌మైన క‌థ‌లు చేస్తే ప్రేక్ష‌కులు నెత్తిన పెట్టుకుంటారు అన‌డానికి ఈ రెండు సినిమాలే నిద‌ర్శ‌నం. 

More Related Stories