English   

ర‌ంగ‌స్థ‌లం రివ్యూ

Rangasthalam-Review
2018-03-30 12:52:42

80ల్లో క‌థ‌నం.. 3 గంట‌ల నిడివి.. భారీ బ‌డ్జెట్.. అన్నింటికీ మించి భారీ అంచ‌నాలు.. ఇన్ని ఒత్తిళ్ల మ‌ధ్య రంగ‌స్థ‌లం విడుద‌లైంది. మ‌రి ఇది ఎలా ఉంది..? ప‌్రేక్ష‌కుల్ని మెప్పించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా..?

క‌థ‌:  సిట్టిబాబు(రామ్ చ‌ర‌ణ్) రంగ‌స్థ‌లం అనే ఊళ్లో ఉంటాడు. ఆ ఊళ్లో ఏ పొలానికి నీళ్లు పెట్టాల‌న్నా సిట్టిబాబే దిక్కు. ఈయ‌నకు కాస్త చెవుడు ఉంటుంది. గ‌ట్టిగా మాట్లాడితే కానీ ఏదీ విన‌బ‌డ‌దు. ఆ ఊరు ప్రెసిడెంట్ ఫ‌ణీంద్ర భూప‌తి(జ‌గ‌ప‌తిబాబు). 30 ఏళ్లుగా ఆయ‌నే ఆ ఊరి ప్రెసిడెంట్. ఆయ‌న చెప్పిందే వేదం.. ఎదురు చెప్పే వాళ్లే ఉండ‌రు. అన్యాయం జ‌రుగుతున్నా ఎవ‌రూ నోరు మెద‌ప‌రు. అలాంటి స‌మ‌యంలో సిట్టిబాబు అన్న కుమార్ బాబు(ఆది పినిశెట్టి) వ‌చ్చి అన్యాయాల‌ను అడుగుతాడు. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తాడు. ఆయ‌న‌కు ఎమ్మెల్యే(ప్ర‌కాశ్ రాజ్) సాయం చేస్తాడు. కానీ అనుకోని రీతిలో రంగ‌స్థ‌లంలో సిట్టిబాబు జీవితం మారిపోతుంది. అస‌లు ఏం జ‌రుగుతుంది..? అస‌లు రామ‌ల‌క్ష్మి(స‌మంత‌) ఎవ‌రు..? ర‌ంగ‌మ్మ‌త్త‌(అన‌సూయ‌)తో సిట్టిబాబుకు లింక్ ఏంటి..? ఇదంతా మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: రంగ‌స్థ‌లం.. అంటే నాట‌కం అని అర్థం. సాధార‌ణంగా నాటకం ఆడే స్టేజ్ ను రంగ‌స్థ‌లం అంటారు. కానీ ఇక్క‌డ స్టేజ్ కాస్త పెద్ద‌ది. అంటే ఓ ఊరు అని అర్థం. సుకుమార్ ఓ ఊరును ఊహించుకుని రాసుకున్న క‌థ ఇది. అందులో నాయ‌కుడు ఉండ‌డు.. పాత్ర‌లు మాత్ర‌మే. వాళ్ల తీరులు మాత్ర‌మే. అందులోనే వాళ్ల ప్ర‌పంచం.. దాంతోనే వాళ్ల ప్ర‌యాణం. రంగ‌స్థ‌లంలో ఎక్క‌డా మ‌న‌కు హీరోయిజం క‌నిపించ‌దు. కానీ క‌మ‌ర్షియ‌ల్ హంగుల్లేవా అంటే ఉన్నాయి. ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమానే. క‌థ 80ల్లో ఉండ‌టం.. హీరోకు చెవుడు ఉండ‌టం.. ఈ రెండే సినిమాకు ఆస‌క్తిక‌రం. వాటిపైనే క‌థ అల్లుకున్నాడు సుకుమార్. అదే కొత్త‌ద‌నం కూడా. హీరోయిజం చూపించే సీన్స్ ఉన్నా కూడా ఎక్క‌డా ప‌క్క‌దారి ప‌ట్టించ‌లేదు సుకుమార్. క‌థ‌కు లోబ‌డి.. అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఓన్ చేసుకుని రాసుకున్నాడు సుకుమార్. అదే తెర‌పై చూపించాడు కూడా. హీరోకు చెవుడు.. దానిపైనే ఫ‌స్టాఫ్ లోని చాలా సీన్స్ అల్లుకున్నాడు. కామెడీ చేసాడు.. అదే టైమ్ లో ఎమోష‌న్స్ పండించాడు. హీరోయిన్ తో చెవుడు సీన్స్ అన్నీ కామెడీ ఉంటాయి.. కానీ అన్న చ‌నిపోతున్న సీన్ లో ఇదే చెవుడు గుండెను పిండే ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. అది ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నం. 

ఇక అన‌సూయ‌తో వ‌చ్చే ప్రతీ సీన్ సినిమాకు కీల‌క‌మే. ఆమె నుంచి ఇలాంటి పాత్ర ఊహించ‌డం చాలా క‌ష్టం. గ్లామ‌ర్ డాల్ గా చూడ‌టం అల‌వాటు చేసుకున్న అన‌సూయ‌తో రంగ‌మ్మ‌త్త కారెక్ట‌ర్ కు ఒప్పించి.. ఆమెతో సుకుమార్ చేయించు కున్న తీరు అద్భుత‌మే. ఫ‌స్టాఫ్ లో చాలా వేగంగా వెళ్లిపోతుంది. గంట‌న్న‌ర ఉన్నా కూడా బోర్ అనిపించ‌దు. క‌థ‌లో లీన‌మైపోతాం. ఒక్క‌సారి ఊళ్లో తిరుగుబాటు మొద‌లైన త‌ర్వాత అస‌లు వేగం అందుకుంటుంది. సెకండాఫ్ లో కాస్త క‌థ నెమ్మ‌దించిన మాట వాస్త‌వ‌మే అయినా క‌థ‌లో లీన‌మైపోయిన త‌ర్వాత అది మ‌న‌కు క‌నిపించ‌దు. ఎమోష‌న్స్ తో క‌నెక్ట్ అయిపోతాం. అంత‌గా ఈ సినిమాను మెస్మ‌రైజ్ చేసాడు సుకుమార్. స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో క‌ట్టి ప‌డేసాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో రెండు మూడు సీన్లు అయితే క‌న్నీరు పెట్టించాడు. క్లైమాక్స్ మ‌ళ్లీ నిల‌బెట్టింది సినిమాను. అప్ప‌టి వ‌ర‌కు కాస్త స్లో పేజ్ లో వెళ్లిన సినిమా కాస్తా చివ‌ర్లో మ‌ళ్ళీ బాగానే లేచింది. ఓవ‌రాల్ గా రంగ‌స్థ‌లం ఓ మంచి ఎక్స్ పీరియ‌న్స్. చూసి ఎంజాయ్ చేయ‌డం త‌ప్ప‌.. ఎలా ఉంది అని అడ‌గ‌లేని మంచి సినిమా. 

న‌టీన‌టులు: రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమాలో న‌టించ‌లేదు.. జీవించాడు. ప‌దేళ్ల కెరీర్ లో ఏం సాధించాడు అని ఎవ‌రైనా అడిగితే ఏం చెప్పాలో తెలియ‌క ఇన్నాళ్లూ తిక‌మ‌క ప‌డేవాడు చ‌ర‌ణ్. కానీ ఇప్పుడు చెప్పొచ్చు రంగ‌స్థ‌లం లాంటి సినిమా చేసాన‌ని. అంత‌గా ఇందులో న‌టించాడు మెగా వార‌సుడు. త‌న‌ను విమ‌ర్శించిన నోళ్ల‌కు గ‌ట్టి స‌మాధాన‌మే ఇచ్చాడు ఈ హీరో. సిట్టిబాబు పాత్ర కోసం ప్రాణం పెట్టాడు. రామ‌ల‌క్ష్మిగా స‌మంత ఒదిగిపోయింది. ప‌క్కా ప‌ల్లెటూరి అమ్మాయిలా మారిపోయింది. ఆది పినిశెట్టికి మంచి పాత్ర ప‌డింది. చ‌ర‌ణ్ త‌ర్వాత బాగా ఎలివేట్ అయిన కారెక్ట‌ర్ ఇదే. అన‌సూయ ఊహించ‌ని ప్యాకేజ్ ఈ చిత్రంలో. రంగ‌మ్మ‌త్త అంటే అదేదో వ్యాంప్ కారెక్ట‌ర్ అనుకున్న వాళ్ల‌కు షాక్ ఇచ్చాడు సుకుమార్. చాలా కీల‌క పాత్ర ఇచ్చాడు. అన‌సూయ కూడా ఈ పాత్ర‌కు న్యాయం చేసింది. ప్ర‌కాశ్ రాజ్.. జ‌గ‌ప‌తిబాబు బాగా చేసారు.

టెక్నిక‌ల్ టీం: దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టాడు అంటే కూడా త‌క్కువే అవుతుంది. అంత‌గా ఆర్ఆర్ తో సినిమా స్థాయిని పెంచేసాడు డిఎస్పీ. మ‌రీ ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే కేవ‌లం దేవీ ఆర్ఆర్ వ‌ల్లే మ‌రో రేంజ్ కు వెళ్లిపోయాయి. పాట‌లు బాగున్నాయి. జిగేల్ రాణి సాంగ్ థియేట‌ర్స్ లో అభిమానుల‌తో విజిల్స్ వేయించ‌డం ఖాయం. ఇక ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్ప‌డానికేం లేదు. ఎక్స్ ట్రీమ్ గా ఉన్నాయి విజువ‌ల్స్ అన్నీ. న‌వీన్ నూలి ఎడిటింగ్ ఓకే. సెకండాఫ్ లో కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. చంద్ర‌బోస్ లిరిక్స్ చాలా బాగున్నాయి. ద‌ర్శ‌కుడిగా సుకుమార్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్న‌పుడే ఆయ‌న స‌గం విజ‌యం సాధించాడు. అయితే క‌థ‌పై దృష్టి పెట్టి కాస్త నెమ్మ‌దిగా సాగే క‌థ‌నాన్ని ప‌క్క‌న బెట్టేసాడు సుకుమార్.

చివ‌ర‌గా: ఈ రంగ‌స్థ‌లం.. సిట్టిబాబు, సుకుమారుడి ఊహాలోకం..

రేటింగ్: 3.25/5

More Related Stories