English   

సంక్రాంతి విజేతలు ఇద్దరు.. రవితేజతో పాటు ఆయన కూడా..

 Ravi Teja KRACK
2021-01-16 14:51:42

ప్రతిసారి సంక్రాంతికి చాలా సినిమాలు వస్తుంటాయి. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ఇండస్ట్రీకి కీలకంగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ కళ్లముందు ఉంది. దాంతో సినిమాలు విడుదల చేసిన కూడా ముందుగా వసూలు వస్తాయా లేదా అనేది అందరిలోనూ ఒక అనుమానం. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ సంక్రాంతి సినిమాలు సత్తా చూపిస్తున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ పండుగకు నాలుగు సినిమాలు విడుదలైతే అందులో రెండు సినిమాలు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్నాయి. రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ జనవరి 9న విడుదలై ఐదు రోజుల్లోనే దాదాపు 18 కోట్ల షేర్ వసూలు చేసింది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఇన్ని కోట్లు వసూలు చేయడంతో పండగ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.

16 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా ఐదు రోజుల్లోనే లాభాలు తీసుకొచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత రవితేజ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం వైపుగా అడుగులు వేస్తుంది. మరోవైపు విజయ్ నటించిన మాస్టర్ సినిమా కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 5 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేసింది మాస్టర్. రెండో రోజు దాదాపు 1.6 కోట్లు షేర్ తీసుకొచ్చింది. రెండు రోజుల్లోనే ఏడున్నర కోట్ల షేర్ తో బ్రేక్ ఈవెన్ కు కేవలం కోటిన్నర దూరంలో ఉంది. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విజయం అందుకుంటున్నాయి.

మరోవైపు రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమా తొలి రోజు 6.7 కోట్ల షేర్ వసూలు చేసింది. కానీ రెండో రోజు ఈ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఇక అల్లుడు అదుర్స్ తొలిరోజు దారుణమైన టాక్ తెచ్చుకుంది. దాంతో కలెక్షన్ల వేటలో అందరికంటే వెనకబడ్డాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఎలా చూసుకున్నా కూడా ఈ సంక్రాంతికి ఇద్దరూ విజేతలవుతారు. ఇప్పటికే రవితేజ సేఫ్ అయిపోయాడు.. మరోవైపు విజయ్ కూడా దాదాపు సేఫ్ అయిపోయినట్లే. ఇక రామ్ ఏం చేస్తాడో చూడాలి. 

More Related Stories