English   

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ రివ్యూ

Ravi Teja’s Amar Akbar Anthony Review
2018-11-16 07:01:17

ర‌వితేజ‌, శీనువైట్ల సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో ఏదో తెలియ‌ని ఆస‌క్తి ఉంటుంది. వెంకీ, దుబాయ్ శీను లాంటి విజ‌యాల త‌ర్వాత ఈ కాంబినేష‌న్ లో ప‌దేళ్ల త‌ర్వాత వ‌చ్చిన సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న ఈ ఇద్ద‌రూ అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో ఎంత‌వ‌ర‌కు మెప్పించారు..?

క‌థ‌:

అమ‌ర్(ర‌వితేజ‌), ఐశ్వ‌ర్యా(ఇలియానా) చిన్న‌ప్ప‌ట్నుంచే స్నేహితులు.. ప్రేమికులు కూడా. వాళ్ల పేరెంట్స్ స్నేహితులు కావ‌డంతో వాళ్ల రెండు కుటుంబాలు ముందుగానే నిర్ణ‌యించుకుంటాయి వాళ్ల పెళ్లి గురించి. అదే టైమ్ లో వాళ్ల కంపెనీలో ప‌ని చేస్తున్న నలుగురు వ్య‌క్తులు.. ఆస్తి కోసం అంద‌ర్నీ చంపేస్తారు. కానీ ఆ యాక్సిడెంట్ నుంచి అమ‌ర్, ఐష్ బ‌య‌ట ప‌డ‌తారు. కానీ ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు మిస్ అయిపోతారు. అప్ప‌ట్నుంచి త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన వాళ్ల‌ను ఒక్కొక్క‌రుగా చంపేస్తుంటాడు అమ‌ర్. అదే స‌మ‌యంలో త‌న‌కు తెలియ‌కుండానే మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల్లా మారిపోతుంటాడు. అలా ఎందుకు మార‌తాడు.. అస‌లు అమ‌ర్ కాస్తా అక్బ‌ర్, ఆంటోనీగా ఎందుకు మారిపోతాడు అనేది క‌థ‌.

క‌థ‌నం:

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. ఈ టైటిల్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇలాంటి టైటిల్ తీసుకున్నాడు శీనువైట్ల‌. అయితే టైటిల్ కు న్యాయం మాత్రం చేయ‌లేక‌పోయాడు. రొటీన్ క‌థ‌ను తీసుకుని మ‌ళ్లీ కొత్త క‌థ అంటూ ప్రేక్ష‌కులను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసాడు వైట్ల‌. రొటీన్ రివేంజ్ ఫార్ములాకు అప‌రిచితుడు ఫార్ములాను జోడించాడు. అప‌రిచితుడులో హీరో మారిపోతుంటే ఎమోష‌న్ క‌నిపిస్తుంటుంది.. కానీ ఇక్క‌డ ర‌వితేజ మారిపోతుంటే మాత్రం ఎందుకో తెలియ‌దు కానీ కామెడీ అనిపిస్తుంది. ఎమోష‌న‌ల్ గా ఉండాల్సిన సీన్స్ కూడా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. టైమ్ బ్యాడ్ అయితే ఇలాగే ఉంటుందేమో మ‌రి..? ఏం చేసినా క‌లిసిరాదు. ఇప్పుడు వైట్ల‌కు కూడా అదే ప‌రిస్థితి వ‌చ్చింది. తొలి 15 నిమిషాల్లోనే క‌థ చెప్ప‌డంతో రొటీన్ స్క్రీన్ ప్లే కొంప ముంచేసింది. రంగ‌స్థ‌లం లాంటి సినిమాలో కూడా ఉన్న‌ది ప‌గే.. కానీ దాన్ని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసాడు సుకుమార్. కానీ శీనువైట్ల పాత క‌థ‌ను మ‌రింత పాత‌గా చెప్పాడు. దాంతో ఇంట‌ర్వెల్ వ‌ర‌కు కూడా ఎలాంటి వేగం లేకుండా క‌థ సాగింది. దాన్ని క‌వ‌ర్ చేయ‌డానికి ఆట‌, నాట అనే తెలుగు ఆర్గ‌నైజేష‌న్ ల‌పై వాటా అంటూ సెటైర్లు వేసాడు. కేఏ పాల్ అంటూ స‌త్య‌ను దించాడు. వెన్నెల కిషోర్ అండ్ బ్యాచ్ తో న‌వ్వించాల‌ని చూసినా వ‌ర్క‌వుట్ కాలేదు. సెకండాఫ్ లో సునీల్ వ‌చ్చిన త‌ర్వాత అక్క‌డ‌క్క‌డా ప‌ర్లేదు కానీ అత‌న్ని కూడా పూర్తిగా వాడుకోలేదు. క‌థ‌లో కూడా స‌గం క్లారిటీ ఉండ‌టానికి తోడు అడుగడుగునా అత‌నొక్క‌డే సినిమా గుర్తుకు రావ‌డంతో ఎక్క‌డా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ఆక‌ట్టుకునేలా లేదు. ప్రీ క్లైమాక్స్ అయితే పూర్తిగా అత‌నొక్క‌డేకు జిరాక్స్ కాపీలా ఉంటుంది. కాక‌పోతే అది హైద‌రాఆబాద్ క‌థ‌.. ఇది అమెరికా క‌థ అంతే తేడా. ఓవ‌రాల్ గా మ‌రోసారి శీనువైట్ల పూర్తిగా నిరాశ‌ప‌రిచాడు.

న‌టీన‌టులు:

ర‌వితేజ న‌ట‌న గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. మూడు పాత్ర‌ల్లోనూ బాగా చేసాడు. ముఖ్యంగా అక్బ‌ర్ పాత్ర‌లో అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. ఆంటోనీగానూ బాగున్నాడు. ఇలియానా ప‌ర్లేదు. కానీ  మున‌ప‌టి గ్లామ‌ర్ లేదు.. డ‌బ్బింగ్ బాగుంది. సునీల్ ఉన్నంత‌లో బాగా న‌వ్వించాడు. బోర్ కొడుతున్న స‌మ‌యంలో అత‌డే కాస్త రిలీఫ్. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, స‌త్య‌, రఘుబాబు బ్యాచ్ బోర్ కొట్టించారు. విల‌న్స్ అంద‌రూ ప‌ర‌మ రొటీన్ గా అనిపించారు. ఇక క‌థ‌లో కీల‌క‌మైన ఎఫ్ బి ఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో అభిమ‌న్యు సింగ్ అయితే విసుగు పుట్టించాడు. లిప్ సింక్ లేకుండా అత‌డు చేసిన న‌ట‌న చిరాకు తెప్పిస్తుంది.

టెక్నిక‌ల్ టీం:

థ‌మ‌న్ మ‌రోసారి రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఒక్క పాట కూడా ఆక‌ట్టుకోలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఎక్క‌డో విన్నట్లే అనిపించింది. ఎడిటింగ్ చాలా వీక్. క‌థ‌తో సంబంధం లేని కామెడీ సీన్స్ కూడా మ‌ధ్య‌లో ఇరికించేసారు. ముఖ్యంగా వాటా సీన్స్ కొన్ని చోట్ల బోర్ కొట్టించాయి. సినిమాటోగ్ర‌పీ బాగుంది. అమెరికా అందాల‌ను బాగా చూపించారు. ద‌ర్శ‌కుడిగా శీనువైట్ల మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు. క‌థ పాత‌దే తీసుకోవ‌డం అత‌నొక్క‌డే గుర్తు చేయ‌డం.. అప‌రిచితుడు మ‌ధ్య‌లో రావ‌డంతో క‌ల‌గాపుల‌గం అయిపోయింది. మ‌రోసారి నిరాశ త‌ప్ప‌దు. మైత్రి మూవీ మేక‌ర్స్ క‌థ‌ను కాకుండా కాంబినేష‌న్ ను న‌మ్మి స‌వ్య‌సాచి త‌ర్వాత మ‌రో షాక్ తినేసారు.

చివ‌ర‌గా: అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ ప్రేక్ష‌కుల‌పై ప‌గ తీర్చుకుంటారు.

రేటింగ్ 2.5/5

More Related Stories