English   

తెరీ ఉన్న‌ట్లా.. లేన‌ట్లా..?

Ravi-Teja
2018-07-20 19:07:22

ఒక్కోసారి కొంద‌రు ద‌ర్శ‌కుల దుర‌దృష్టం చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంటుంది. త‌మ త‌ప్పు లేకుండానే శిక్ష అనుభవిస్తుంటారు వాళ్లు. ఇప్పుడు సంతోష్ శ్రీ‌నివాస్ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈయ‌న హైప‌ర్ త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం ఏడాదిన్న‌ర‌కు పైగా వెయిట్ చేసి వెయిటింగ్ లిస్ట్ లోనే మిగిలిపోయాడు. ఇప్పుడు ర‌వితేజ కోసం చూస్తున్నాడు. హీరో మారాడు కానీ ఎదురు చూపులు అయితే మార‌డం లేదు. తెరీ సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌ని క‌థ కూడా సిద్ధం చేసుకున్నాడు సంతోష్. అంతేకాదు.. దానికి క‌న‌క‌దుర్గ అనే టైటిల్ కూడా ప్ర‌చారం ఉంది.
 
మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ర‌వితేజ‌తో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమా చేస్తున్నారు ఈ నిర్మాత‌లు. ఇప్పుడు తెరీ రీమేక్ అంటున్నారు. తెరీలో విజ‌య్ పోలీస్ ఆఫీస‌ర్.. ఇక్క‌డ కూడా ర‌వితేజ కూడా ఇదే చేయ‌బోతున్నాడు. విక్ర‌మార్కుడు త‌ర‌హాలో ఓ బిడ్డ‌కు తండ్రిగా న‌టించ‌బోతున్నాడు ఇందులో. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌ర్వాత తెరీ రీమేక్ అనుకున్నారు ఇన్నాళ్లూ కానీ ఇప్పుడు ఈ సినిమా ఇంకాస్త ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం తెలియ‌ట్లేదు కానీ తెరీ రీమేక్ ఇప్ప‌ట్లో మొద‌ల‌వ్వ‌డం మాత్రం క‌ష్ట‌మే అంటున్నారు ఇండస్ట్రీ వ‌ర్గాలు. అన్న‌ట్లు ఈ సినిమాలో కాజ‌ల్, కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించ‌బోతున్నారు. 

More Related Stories