రవితేజ ఎందుకలా చేస్తున్నాడు..?

తాను దూర సందులేదు.. మెడకేమో డోలా అంటూ తెలుగులో ఓ సామెత ఉంది కదా..! ఇప్పుడు రవితేజను చూస్తుంటే ఇదే గుర్తొస్తుంది. ఈయనకే ఇప్పుడు హిట్లు లేక అల్లాడిపోతున్నాడు. ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు ఈ సీనియర్ హీరో. రాజా ది గ్రేట్ యావరేజ్ గానే ఆడటంతో టచ్ చేసి చూడు.. నేలటికెట్ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు మాస్ రాజా. కానీ ఈ రెండు సినిమాలు కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్స్ అయ్యాయి.
ఇలాంటి సమయంలో వరసగా ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోతున్నాడు మాస్ రాజా. ప్రస్తుతం ఈయన చేస్తోన్న సినిమాలన్నీ ఫ్లాప్ డైరెక్టర్లతోనే. హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఇచ్చిన శీనువైట్లతో అమర్ అక్బర్ ఆంటోనీ.. హైపర్ తో ఫ్లాప్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో తెరీ రీమేక్.. ఒక్క క్షణం అంటూ డిజాస్టర్ ఇచ్చిన విఐ ఆనంద్ తో డిస్కోరాజా.. ఇప్పుడు తాజాగా నా పేరు సూర్య ఫేమ్ వక్కంతం వంశీతోనూ ఓ సినిమా చేయడానికి కమిట్ మెంట్ ఇచ్చాడని తెలుస్తుంది. ఇలా కెరీర్ అంతా ఇప్పుడు ఫ్లాప్ డైరెక్టర్లతోనే కాలం గడిపేస్తున్నాడు మాస్ రాజా. మరి వీళ్లలో ఎవరు మాస్ రాజా హిట్ కలను నెరవేరుస్తాడో చూడాలిక..!