English   

రివ్యూ: ఆట‌గ‌ద‌రా శివ‌

Aatagadara shiva
2018-07-19 19:43:59

న‌టీన‌టులు: ఉద‌య్ శంక‌ర్, దొడ్డ‌న్న‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, హైప‌ర్ ఆది త‌దిత‌రులు
ఎడిటింగ్: న‌వీన్ నూలి
సంగీతం: వాసుకి వైభ‌వ్
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: చ‌ంద్ర‌సిద్ధార్థ్
నిర్మాత‌: రాక్ లైన్ వెంక‌టేశ్               

కొన్ని సినిమాలు వ‌స్తున్న‌ట్లు కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు. వాటి ప్ర‌మోష‌న్ అలా ఉంటుంది మ‌రి. అయితే అందులో మంచి సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆట‌గ‌ద‌రా శివ ఇలాగే వ‌చ్చింది. మ‌రి ఇది ప్రేక్ష‌కుల‌కు ఎంత‌వ‌ర‌కు రీచ్ అయింది..? 

క‌థ‌: 
జంగ‌య్య‌(దొడ్డ‌న్న‌) ఓ త‌ళారి. ప‌శువుల వైద్యంతో పాటు నేర‌స్థుల ఉరి కూడా త‌న చేతుల మీదుగానే చేస్తుంటాడు. ఓ రోజు ప్ర‌భుత్వం నుంచి ఉత్త‌రం వ‌స్తుంది.. క‌రుడు క‌ట్టిన నేర‌స్థుడు బాబ్జీ (ఉద‌య్ శంక‌ర్)ని ఉరి తీయాల‌ని. ఆ ఉత్త‌రం అందుకుని టౌన్ కు బ‌య‌ల్దేర‌తాడు జంగ‌య్య‌. మార్గమ‌ధ్య‌లో  ఓ వ్య‌క్తి వ‌చ్చి జంగ‌య్య జీప్ ఎక్కుతాడు. ఆ త‌ర్వాతే తెలుస్తుంది అత‌డే ఉరిశిక్ష ప‌డిన ఖైదీ బాబ్జీ అని.. జైలు నుంచి త‌ప్పించుకున్నాడ‌ని. వీళ్లిద్ద‌రి ప్ర‌యాణంలోనే ఇంటినుంచి పారిపోయిన ప్రేమికులు ఆది(హైప‌ర్ ఆది), అత‌డి ప్రేయ‌సి వీళ్ళ‌తో క‌లుస్తారు. వాళ్ల కోసం ఊరు వాళ్లు గాలిస్తుంటారు. వీళ్లంద‌రి మ‌ధ్య జ‌రిగే ప్ర‌యాణ‌మే ఆట‌గ‌ద‌రా శివ‌. చంపాల్సిన వాడితో చ‌చ్చేవాడు చేసిన ప్ర‌యాణం ఎలా ముగిసింది అనేది క‌థ‌.. 

క‌థ‌నం: 
కొన్ని క‌థ‌లు విన‌డానికి అద్భుతంగా.. చూడ్డానికి అందంగా ఉంటాయి. అప్ప‌ట్లో ఆ న‌లుగురు లాంటి అద్భుతమైన సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందించిన చంద్ర‌సిద్ధార్థ్.. ఇన్నేళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి మంచి క‌థ‌తోనే వ‌చ్చాడు. అదే ఆట‌గ‌ద‌రా శివ‌. చంపేవాడు.. చ‌చ్చేవాడు క‌లిసి చేసే వింత ప్ర‌యాణ‌మే ఈ చిత్రం. ఇలాంటి క‌థ‌లు మ‌నం అరుదుగా చూస్తుంటాం. అస‌లు ఇలాంటి క‌థ‌లు చేయాల‌నే ఆలోచ‌న కూడా ఏ నిర్మాత చేయ‌డు. ఎందుకంటే క‌చ్చితంగా వాళ్ల‌కు తెలుసు అవార్డుల‌కు త‌ప్ప.. క‌మ‌ర్షియ‌ల్ గా ఇలాంటి సినిమాలు ప‌ని చేయ‌వు అని. అయితే ధైర్యం చేసి ఆట‌గ‌ద‌రా శివ చేసాడు చంద్ర‌సిద్ధార్థ్. సినిమా మొద‌లైన రెండు నిమిషాల‌కే క‌థ‌లోకి తీసుకెళ్లాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత అందులోని పాత్ర‌లతో ప్ర‌యాణం చేయాలి. కానీ మ‌రీ ఆర్ట్ సినిమాలా తీయ‌డంతో అక్క‌డ‌క్క‌డా బాగా స్లో అనిపిస్తుంది. మెయిన్ క‌థ వ‌చ్చిన‌పుడు ఆస‌క్తిగా అనిపించినా.. మ‌ధ్య‌లో వ‌చ్చే కొన్ని సీన్స్ మాత్రం సినిమాపై ఆస‌క్తిని త‌గ్గించేస్తాయి. చ‌లాకీ చంటి, భ‌ద్రం సీన్స్ తో పాటు ఆది కోసం వాళ్ల వాళ్లు ప‌ట్టుకోడానికి వ‌చ్చే సీన్స్ అన్నీ ఆక‌ట్టుకోవు. సెకండాఫ్ లో ఎమోష‌న్ బాగా క్యారీ చేసాడు ద‌ర్శ‌కుడు చంద్ర‌సిద్ధార్థ్. ఫ‌స్టాఫ్ అంతా త‌ళారీ, ఖైదీ, పారిపోయిన ప్రేమికుల మ‌ధ్య న‌డిచే క‌థే.. ఇంట‌ర్వెల్ స‌మయానికి ఆ ఖైదీ మ‌ళ్లీ త‌ప్పించుకోవాల‌ని చూడ‌టం.. అంత‌లోనే అత‌డిలో మ‌నిషిగా వ‌చ్చే మార్పు.. తోటివారికి సాయం చేయాల‌నుకునే గుణం.. ఇవ‌న్నీ గ‌మ్యం సినిమాలో న‌రేష్, శ‌ర్వా జ‌ర్నీలా అనిపిస్తుంది. చివ‌రికి చంపేవాడే చావ‌డం ఈ క‌థ‌కు మంచి ముగింపు. శివుడు ఆడే ఆట‌లో పావులు ఎవ‌రో చాలా అందంగా చూపించాడు ద‌ర్శ‌కుడు.

న‌టీన‌టులు: 
క‌న్న‌డ న‌టుడు దొడ్డ‌న్న మ‌న ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. ఇందులో కీల‌క‌పాత్ర చేసింది ఈయ‌నే. జంగ‌య్య‌గా అద్భుతంగా న‌టించాడు ఈయ‌న‌. ఇక ఖైదీగా ఉద‌య్ శంక‌ర్ మంచి పాత్ర‌లో క‌నిపించాడు. కాక‌పోతే ఒకే ఎక్స్ ప్రెష‌న్ కు ఫిక్స్ అయిపోయాడు ఉద‌య్. హైప‌ర్ ఆది బాగానే చేసాడు కానీ ఈయ‌న‌కు సినిమా, జ‌బ‌ర్ద‌స్థ్ మ‌ధ్య తేడా ఎప్పుడైనా తెలిస్తే బాగున్ను. ఆదితో పాటు చ‌మ్మ‌క్ చంద్ర‌, చంటి, భ‌ద్రం లాంటి వాళ్లు కూడా మ‌ధ్య‌లో వ‌చ్చి కాసేపు మెరిసి మాయం అయిపోతారు. మిగిలిన వాళ్లంతా క‌థ‌లో ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయేవాళ్లే. 

టెక్నిక‌ల్ టీం: 
వాసుకి వైభ‌వ్ ఇచ్చిన సంగీతం బాగుంది. సినిమాకు త‌గ్గ‌ట్లుగా మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు ఈయ‌న‌. ముఖ్యంగా ఎట్టాగ‌య్యా శివ చాలా బాగుంది. దాంతోపాటు ఊయ‌ల పాట కూడా బాగుంది. ఇక సినిమాటోగ్ర‌ఫీ కూడా అందంగా ఉంది. న‌వీన్ నూలి ఎడిటింగ్ ప‌ర్లేదు. చిన్న సినిమానే కాబ‌ట్టి పెద్ద‌గా తీసేసే సీన్స్ అయితే క‌నిపించ‌వు. అయితే హైప‌ర్ ఆది సీన్స్ మాత్రం కాస్త అతి చేసిన‌ట్లు అనిపిస్తాయి. ద‌ర్శ‌కుడిగా చంద్ర‌సిద్ధార్థ్ మంచి ప్ర‌య‌త్నమే చేసాడు కానీ క‌మ‌ర్షియ‌ల్ ఎఫ‌ర్ట్ గా మాత్రం నిల‌బెట్ట‌లేక‌పోయాడు.

చివ‌ర‌గా: 
ఆట‌గ‌ద‌రా శివ‌.. ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం.. కొంద‌రికి మాత్ర‌మే..!
 

More Related Stories