English   

రివ్యూ: చిన‌బాబు

chinababu
2018-07-13 13:57:18

న‌టీన‌టులు: కార్తి, స‌యేషా సైగ‌ల్, స‌త్య‌రాజ్, భానుప్రియ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: పాండిరాజ్
నిర్మాత‌: సూర్య 

కార్తి సినిమా అంటే ఇప్పుడు కేరాఫ్ తెలుగు ఇండ‌స్ట్రీనే. ఈయ‌న‌కు ఇప్పుడు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. పైగా ఖాకీ లాంటి హిట్ సినిమా త‌ర్వాత వ‌చ్చిన సినిమా కావ‌డంతో చిన‌బాబుపై మంచి అంచ‌నాలున్నాయి.. మ‌రి ఆ అంచ‌నాల‌ను ఈ చిత్రం అందుకుందా..?

క‌థ‌:
కృష్ణంరాజు అలియాస్ చిన‌బాబు(కార్తి) రుద్ర‌రాజు(స‌త్య‌రాజ్)గారికి ఏకైక వార‌సుడు. ఐదుగురు ఆడ‌పిల్ల‌ల త‌ర్వాత పుట్టిన పిల్లాడు కావ‌డంతో ప్రాణంగా చిన‌బాబును పెంచుతాడు రాజు. ఐదుగురు అక్క‌ల‌తో పాటు కుటుంబం అంతా చినబాబును అంతే ప్రేమ‌గా చూసుకుంటారు. ఇద్ద‌రు అక్క‌ల్లో ఓ అక్క కూతురును చిన‌బాబుకు ఇవ్వాల‌ని చూస్తుంటారు ఇంట్లో వాళ్లు. కానీ ఈయ‌న మాత్రం నీల‌నీర‌ద‌ (స‌యేషా సైగ‌ల్) ప్రేమ‌లో ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆమె బావ సురేంద్ర రాజు(శ‌త్రు)తో చిన‌బాబుకు గొడ‌వ అవుతుంది. అప్ప‌ట్నుంచి చిన‌బాబు ఇంట్లో గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది.. ఆ కుటుంబం మ‌ళ్లీ ఎలా క‌లిసింది అనేది క‌థ‌.. 

క‌థ‌నం: 
ఉమ్మ‌డి క‌టుంబం క‌థ‌లు ఇప్ప‌టికే చాలానే వ‌చ్చాయి. ఎన్నో వంద‌ల సార్లు చూసిన క‌థ‌లే ఇవి. కానీ ఫ్యామిలీ రిలేష‌న్స్ క‌దా బోర్ కొట్ట‌వు. ఇప్పుడు చిన‌బాబు కూడా ఇలాంటి క‌థ‌తోనే వ‌చ్చింది. ఈ చిత్రంలో ఉమ్మ‌డి కుటుంబం విలువ‌లతో పాటు అక్కా త‌మ్ముళ్ల రిలేష‌న్.. బావా మ‌ర‌ద‌ళ్ల స‌ర‌సాలు.. రైతుల స‌మ‌స్య‌ల‌ను కూడా బాగానే చూపించాడు ద‌ర్శ‌కుడు పాండిరాజ్. తొలి సీన్ నుంచే క‌థ‌లోకి వెళ్లిపోయాడు. మ‌గ సంతానం కోసం కుటుంబ పెద్ద ప‌డే ఆవేద‌న నుంచి.. ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్న ఇంట్లో ఉండే సాధార‌ణ స‌మ‌స్య‌ల వ‌ర‌కు అన్నింటినీ చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. దానికితోడు త‌మ కూతుళ్ల‌ను ఎలాగైనా త‌మ్ముడికి ఇవ్వాలనుకునే అక్క‌లు.. సాధార‌ణ మ‌ద్య‌త‌ర‌గ‌తి ఇంట్లో చూసే అక్కాచెల్లెళ్ల ప్రేమ‌లు.. వాళ్ల అసూయ‌లు.. ప‌గ‌లు.. కోపాలు.. తోడ‌ళ్లుళ్ల విసుర్లు ఒక్కో విష‌యాన్ని పూస గుచ్చిన‌ట్లు వివ‌రించాడు. ఇక మ‌రో అమ్మాయితో ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత కార్తి పడే క‌ష్టాలు.. ఉమ్మ‌డి కుటుంబాన్ని చీల్చాల‌నుకునే ఓ విల‌న్.. ఇలా దేనికదే స‌ప‌రేట్ గా క‌థ‌లో ఇముడ్చుకున్నాడు పాండిరాజ్. స్క్రీన్ ప్లే కూడా ప‌క‌డ్భందీగా అల్లుకున్నాడు. దానికితోడు రైతుల క‌ష్టాల‌ను కూడా చూపించాడు ఈ చిత్రంలో. ఛాన్స్ దొరికిన ప్ర‌తీసారి రైతు గురించి గొప్ప‌గా చెప్పాడు ద‌ర్శ‌కుడు. ఫ‌స్టాఫ్ అంతా కామెడీతో న‌డిపించి.. సీరియ‌స్ సీన్స్ లో కూడా న‌వ్వు తెప్పించాడు. ఇక సెకండాఫ్ లో కూడా ఓ వైపు హెవీ ఎమోష‌న్ డోస్ ఇస్తూనే.. మ‌రోవైపు కామెడీని విడ‌వ‌లేదు. క్లైమాక్స్ కు వ‌చ్చేస‌రికి మ‌రోసారి కాస్త క్లాస్ ఇచ్చి అన్నింటినీ సెట్ చేసాడు ద‌ర్శ‌కుడు. ఓవ‌రాల్ గా చినబాబు ప‌క్కా త‌మిళ తాళింపు ఉన్న సినిమా.

న‌టీన‌టులు: 
కార్తి చిన‌బాబుగా అల‌రించాడు. త‌మ్ముడిగా.. కొడుకుగా.. మామ‌య్యగా.. రైతుగా ఇలా అన్ని పాత్ర‌ల్లో మెప్పించాడు. ఒకే సినిమాలో ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర చేయ‌డం గొప్ప విష‌య‌మే. ఎమోష‌న‌ల్ సీన్స్ లో చాలా బాగా న‌టించాడు కార్తి. హీరోయిన్ స‌యేషా సైగ‌ల్ పాట‌ల‌కు ప్రేమ స‌న్నివేశాల‌కు మాత్ర‌మే స‌రిపోయింది. స‌త్య‌రాజ్ కూడా అప్పుడ‌ప్పుడూ వ‌చ్చి వెళ్లే పాత్రే. హీరో ఫ్రెండ్ గా సూరి కామెడీతో న‌వ్వించాడు. భానుప్రియ‌తో పాటు మిగిలిన వాళ్ళంతా ఆయా స‌మ‌యానికి క‌నిపించే పాత్ర‌లే. విల‌న్ గా శ‌త్రుకు మంచి పాత్ర ప‌డింది. ఈ కారెక్ట‌ర్ తో త‌మిళ్ తో సెట్ అయ్యేలా క‌నిపిస్తున్నాడు.

టెక్నిక‌ల్ టీం: 
డి ఇమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ప‌క్కా త‌మిళ సినిమాకు ఇచ్చే సంగీత‌మే ఇచ్చాడు ఈయ‌న‌. ఎడిటింగ్ బాగుంది. రెండున్న‌ర గంట‌ల సినిమా అయినా కూడా పెద్ద‌గా బోర్ కొట్ట‌దు. కాక‌పోతే అక్క‌డ‌క్క‌డా త‌మిళ డోస్ మ‌రీ ఎక్కువైన ఫీలింగ్ వ‌స్తుంది. నిర్మాత‌గా సూర్య టాప్ లెవల్లో ఉన్నాడు. ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ భారీగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు పాండిరాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి.. పాత క‌థ‌నే మ‌రింత అందంగా చెప్పాడు ఈయ‌న‌. ఇలాంటి క‌థ‌తో రెండున్న‌ర గంట‌లు కూర్చోబెట్ట‌డం అంటే చిన్న విష‌యం కాదు. కానీ అది చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. 

చివ‌ర‌గా:
చిన‌బాబు.. ప‌ర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్..
 

More Related Stories