English   

RRR సినిమాను చుట్టుముట్టిన వివాదం.. అల్లూరి యువజన సంఘం ఫైర్..

 RRR Controversy
2019-10-22 16:43:14

ఈ రోజుల్లో పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు.. ఎక్కడ లేని వివాదాలన్నీ వాటి చుట్టూ వస్తుంటాయి. ఇప్పుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా దీనికి మినహాయింపు కాదు. అసలు ఈ సినిమాలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు ఉన్నారు.. ఒకరు కొమరం భీమ్ అయితే మరొకరు అల్లూరి సీతారామరాజు.. ఈ ఇద్దరి జీవితంపై తెరకెక్కుతున్న సినిమా అనగానే కాంట్రవర్సీ లు కూడా వస్తాయని రాజమౌళికి తెలియని విషయం కాదు. అందుకే షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది పూర్తిగా కల్పిత గాథ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. 

ఇక ఇప్పుడు అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని కాంట్రవర్సీలు చుట్టుముడుతున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షుడు వీరభద్రరావు రాజమౌళి సినిమాపై ఫైర్ అయ్యాడు. చరిత్రని వక్రీకరిస్తుంటే చూస్తూ ఊరుకోమని.. కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయనకు వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు చరిత్రను వక్రీకరించిన సన్నివేశాలు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రాజమౌళిని కోరుతున్నాడు. కేవలం డబ్బుల కోసం కమర్షియల్ పేరుతో స్వతంత్ర సమరయోధుల జీవితాలని ఇష్టం వచ్చినట్లు వాడుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. 

అల్లూరి సీతారామరాజు 1897లో విశాఖపట్టణం పాండ్రంకిలో పుట్టాడని.. కొయ్యూరు మండలం రాజేంద్రపాలెంలో 1924 మే 7న తెల్లవారి కాల్పుల్లో వీరమరణం పొందారని తెలిపాడు. అదే సమయంలో కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోందని వీరభద్రరావు తెలిపారు. ఇద్దరు కలిసినట్లు చరిత్రలో ఎక్కడా లేదని.. చరిత్రలో లేని విషయాలను సినిమాలో ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు రాజమౌళి మాత్రం ఇది పూర్తిగా కల్పితం అని.. 1920 ప్రాంతంలో ఒకవేళ ఇద్దరూ కలిసి ఉంటే ఎలా ఉండేది అనేది సినిమా కథ అంటున్నాడు. మొత్తానికి రాజమౌళి మల్టీస్టారర్ పై కూడా వివాదాలు మొదలయ్యాయి. మరి ఇది ఎక్కడ ఆగుతుందో చూడాలి.

More Related Stories