RRR సెట్లోకి అజయ్ దేవ్గన్ వచ్చేసాడోచ్..

రాజమౌళి సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. కొన్ని రోజులుగా సంక్రాంతి హాలీడేస్ తీసుకున్న టీం మళ్లీ రెడీ అయిపోయారు. ఇక ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ లోకి అజయ్ దేవగన్ కూడా వచ్చేసాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు సెట్ లో మాత్రం అడుగుపెట్టలేదు ఈయన. ఇన్నాళ్లకు ఈయన సెట్ లోకి వచ్చేసాడు.. ఇదే విషయాన్ని ప్రకటించాడు దర్శక ధీరుడు రాజమౌళి.
ఈయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు పాత్రలు పోషిస్తున్నారు. ఇదే సినిమాలో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయన పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ ఉన్నంత సేపు అదిరిపోతుందని ప్రచారం జరుగుతుంది. జనవరి 21 నుంచి ఈయన షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా కోసమే హైదరాబాద్ వచ్చాడు ఈయన.
ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ భారీ ఎపిసోడ్ కోసం ఈయన నటిస్తున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రామ్ చరణ్ తండ్రిగా అజయ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. చరణ్ కు యుక్తవయసులో దేశంపై భక్తి.. స్వాతంత్రం కోసం స్పూర్తి రగిలించే పాత్రలో అజయ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. చరణ్, అజయ్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కూడా మరో స్థాయిలో ఉంటాయని.. సినిమా రేంజ్ మార్చేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లుగానే ఈ చిత్రం జులై 31న విడుదల కానుంది.