English   

సీతయ్యగా రాజమౌళి.. కరోనాకు ధీటుగా RRR షూటింగ్.. 

Rajamouli RRR
2020-03-13 17:42:59

అవును.. వినడానికి విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. నిజంగానే సీతయ్యగా మారిపోతున్నాడు రాజమౌళి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా దెబ్బకు అంతా షూటింగ్స్ కూడా మానేసి ఇంట్లో కూర్చుంటే రాజమౌళి మాత్రం తన సినిమా RRR షూటింగ్ రెగ్యులర్ గా జరుపుతున్నాడు. ఎలాంటి బ్రేకులు లేకుండా పని కానిస్తున్నాడు. 

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ పూణేలో ప్లాన్ చేసాడు దర్శక ధీరుడు. అక్కడికి వెళ్లడానికి ఇప్పటికే అన్ని పర్మిషన్స్ కూడా వచ్చేసాయి. అక్కడి ప్రభుత్వం కూడా రాజమౌళి సినిమా కోసం అనుమతులు ఇచ్చేసింది. అయితే కరోనా కారణంగా జాగ్రత్తలు కూడా చెబుతుంది పూణే ప్రభుత్వం. ఇప్పటికే రాజమౌళి టీంలోని కొందరు సభ్యులు అక్కడకు వెళ్లి ఏర్పాట్లలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ కొత్త షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు అజయ్ దేవ్ గన్, సముద్రఖని కూడా పాల్గొంటారని తెలుస్తుంది. ఈ ఒక్క షెడ్యూల్ పూర్తి చేస్తే టాకీ పార్ట్ అంతా అయిపోయినట్లే. ఇక ప్రశాంతంగా ఏడు నెలల పాటు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేయొచ్చు రాజమౌళి. అందుకే వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. అందులో మధ్యలో కరోనా వచ్చినా నో ప్రాబ్లమ్ అంటున్నాడు. తమ జాగ్రత్తల్లో ఉండి కరోనాకు దూరంగా.. సినిమా షూటింగ్ పూర్తి చేస్తానని చెబుతున్నాడు దర్శకధీరుడు. 

ఈ సినిమా పూర్తి చేయడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి విడుదలైతే ఇతర సినిమాలు హాయిగా చేసుకోవచ్చని వాళ్ల ప్లాన్. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ కథ రాసుకుని సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు చరణ్ కూడా తనకు సరైన కథ కోసం వేచి చూస్తున్నాడు. ఈ సినిమాలో అల్లూరి సీతారా రాజుగా రామ్ చరణ్.. గిరిజన వీరుడు కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ తండ్రిగా అజయ్ నటిస్తున్నాడని తెలుస్తుంది. చరణ్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరీస్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. మొత్తానికి షూటింగ్ విషయంలో ఎవరి మాటా వినకుండా సీతయ్య అయిపోయాడు రాజమౌళి. 

More Related Stories