English   

RRR వస్తే కానీ ఇండస్ట్రీ మళ్లీ గాడిన పడదా..

RRR
2020-05-25 17:52:24

ఇండస్ట్రీకి ప్రస్తుతం వచ్చిన నష్టాలను లెక్కల్లో చూపించడం కూడా కష్టమే. ఎందుకంటే ఒకటి రెండు కాదు 60 రోజులుగా ఇండస్ట్రీ అంతా స్థంభించిపోయింది. పైగా మరో ఆర్నెళ్ల వరకు కూడా కరోనా ప్రభావం ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. దాంతో థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా ఆడియన్స్ వస్తారనేది అనుమానమే. ఇలాంటి సందర్భంలో మళ్లీ ఇండస్ట్రీకి జవసత్వాలు రావాలన్నా.. పునర్వైభవం సంతరించుకోవాలన్నా కూడా ఓ అద్భుతం జరగాలి. దాని పేరు ట్రిపుల్ ఆర్ అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరొచ్చినా కూడా టాలీవుడ్ మళ్లీ గాడిన పడటం కష్టమే. అదే రాజమౌళి వస్తే మాత్రం అది సులభమే అంటున్నారు ట్రేడ్ పండితులు కూడా. దర్శక ధీరుడి సినిమా వస్తే కచ్చితంగా ఆ ప్రభావం అనేది నెల రోజుల వరకు ఉంటుంది. పైగా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు కూడా ఈయన సినిమా కోసం వేచి చూస్తున్నాయి. 

గాడి తప్పిన ఇండియన్ సినిమా మళ్లీ ట్రాక్ ఎక్కాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం ట్రిపుల్ ఆర్ విడుదల అంటున్నారు విశ్లేషకులు కూడా. ఎందుకంటే అంత భారీ సినిమా వస్తే కానీ థియేటర్స్ వైపు ప్రేక్షకులు అడుగేసే ఆలోచన చేయరు. అప్పటి వరకు ఈ పరిస్థితులు కూడా మారవు. పైగా ఇప్పుడు ఓటిటి కూడా రెచ్చిపోతుండటంతో ఇంట్లోనే ఉండి సినిమాలు చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు కూడా. ఇలాంటి సమయంలో వాళ్ల మనసు మార్చి.. దారి మళ్లేలా చేయాలంటే చాలా కష్టం. పరిస్థితులు చూస్తుంటే మరో ఆర్నెళ్లు కాదు.. కనీసం 9 నెలల వరకు కూడా థియేటర్స్ ఓపెన్ చేసినా కూడా కరోనా భయం అయితే ఉంటుంది. అందుకే రాజమౌళి లాంటి దర్శకుడి నుంచి సినిమా వస్తే కరోనాను కూడా మించిన కలెక్షన్లు వస్తాయని నమ్ముతున్నారు ఇండస్ట్రీ పెద్దలు. మరి ఇది ఎంత వరకు జరుగుతుందో చూడాలిక. 

More Related Stories