English   

RRRషూటింగ్ షురూ.. నిర్మాత తీపికబురు..

RRR
2020-06-04 17:12:06

మరో వారం రోజుల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ సినిమా త్రిబుల్ ఆర్ షూటింగ్ మొదలు కానుంది. మూడు నెలలుగా కరోనా వైరస్ బారినపడి లాక్ డౌన్ లో చిక్కుకుపోయిన ఈ చిత్ర యూనిట్ మళ్లీ తమ పనులు మొదలు పెడుతున్నారు. ఈ మేరకు నిర్మాత డివివి దానయ్య మీడియాకు ప్రకటన కూడా విడుదల చేశాడు. జూన్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టబోతున్నట్లు చెప్పాడు ఈయన. ప్రభుత్వం సూచించిన అన్ని నియమ నిబంధనలకు లోబడి తమ సినిమా షూటింగ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు దానయ్య. 50 మంది కంటే తక్కువ స్టాఫ్ ఉండేలా చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చాడు. వీలైనంత వరకూ చాలా తక్కువ మంది ఆర్టిస్టులు, స్టాఫ్ లొకేషన్ లో ఉండేలా జాగ్రత్త పడతామని దానయ్య తెలిపాడు. 

కరోనా వైరస్ ఎంత ప్రమాదమో తెలుసు కాబట్టి దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన తెలిపాడు. మరోవైపు రాజమౌళి కూడా నెక్స్ట్ షెడ్యూల్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం అయిపోయింది. ఇక గడిచిన మూడు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి చేశాడు రాజమౌళి. మిగిలిన భాగం షూటింగ్ చేసి.. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి జనవరి 8, 2021 సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు. కానీ ఆయన అనుకున్నంత ఈజీగా ఈ సినిమా చెప్పిన తేదీకి విడుదల కావడం కష్టమే. ఇప్పటికే మరోసారి త్రిబుల్ ఆర్ విడుదల తేదీ మారిపోయిందని.. సమ్మర్ వైపు పరుగులు తీస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా షూటింగ్ మొదలు పెడితే మిగిలిన దర్శక నిర్మాతలకు కూడా కాస్త ధైర్యం వస్తుంది. 

More Related Stories