English   

RRR సినిమా.. ఇప్పట్నుంచి మరో 365 రోజులు వేచి చూడాల్సిందే.. 

RRR
2019-07-31 13:50:43

రాజమౌళి సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతోనే దాన్ని ప్రపంచానికి పరిచయం చేసాడు ఈయన. ఇక ఇప్పుడు మరింత భారీగా మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు దర్శకధీరుడు. అదే ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ తో చేస్తున్న ఈ సినిమా విడుదలకు ఇంకా సరిగ్గా 365 రోజులు ఉన్నాయి. సరిగ్గా వచ్చే ఏడాది ఈ సమయానికి అంటే 2020 జులై 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే విషయాన్ని రాజమౌళి ఇప్పటికే కన్ఫర్మ్ చేసాడు. ఈయన సినిమాలు అవసరాన్ని బట్టి వాయిదా పడుతుంటాయి కానీ కచ్చితంగా ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం అనుకున్న సయమానికి విడుదల చేస్తామని చెప్పాడు జక్కన్న. ఈయన సినిమా అంటే భారీ తనంతో పాటు భారీ బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక భారీ బడ్జెట్ కు తోడు రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటాయి. బాహుబలి సినిమా కోసం ప్రభాస్ కు దాదాపు 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందిందని వార్తలు వినిపించాయి. 

ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్లు కష్టపడ్డాడు కాబట్టి అంత ఇవ్వడంలో తప్పు లేదు. ఇక ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ఇదే స్థాయిలో పారితోషికం అందబోతుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ గత సినిమాల కంటే దాదాపు పది కోట్ల వరకు ఈ సినిమా కోసం అదనంగా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో సినిమాకు 17 నుంచి 20 కోట్లు తీసుకునే ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం 30 కోట్లు తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇక వినయ విధేయ రామ సినిమా కోసం దాదాపు 16 కోట్లు తీసుకున్న రామ్ చరణ్.. ఇప్పుడు రాజమౌళి సినిమా కోసం మరో 14 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు హీరోల రెమ్యూనరేషన్ కోసమే 60 కోట్లకు పైగా నిర్మాతకు ఖర్చు అవుతుందని.. వీళ్లతో పాటు హీరోయిన్ అలియా భట్ 12 కోట్లు.. ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అజయ్ దేవ్ గన్ 30 నిమిషాల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం దాదాపు 15 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లు కాకుండా టెక్నికల్ టీమ్ ఎలాగూ ఉంది. ఇలా కేవలం రెమ్యూనరేషన్ దాదాపు 200 కోట్లు వెళ్లిపోతున్నాయని.. మరో 150 కోట్లు మేకింగ్ కు అవుతుందని తెలుస్తోంది. మొత్తానికి ఎంత ఖర్చయినా కూడా విడుదలకు ముందే బిజినెస్ జరుగుతుందని నమ్మకంగా ఉన్నాడు నిర్మాత డివివి దానయ్య. ఈ సినిమా 2020 జులై 30 తేదీన విడుదల కానుంది.

More Related Stories