ఆర్ఎక్స్ 100 రివ్యూ

నటీనటులు: కార్తికేయ, పాయల్ రాజ్ పుత్, రావురమేష్, రాంకీ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: అజయ్ భూపతి
నిర్మాణం: కార్తికేయ మూవీ క్రియేషన్స్
ఆర్ఎక్స్ 100.. ఈ మధ్య తెలుగులో బాగా వినిపించిన పేరు ఇది. దానికి కారణం సినిమా ట్రైలర్. అందులో హీరోయిన్ అందాలన్నీ ఆరబోసి లిప్ లాక్ సీన్స్ తో రచ్చ చేసారు. దాంతో సినిమాపై ముందు నుంచీ అంచనాలు లేకపోయినా ట్రైలర్ తర్వాత ఆసక్తి పెరిగింది. మరి వాటిని ఈ చిత్రం అందుకుందా..?
కథ:
శివ(కార్తికేయ) ఊళ్లో థియేటర్ నడుపుతుంటాడు. విశ్వనాథ్ (రావురమేష్) రాజకీయ అనుచరిడిగా ఉంటాడు. శివకు డాడి(రాంకీ)తోడుగా ఉంటాడు ఎప్పుడు. లైఫ్ లో అన్నీ సాఫీగా నడుస్తున్న సమయంలో శివ జీవితంలోకి అనుకోకుండా ఇందు(పాయల్ రాజ్ పుత్) వస్తుంది. వచ్చీ రావడంతోనే ప్రేమలో పడేస్తుంది. ఇద్దరూ కలిసి తిరుగుతారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ ఇందుకు మరో పెళ్లి చేస్తారు ఇంట్లో వాళ్లు. దాంతో శివ మోడ్రన్ దేవదాసు అయిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఎలా ముగిసింది.. ఇందును శివ కలిసాడా లేదా అనేది అసలు కథ..
కథనం:
కొన్నిసార్లు అంచనాలు లేకుండా వచ్చే సినిమాలే సంచలనాలు చేస్తుంటాయి. గతేడాది అర్జున్ రెడ్డి అలా వచ్చిందే. విడుదలకు ముందు వరకు కూడా ఈ చిత్రం అంతగా రచ్చ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు ఆ దారిలో వచ్చింది ఆర్ఎక్స్ 100. హీరో హీరోయిన్ ప్రేమించుకోవడం.. ఆ తర్వాత ఇంట్లో వాళ్లు ఆ పెళ్లి చేయకపోవడం.. మరో అబ్బాయితో హీరోయిన్ పెళ్లి జరగడం.. దాన్నిచూసి హీరో పిచ్చోడు కావడం ఇవన్నీ చాలా సినిమాలలో చూసాం. మొన్నొచ్చిన అర్జున్ రెడ్డిలో కూడా ఇదే చూపించాడు దర్శకుడు. కాకపోతే ఇదే కథను కాస్త మార్చి రాసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. కొత్త దర్శకుడైనా కూడా ఆర్ఎక్స్ 100 ను చాలా బోల్డ్ గా తెరకెక్కించాడు. బోల్డ్ ముసుగులో అక్కడక్కడా బూతులు చూపించినా కూడా కంటెంట్ పరంగా ప్రేమను మరో విధంగా హైలైట్ చేసే ప్రయత్నం చేసాడు ఈ దర్శకుడు. ఇంటర్వెల్ వరకు నెమ్మదిగా సాగే కథ.. ఆ తర్వాత వేగం పుంజుకుంటుంది. ప్రియురాలి కోసం ఇల్లు వాకిలి వదిలేసి మూడేళ్లు పిచ్చోడిలా చూస్తుంటాడు ప్రేమికుడు. ఈ క్రమంలో ఆ ప్రేమికుడి బాధను బాగానే హైలైట్ చేసాడు అజయ్. ఈ ఎమోషన్స్ యూత్ కు బాగానే రీచ్ అవుతాయి. అయితే మరీ ఎక్కువగా సిగరెట్.. మందుతో హీరో కనిపించడం బోల్డ్ అంటూ హద్దులు దాటడం మాత్రం ఈ చిత్రానికి మైనస్.
నటీనటులు:
హీరో కార్తికేయ బాగానే ఉన్నాడు.. నటించాడు కూడా. తొలి సినిమాతోనే ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం నిజంగా సాహసమే. ఇది ఆయన కెరీర్ కు యూజ్ అవుతుందేమో కానీ సినిమాకు మాత్రం కాదు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇలాంటి పాత్ర చేయడానికి ముందు ఒప్పుకుందంటే ఆమె గట్స్ కు దండం పెట్టాల్సిందే. రావురమేష్ టిపికల్ తెలుగు సినిమా ఫాదర్ రోల్ మరోసారి చేసాడు. ఇక రాంకీ హీరో తండ్రి కాని తండ్రిగా బానే నటించాడు. మిగిలిన వాళ్లంతా ఉన్నారంటే ఉన్నారంతే.
టెక్నికల్ టీం:
ఆర్ఎక్స్ 100లో 9 పాటలు ఉన్నాయి. ఈ సినిమాకు ఇన్ని పాటలు అవసరం లేదు కానీ కథ లేదనో ఏమో కానీ హీరో హీరోయిన్ కలిసినా.. విడిపోయినా పాటలనే నమ్ముకున్నాడు దర్శకుడు. పిల్లా రాతో పాటు మరో రెండు పాటలు బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ చాలా వీక్. చాలాసీన్లు ఎత్తేయొచ్చేమో అనిపిస్తుంది. సీరియల్ కంటే దారుణంగా సెకండాఫ్ లో కథ సాగుతుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. దర్శకుడిగా అజయ్ భూపతి డేరింగ్ స్క్రిప్ట్ ఎంచుకున్నాడు కానీ దాన్ని హ్యాండిల్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు.
చివరగా:
ఆర్ఎక్స్ 100.. కొత్త ప్రయత్నమే.. కానీ కొంచమే..!