English   

సాక్ష్యం రివ్యూ

Saakshyam Movie Review
2018-07-27 16:10:47

వ‌ర‌స‌గా భారీ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌పై దండ‌యాత్ర చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్. ఏదో ఓ రోజు స్టార్ అవుతాన‌ని ఆశ ఈయ‌న‌లో బాగానే క‌నిపిస్తుంది. ఇప్పుడు కూడా సాక్ష్యం అంటూ మ‌రో భారీ సినిమాతో వ‌చ్చాడు ఈయ‌న‌. మ‌రి ఇదెలా ఉంది..? క‌నీసం సాక్ష్యం అయినా బెల్లంకొండ వార‌సుడి ఆశ‌ల‌ను తీర్చిందా..?

క‌థ‌: 
విశ్వాజ్ఞ‌(బెల్లంకొండ శ్రీ‌నివాస్) కుటుంబాన్ని చిన్న‌పుడే మునుస్వామి(జ‌గ‌ప‌తిబాబు) అత‌డి త‌మ్ముళ్లు దారుణంగా చంపేస్తారు. విశ్వ‌ను కూడా చంపేసామ‌నే అనుకుంటారు కానీ ఓ గోమాత అత‌న్ని కాపాడుతుంది. ఆ త‌ర్వాత కాశీ చేరి.. అక్క‌డి నుంచి ప్ర‌సాద్ సుసుర్ల‌(జ‌య‌ప్ర‌కాశ్) దంప‌తుల ద‌గ్గ‌రికి చేరతాడు. ఫారెన్ లోనే పెరుగుతాడు. అక్క‌డే వీడియో గేమ్ డెవ‌ల‌ప‌ర్ అవుతాడు విశ్వ‌. అనుకోకుండా ఓ రోజు సౌంద‌ర్య ల‌హ‌రి(పూజాహెగ్డే) ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ కోసం ఇండియా వ‌స్తాడు. అయితే అక్క‌డ త‌న‌కు తెలియ‌కుండానే విశ్వ చేతుల్లో కొంద‌రు వ్య‌క్తులు చ‌నిపోతుంటారు. దానికి పంచ‌భూతాలు సాయం చేస్తాయి. అలా ఎందుకు జ‌రుగుతుంది అనేది అస‌లు క‌థ‌..

క‌థనం:
త‌ల్లి దండ్రుల‌ను చంపిన వాళ్ల‌పై కొడుకు ప‌గ తీర్చుకోవ‌డం అనేది తెలుగు ఇండ‌స్ట్రీ పుట్టిన‌రోజు నుంచి వ‌స్తోన్న క‌థ‌. ఇప్ప‌టికే కొన్ని వేల క‌థ‌లు ఈ ఫార్మాట్ లో వ‌చ్చుంటాయి. శ్రీ‌వాస్ కూడా ఇప్పుడు ఇలాంటి రివేంజ్ క‌థ‌తోనే వ‌చ్చాడు. కాక‌పోతే స్క్రీన్ ప్లేలో చిన్న లాక్ పెట్టాడు. పంచ‌భూతాలే సాక్ష్యంగా ఈ క‌థ‌ను రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. హీరో కుటుంబాన్ని నామ‌రూపాల్లేకుండా నాశ‌నం చేసిన‌పుడు సాక్ష్యంగా ఆకాశం మాత్ర‌మే ఉంటుంది. ఆకాశానికి మిగిలిన భూమి.. నీరు.. గాలి.. అగ్ని కూడా ఎలా సాయ‌ప‌డతాయి అనేది అస‌లు క‌థ‌. వాటితోనే హీరో త‌న కుటుంబాన్ని నాశ‌నం చేసిన వాళ్ల‌ను ఎలా చంపాడు అనేది ఆస‌క్తిక‌రంగా రాసుకున్నాడు శ్రీ‌వాస్. తొలి 15 నిమిషాల్లోనే క‌థ అంతా చెప్పేసాడు ఈ ద‌ర్శ‌కుడు. అదే ఒళ్లు గ‌గ్గురు పొడిచేంత అద్భుతంగా తెర‌కెక్కించాడు. అయితే ఆ త‌ర్వాత అదే టెంపో కొన‌సాగించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు.

క‌థ ఫారెన్ కు షిప్ట్ అవ్వ‌డం.. అక్క‌డ హీరో హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ ట్రాక్ అన్నీ రొటీన్ గానే అనిపిస్తాయి. ఒక్క‌సారి హీరో ఇండియాలో అడుగుపెట్టిన త‌ర్వాత మ‌ళ్లీ ఊపు అందుకుంటుంది. విల‌న్ ల‌ను ఒక్కొక్క‌రుగా పంచ‌భూతాల సాయంతో చంప‌డం అనేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. కాక‌పోతే క‌థ‌లో క‌నిపించిన కొత్త‌ద‌నం స్క్రీన్ పై క‌నిపించ‌క‌పోవ‌డం మైన‌స్. ఏదో తూతూ మంత్రంగా యాక్ష‌న్ సీక్వెన్సులు వెళ్లిపోతుంటాయి. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం భారీగా ఖ‌ర్చు చేసినా క్వాలిటీ మిస్ అయిన‌ట్లు క‌నిపించాయి. ఫ‌స్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త డ‌ల్ అవుతుంది. కానీ ఓవ‌రాల్ గా సాక్ష్యం వ‌న్ టైమ్ వాచ్ గా నిలిచిపోయింది. రొటీన్ రివేంజ్ లా కాకుండా పంచ‌భూతాలు ఫ్రెష్ ఫీల్ తీసుకొచ్చాయి.

న‌టీన‌టులు:
బెల్లంకొండ శ్రీ‌నివాస్ బాగా న‌టించాడు. ఇదివ‌ర‌కు సినిమాల‌తో పోలిస్తే ఇది బెట‌ర్. అయితే ఈయ‌న ఇమేజ్ కు క‌థ‌ పెద్ద‌దైపోయింది. పూజాహెగ్డే ప‌ర్లేదు. అందాల ఆర‌బోత కాకుండా ప‌ర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర‌లో న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు విల‌న్ గా రాక్ష‌సంగా ఉన్నాడు. ఆయ‌న త‌ప్ప మ‌రొకర్ని ఈ పాత్ర‌లో ఊహించ‌లేం. అంత‌గా ఒదిగిపోయాడు. ఇక ర‌వికిష‌న్, రావుర‌మేష్, జ‌య‌ప్ర‌కాశ్ త‌మ పాత్ర‌ల్లో బాగున్నారు. రైట‌ర్ అనంత శ్రీ‌రామ్ కూడా ఈ చిత్రంలో న‌టించాడు.

టెక్నిక‌ల్ టీం: 
సాక్ష్యంకు ఆర్ఆర్ ప్రాణంగా నిలిచింది. సంగీత ద‌ర్శ‌కుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి అద్భుత‌మైన సంగీతం అందించాడు. పాట‌లు బాగోలేక పోయినా.. ఆర్ఆర్ అదిరింది. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ బాగున్నా ఇంకాస్త క్వాలిటీగా ఉంటే బాగున్నేమో అనిపించింది. ద‌ర్శ‌కుడిగా శ్రీ‌వాస్ ఆక‌ట్టుకోలేదు కానీ ర‌చ‌యిత‌గా బాగుంది క‌థ‌. పంచ‌భూతాల కాన్సెప్ట్ కొత్త‌గా ఉంది. రివేంజ్ డ్రామాలోనే దైవ‌త్వాన్ని కూడా మిక్స్ చేసాడు ద‌ర్శ‌కుడు.

చివ‌ర‌గా: సాక్ష్యం.. పంచ‌భూతాల సాక్షిగా రివేంజ్ డ్రామా..!

రివ్యూ: సాక్ష్యం
న‌టీన‌టులు: బెల్లంకొండ శ్రీ‌నివాస్, పూజాహెగ్డే, రావు ర‌మేష్, జ‌గ‌ప‌తిబాబు, ర‌వికిష‌న్ త‌దిత‌రులు
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: శ్రీవాస్
నిర్మాత‌: అభిషేక్ నామా

రేటింగ్: 3/5

More Related Stories