Saidharam Tej : అయ్యో పాపం.. మెగా హీరోపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

మెగా స్టార్ చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్ది సేపటి క్రితం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. ఆయన శరీరంలో అన్ని ప్రధాన అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. అయితే ఆయనకు కాలర్ బోన్ విరిగిందన్నారు.
ఇందుకోసం అత్యవసరంగా ఎలాంటి వైద్యం చేయాల్సిన అవసరం లేదన్నారు వైద్యులు. అలాగే మరో 48 గంటల పాటు ఆయనను క్లోజ్ అబ్జర్వేషన్ లో పెడుతామని తెలిపారు. ఇందుకోసం ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వెంటిలేటర్ ఉన్న మాత్రన ప్రమాదంలో ఉన్నట్టు కాదనీ.. ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. మరో వైపు సాయిధరమ్ తేజ్ పై రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదయ్యింది. నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా ప్రయాణించడం వంటి ఆరోపణలతో ఐపీసీ సెక్షన్ 336, 184 ఎంవీ యాక్ట్ కింద రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయినట్టు తెలుస్తుంది. ప్రమాదస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అలాగే తేజ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.