సూసైడ్ చేసుకుందామనుకున్నా.. క్రాక్ ఫేమ్ సముద్రఖని సంచలనం..

సముద్రఖని.. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో సముద్రఖని పేరు మార్మోగిపోతోంది. అల వైకుంఠపురంలో సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ఇప్పుడు క్రాక్ సినిమాతో కిరాక్ పుట్టిస్తున్నాడు. అందులో కటారి కృష్ణ పాత్రకు ప్రాణం పోసాడు సముద్రఖని. ఈ సినిమా తరువాత తెలుగులో ఆయన చాలా బిజీ అయిపోయాడు. దర్శకుడిగా పరిచయమై రచయిత, నిర్మాతగా సత్తా చూపించి ఇప్పుడు నటుడిగా స్టార్ స్టేటస్ అందుకున్నాడు ఈయన. ఇంత పేరు తెచ్చుకున్న ఈయన ఒకప్పుడు ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఈ విషయం కూడా ఎవరో చెప్పలేదు స్వయంగా ఆయనే చెప్పాడు. క్రాక్ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తన గత స్మృతులను గుర్తు చేసుకున్నాడు సముద్రఖని.
కొన్నేళ్ల కింద ఇండస్ట్రీకి రాకముందు అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్న సమయంలో.. కాళ్లకు వేసుకోడానికి కనీసం చెప్పులు కూడా లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు సముద్రఖని. అప్పట్లో మరో ఇద్దరితో కలిసి చెన్నైలో ఒక రూమ్ లో ఉండేవాడినని.. ఆ సమయంలో తినడానికి తిండి కూడా ఉండేది కాదని.. బయటికి వెళ్లినప్పుడు తన రూమ్మేట్ బాత్ రూమ్ కు వేసుకునే చెప్పులు తాను వేసుకుని బయటికి వెళితే వాడు రోడ్డు మీద నిలబెట్టి అవమానించాడని చేదు జ్ఞాపకాలు చెప్పుకున్నాడు సముద్రఖని.
అలా రోడ్డు మీద తనను అవమానించినప్పుడు ఛీ ఇదేం బతుకు సూసైడ్ చేసుకుందాం అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు సముద్ర. కాళ్లకు బొబ్బలు వచ్చి అవి పగిలి రక్తం కారుతుంటే అలాగే నడుచుకుంటూ వెళుతున్న తనకు ఒకతను వచ్చి లిఫ్ట్ ఇచ్చాడని అతడే తన మనస్సు మార్చి చావు పరిష్కారం కాదు అని బ్రెయిన్ వాష్ చేశాడని చెప్పాడు సముద్రఖని. ఆ సంఘటన జరిగిన మూడు రోజులకు అసిస్టెంట్ డైరెక్టర్ గా తనకు అవకాశం వచ్చిందని.. తొలి పారితోషికం 100 రూపాయలు తీసుకొని మూడు జతల చెప్పులు కొన్నట్లు చెప్పాడు ఈయన. ఇప్పటికీ తన సంపాదనలో చాలా వరకు చెప్పులు, షూస్ కోసం ఖర్చు చేస్తానంటున్నాడు సముద్రఖని. ప్రస్తుతం తెలుగులో త్రిబుల్ ఆర్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ లో కూడా నటిస్తున్నాడు.