English   

సినిమాల్లేక థియేట‌ర్స్ ఖాళీ.. సంక్రాంతి కోసం ఎగ్జిబిట‌ర్లు వెయిటింగ్..

EMPTY THEATRES NO NEW MOVIES
2019-01-06 16:09:01

జనవరి 9 ఎప్పుడెప్పుడు వస్తుందా అని నందమూరి అభిమానులు వెయిట్ చేయడం కాదు థియేటర్ల ఓనర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ప్ర‌స్తుతం మార్కెట్ లో సినిమాలు లేక‌పోవ‌డ‌మే. కొన్ని నెలల నుంచి ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా ఉంది. కానీ ఈ వారం మాత్రం ఒక్క సినిమా కూడా రాలేదు. సంక్రాంతికి ఎలాగూ భారీ సినిమాలు వస్తున్నాయి కదా అని ఈ వారాన్ని ఫ్రీగా వదిలిపెట్టేసారు నిర్మాతలు. ఒకవేళ ధైర్యం చేసి విడుదల చేసినా కూడా సంక్రాంతి సినిమాలు వచ్చేసరికి వీటిని థియేటర్ల నుంచి లేపేస్తారు. ఆ భయంతోనే జనవరి 4న ఒక్క సినిమా కూడా విడుదల చేయ‌లేదు చిన్న నిర్మాత‌లు. దాంతో సినిమాలు లేక థియేటర్స్ అన్నీ బోసిపోతున్నాయి ఇప్పుడు. అందుకే జనవరి 9 కోసం వేచి చూస్తున్నారు థియేటర్ యాజమాన్యం.
ఆరోజు ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల కానుంది. బాలకృష్ణ హీరోగా వస్తున్న‌ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న కథానాయకుడు అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది. కచ్చితంగా ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బాలయ్య భారీ విజయం అందుకుంటాడని ఆశిస్తున్నారు అభిమానులు. పైగా అన్నగారి బయోపిక్ కావడంతో నమ్మకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కథానాయకుడు తర్వాత వరసగా మూడు రోజుల్లో మూడు భారీ సినిమాలు రానున్నాయి. జనవరి 10న రజనీకాంత్ పేట.. 11న రామ్ చరణ్ వినయ విధేయ రామ.. 12న వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమాలు విడుద‌ల కానున్నాయి. ఈ నాలుగు సినిమాలు వచ్చిన తర్వాత ఇప్పుడు బోసిపోతున్న థియేటర్స్ అన్నీ అప్పుడు కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories