English   

బాలయ్య కోసం పోటీలో ఆ ఇద్దరు దర్శకులు..

Santosh Srinivas
2021-01-20 16:46:59

సీనియర్ హీరోలలో ఎప్పుడూ బిజీగా ఉండే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. ఎప్పుడూ చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉంటాడు. కుదిరితే ఏడాదికి రెండు మూడు సినిమాలు కూడా విడుదల చేస్తాడు. ఒకవైపు రాజకీయాలు.. మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు.. ఇంకోవైపు సినిమాలు అన్నీ సరిగ్గా బ్యాలెన్స్ చేయడం బాలయ్యకు మాత్రమే చెల్లింది. అంత బిజీ షెడ్యూల్లో కూడా కథలు వినడానికి సమయం కేటాయిస్తాడు బాలకృష్ణ. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే మరో ఇద్దరు దర్శకులు బాలయ్య కోసం కథలు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అందులో ఒకరు బ్లాక్బస్టర్ డైరెక్టర్ అయితే మరొకరు నిరాశ పరిచారు. ఇప్పుడు ఇద్దరు తమ కథలు బాలయ్య కోసం సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు సంక్రాంతి దర్శకులు గోపీచంద్ మలినేని, సంతోష్ శ్రీనివాస్.

ఇద్దరు దర్శకులు పండక్కి తమ సినిమాలతో వచ్చారు. రవితేజతో బాక్సాఫీసు దగ్గర క్రాక్ పుట్టించాడు గోపీచంద్ మలినేని. కొన్నేళ్లుగా విజయం లేని ఈ దర్శకుడు.. ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటే అల్లుడు అదుర్స్ సినిమాతో సంక్రాంతికి వచ్చాడు సంతోష్ శ్రీనివాస్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. అయితే ఇద్దరు దర్శకులు బాలయ్య కోసం కథ సిద్ధం చేశారు.

అల్లుడు అదుర్స్ విడుదలకు ముందే బాలయ్యతో సినిమా కోసం సంతోష్ శ్రీనివాస్ కథ సిద్ధం చేసుకున్నాడు.. ఇప్పుడు అల్లుడు ఫలితం చూసిన తర్వాత బాలయ్య ఈయనకు అవకాశం ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ట్రాక్ రికార్డు చూసి అవకాశం ఇవ్వడం బాలయ్యకు నచ్చదు. బోయపాటి సినిమా వినయ విధేయ రామ డిజాస్టర్. అయినా కూడా కథ నచ్చి ఆయనకు అవకాశం ఇచ్చాడు. అలాగే సంతోష్ శ్రీనివాస్ కథకు కూడా ఓకే చెబుతాడని ప్రచారం జరుగుతుంది. మరోవైపు గోపీచంద్ మలినేని కూడా బాలయ్య కోసం ఒక కథ సిద్ధం చేశాడు. హిట్ కొట్టి జోరుమీద ఉన్నాడు కాబట్టి కచ్చితంగా ఈయన సినిమా వర్కవుట్ అవుతుందని ఇండస్ట్రీలో ప్రచారం కూడా జరుగుతుంది. మరి బోయపాటి తర్వాత ఇద్దరు దర్శకులలో  ఎవరు బాలయ్యతో సినిమా చేస్తారో చూడాలి.

More Related Stories