English   

సాఫ్ట్‌వేర్ సుధీర్ రివ్యూ

Software Sudheer
2019-12-28 13:48:42

జబర్దస్త్ కామెడీ షోతో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరో అయిపోయాడు సుడిగాలి సుధీర్. ఈయన డెబ్యూ సినిమా సాఫ్ట్ వేర్ సుధీర్‌పై కొన్ని రోజులుగా మంచి ఆసక్తే ఉంది. మరి ఇప్పుడు ఈ చిత్రంతో ఈయన ఎంతవరకు మాయ చేసాడో చూద్దాం..

కథ:

చందు (సుడిగాలి సుధీర్) మంచి అబ్బాయి. తన పని తాను చూసుకోవడం తప్ప మరేం తెలియదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఉన్నా కూడా పెళ్లి మాత్రం కాదు. అందుకే సుధీర్‌గా ఉన్న తన పేరును చందుగా మార్చుకుంటాడు. ఆ తర్వాత తన ఆఫీస్‌లో పనిచేసే స్వాతి (ధాన్యా బాలకృష్ణ) తో ప్రేమలో పడతాడు. రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ నిశ్చితార్థం తర్వాత చందు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ఆయనకు శని ఉందని స్వామిజి చెప్పడంతో యాగం చేయాల్సి వస్తుంది. కానీ ఆ స్వామిజీ చేసిన మోసంతో చందూ జీవితం ఒక్కసారిగా తిరగబడుతుంది. దాంతో మంత్రి దగ్గర పిఏగా పని చేసే చందు తండ్రి (సాయాజీ షిండే) ప్రమాదంలో పడతాడు. అప్పటి వరకు సాఫీగా సాగిపోతున్న చందు అనుకోకుండా 1000 కోట్ల దొంగతనంలో ఇరుక్కుంటాడు. అప్పుడు ఏం జరిగింది అనేది అసలు కథ..

కథనం:

జబర్దస్త్ సుధీర్ కావడంతో ఆ క్రేజ్ ఈ సినిమాకు పనికొస్తుందని నమ్మారు దర్శక నిర్మాతలు. అందుకే ఆయనపైనే కథ అంతా నడిపించారు. కానీ కథే లేకపోవడం ఈ సినిమాకు మైనస్. తలతోక లేకుండా రాసుకున్న కథ కావడంతో ఎటూ కాకుండా పోయాడు సాఫ్ట్‌వేర్ సుధీర్. అక్కడక్కడా ఆయన కామెడీ టైమింగ్ వాడుకుని కొన్ని జబర్దస్త్ పంచులు రాసాడు దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల. కానీ కేవలం డబ్బులు వస్తే చాలనుకున్నాడో లేదంటే కథ ఎలా ఉంటే ఏంటి తన క్రేజ్‌తో ఓపెనింగ్స్ వస్తాయనుకున్నాడో తెలియదు కానీ సాఫ్ట్‌వేర్ సుధీర్‌లో అస్సలు కథ లేదు. లాజిక్స్ లేకుండా జబర్దస్త్ జోకులు వేసుకుంటూ కథ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు దర్శకుడు. చివరికి కథ ఏంటో తెలియక సెకండాఫ్‌లో అనవసరంగా అరగంట ఫ్లాష్ బ్యాక్ కూడా ఇరికించాడు దర్శకుడు రాజశేఖర్. ఇది చూసిన తర్వాత విసుగుకు పరాకాష్ట కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మరో మైనస్. అసలు కథే లేకుండా సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే సుధీర్ సినిమా. ఎక్కడో మొదలై.. మంత్రాలు తంత్రాలు అనుకుంటూ సెకండాఫ్‌లో రైతులు.. వాళ్ల ఆత్మహత్యలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్లిపోయింది. తల తోక లేకుండా తీసిన సినిమా కావడంతో కామెడీ కాదు కదా ఏదీ వర్కవుట్ కాలేదు. మొత్తం సినిమాలో సుధీర్ డాన్సులు ఒక్కటే కాస్త ఊరట. కానీ అది ఒక్కటే ఉంటే సరిపోదు కదా.. ఫస్టాఫ్ అంతా అలా జోకులతో కాలం గడిపేసి.. జాతకంలో దోషం పేరుతో యమలీలలో అలీకి ఇచ్చినట్లు భవిష్యవాణిని ఇచ్చి కాలం గడిపేసాడు దర్శకుడు. సెకండాఫ్‌లో అసలు ఫ్లాష్ బ్యాక్ ఎందుకొస్తుందో కూడా అర్థం కాదు. క్లైమాక్స్ రైతుల బాధలు అంటూ ముగించేసాడు. మధ్యలో గద్ధర్ పాట కూడా పెట్టేసాడు. ఇలా ఏది పడితే అది తీసేసి పొట్లం కట్టినట్లు చుట్టేసాడు దర్శకుడు రాజశేఖర్.

నటీనటులు:

సుధీర్ పర్లేదు.. హీరోగా కాదు కానీ నటుడిగా అక్కడక్కడా పర్లేదనిపించాడు. కానీ రవితేజ, రజినీకాంత్‌ను తెలియకుండానే ఇమిటేట్ చేసాడు సుధీర్. ధన్య బాలకృష్ణ గ్లామర్ షోతో ఆకట్టుకుంది. సాయాజీ షిండే, ఇంద్రజ, శివప్రసాద్ పర్లేదు.. తమకు ఉన్నంతలో పర్లేదనిపించారు.

టెక్నికల్ టీం:

భీమ్స్ సంగీతం అస్సలు ఆకట్టుకోలేదు. ఎంత అందమో పాట మాత్రం సుధీర్ డాన్సులతో పర్లేదు అనిపిస్తుంది. సీనియర్ ఎడిటర్ గౌతంరాజు ఎడిటింగ్ కత్తెర చాలా వీక్. అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ పర్లేదు. దర్శకుడు రాజశేఖర్ పులిచర్ల కథ చాలా పాతదే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే అయినా బాగా రాసుకుని ఉంటే బాగుండేదేమో కానీ అలా కూడా జరగలేదు. అసలు లాజిక్కులతో పని లేకుండా 1000 కోట్ల స్కామ్‌ను ఏదో చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినంత ఈజీగా రైతులకు పంచేయడం ఏంటో దర్శకుడికే తెలియాలి. అలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. నిర్మాత శేఖర్ రాజు నటుడిగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. నిర్మాణ విలువలు పర్లేదు.

చివరగా: సాఫ్ట్‌వేర్ సుధీర్.. సాఫ్ట్‌వేర్‌ పూర్తిగా డౌన్.. సుధీర్ ఫాల్..  

రేటింగ్: 1.5/5

More Related Stories