English   

ఇదేనా మనం SP బాలసుబ్రహ్మణ్యంకు ఇచ్చే గౌరవం..

SP Balasubrahmanyam
2020-10-02 08:46:05

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇది పేరు కాదు ఒక చరిత్ర. ప్రపంచ సినీ చరిత్రలో ఎప్పటికీ ఎవరికీ సాధ్యం కాని రీతిలో 41 వేలకు పైగా పాటలు పాడిన అమర గాయకుడు. ఇలాంటి మనిషి మళ్లీ పుట్టాడు అంటూ అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ మౌన కన్నీరు కారుస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మరణించినందుకు తమిళనాడుతో పాటు కన్నడ సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేశాయి. ఆయన గౌరవార్థం వాళ్లు చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో అయితే మన బాలుకు వాళ్లు పట్టం కడుతున్నారు. 

చెన్నైలో బాలసుబ్రహ్మణ్యం చనిపోతే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. కడసారి చూపుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు సినిమా ప్రముఖులు కూడా వచ్చారు. కరోనా వైరస్ ఎంత భయపెడుతున్నా కూడా బాలసుబ్రహ్మణ్యం ముందు వాళ్ళవన్నీ పట్టించుకోలేదు. బాలు చనిపోయిన ఐదు రోజులకు భారీగా సంతాప సభ ఏర్పాటు చేశారు. దానికి కార్తీ లాంటి స్టార్ హీరోలతో పాటు మరికొందరు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉన్నంతలో ఎస్పీ చేసిన సేవలను గుర్తించి వాళ్ళు ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. కానీ మన నేలపై పుట్టిన ఈ అమర గాయకుదీని తెలుగు ఇండస్ట్రీ మాత్రం మరచిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఈయన గాత్రంతో ఎంతో మంది హీరోలు స్టార్స్ అయ్యారు.

అలాంటి లెజెండ్ చనిపోతే కనీసం చూడటానికి కూడా ఎవరు వెళ్లలేదు. కారణం అడిగితే కరోనా వైరస్ అంటున్నారు.. కానీ వాళ్లు చేయాల్సిన పనులు మాత్రం చేసుకుంటున్నారు. మరోవైపు టాలీవుడ్ ఇప్పటివరకు ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాప సభ ఏర్పాటు చేయలేదు. ఎవరూ అడిగిన పాపాన కూడా పోవడం లేదు.. రాజుగారి కుక్క చచ్చిపోతే వస్తారు.. కానీ రాజుగారు పోతే రారు అన్న చందాన ఉంది ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి. ఆయన బతికున్నప్పుడు ఎంతో మందికి తన గాత్రంతో ప్రాణం పోశాడు. తీరా ఆయన ప్రాణం పోయిన తర్వాత అవసరం తీరిపోయింది అనుకున్నారో ఏమో కానీ మన ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. చనిపోయిన రోజు మాత్రం సోషల్ మీడియాలో సంతాపం వెల్లువలా వచ్చింది. అదే ప్రత్యక్షంగా మాత్రం రావడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీ పక్కనున్న తమిళ ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి.. పరాయి భాషా గాయకుడిని కూడా వాళ్ళు అంతగా గౌరవిస్తూ ఉంటే మీ సొంత మనిషిని మీరు పట్టించుకోవడం లేదంటూ బండ బూతులు తిడుతున్నారు బాలు అభిమానులు. 

More Related Stories