English   

అందమే అస్తమించింది..

Sridevi
2018-02-25 12:58:37

శ్రీదేవి చనిపోయిందా.. ? మొన్నే కదా.. పదహారేళ్ల వయసులో సిరిమల్లెపువ్వా అని పాడింది. నిన్నే కదా ఇంద్రలోకం నుంచి వచ్చింది. మరి అప్పుడే ఏం తొందరొచ్చిందని అతిలోక సుందరి ఆ లోకానికి వెళ్లింది. ఏమో ఎవరికి తెలుసు. తను నిజంగా దేవకన్యేనేమో. ఏదో పొరబాటున ఈ లోకాని వచ్చి కోట్లమందిని మైమరపించి.. ఆ రూపం హృదయాల్లో పదిలపరచుకున్న వారందరినీ ఏడిపిస్తూ తళుక్కున్న మాయపోయింది.. ఇలా మాయం కావడం అతిలోక సుందరికి మామూలే. కానీ దాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు సాధ్యమా..?

మరణమా అది. వేడుక. అందంగా ముస్తాబై.. మరోసారి అందాన్ని అసూయపరచి.. అందరితో కలిసి ఆహ్లాదంగా గడుపుతూ క్షణాల్లోనే మాయమైన వేడుక. మరి ఇలాంటి మరణం దేవతలకు కాక మరెవరికి వస్తుంది. అందుకే శ్రీదేవి శ్రీదేవి కాదు.. నిజంగా ఇంద్రలోకం నుంచి వచ్చిన ఇంద్రజే. మరణం అందరికీ సహజమే. కానీ శ్రీదేవి మరణం అసంపూర్ణం. శరీరాన్ని మాత్రం తీసుకువెళ్లి ఆత్మను ఇక్కడే వదిలేసిన అసంపూర్ణ మరణం అది..  బాల నటిగా వచ్చి ఆబాలగోపాలాన్ని అలరించడం అందరికీ సాధ్యమా. దక్షిణాదిలో బాలనటిగా అరంగేట్రం చేసిన ఎవ్వరికీ దక్కని అరుదైన స్టార్డమ్ సొంతం చేసుకున్న రేరెస్ట్ బ్యూటీ శ్రీదేవి. అందం, అమాయకత్వం, సమ్మోహితుల్ని చేసే నవ్వు.. ఏ పాత్రైనా చేయగల ప్రతిభ. ఇది ఏ కొద్దిమందికో సొంతమైన టాలెంట్. ఆ ప్రతిభతోనే కోట్లాదిమంది అభిమానుల్సి సొంతం చేసుకున్న అరుదైన నటి శ్రీదేవి.

శ్రీదేవి.. ఈ పేరు పలవరించకుండా.. ఈ పేరు తలవకుండా.. కనీసం మూడుతరాల మనుషులు యవ్వనాన్నే దాటలేదు. అదీ తన ఛరిష్మా. మూడుదశాబ్ధాల పాటు వెండితెరనే తన అందంతో వెలిగిన ఘనత శ్రీదేవిది. ఆమెపై అభిమానంతో తమ పిల్లలకు ఆ పేరే పెట్టుకున్నవారెందరో. ప్రేక్షకులే కాదు.. సినీ కవులు సైతం శ్రీదేవిపై పాటలు రాయడంలో ఉరకేలేసేవారు.. 1963 ఆగస్టు 13న తమిళనాడు రాష్ట్రంలోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి.. ఆమె తండ్రి లాయర్‌. నాలుగు సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది శ్రీదేవి. శ్రీదేవి తెలుగు ప్రేక్షకులకూ బాలనటిగానే పరిచయమైంది.యశోదకృష్ణలో బాలకృష్ణుడుగా, బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్ కు మనవరాలుగా మెప్పించింది. ఆ తరువాత ఆయన సరసన హీరయిన్ గా ఆకుచాటున తడిసిన పిందెలా ఆబాలగోపాలాన్ని ఆకట్టుకుంది. అచిరకాలంలోనే అగ్రనాయికగా ఎదిగి అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసి అప్పటి టాప్ హీరోయిన్స్ జయ ద్వయానికి చెక్ పెట్టింది. ఓ సిరిమల్లె పువ్వులా.. జామురాతిరి జాబిలమ్మలా.. పాలచుక్కలు.. తేనెబొట్టులు కలిపి రంగరించిన అతిలోక సుందరి.. శ్రీదేవి. దక్షిణాది, ఉత్తరాదిలో అత్యధిక కాలం ఓ వెలుగు వెలిగిన ఘనత ఈ దేవిది. పదహారేళ్ల వయసు చిత్రం నుంచే.. ఆరేళ్ల పిల్లల నుంచి అరవైయేళ్ల వారి వరకూ అందరి మనసులూ దోచుకున్న సమ్మోహనం శ్రీదేవి. ఒకప్పుడు తెల్లారబోతుంటే కల్లోకి వచ్చిన అందం ఆమెది. అందానికి.. అభినయానికి.. పసితనానికి.. పరువానికి.. అద్దం పట్టిన అతిలోక సుందరి ఇక లేదంటే అందమే అస్తమించినట్లవుతోంది..

శ్రీదేవి అంటే గుర్తుకొచ్చే ఫస్ట్ ఫిల్మ్ పదహారేళ్ళ వయసు. లేత కొబ్బరి నీళ్ళలా.. కోనసీమ ఎండలా.. శ్రీదేవి అందాలు.. అభినయాలు.. ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల మనసులో తాజాగానే ఉన్నాయి. తెరపై శ్రీదేవి.. కమల్ హాసన్.. జంట మోస్ట్ పాపులర్. కళ్యాణరాముడు.. ఆకలిరాజ్యం, ఒకరాధ ఇద్దరు కృష్ణులు, వసంత కోకిల.. ఇలా ఎన్నో సినిమాల్లో ఈ జంట ప్రేక్షకుల్ని మైమరపించింది. ఏఎన్ఆర్, శ్రీదేవి.. జంటగా నటించిన ప్రేమాభిషేకం 500 రోజులు పైగా ఆడింది. అక్కినేనితో బెస్ట్ పెయిర్ అనిపించుకున్న శ్రీదేవి ఆ తర్వాత.. ఆయన తనయుడు నాగార్జునతో కూడా డ్యూయెట్స్ పాడడం ఆశ్చర్యం. అలాగే సూపర్ స్టార్ కృష్ణతో ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చింది శ్రీదేవి. తెలుగులో ఆమె క్రిష్ణతోనే ఎక్కువ సినిమాల్లో నటించింది. కృష్ణ, శ్రీదేవి పాటలు, డ్యాన్స్ లంటే అప్పటి యూత్ ఒక స్పెషల్ క్రేజ్.  బంగారు చెల్లెలు అనే చిత్రంలో శోభన్ బాబుకు చెల్లిగా నటించింది శ్రీదేవి.తర్వాత వీరు హీరోహీరోయిన్లుగా ఎన్నో సూపర్ హిట్స్ వచ్చాయి. కార్తీక దీపంలో ఆమె నటన కన్నీళ్ళు పెట్టించింది. దేవతలో ఓ వైపు అందం.. మరో వైపు అభినయం.. శ్రీదేవికి ఎంతోమంది మహిళాభిమానుల్ని సంపాదించిపెట్టింది.అయితే చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగే టైమ్ కు ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అందుకే వీరి కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు రాలేదు. అయినా జగదేక వీరుడు అతిలోక సుందరితో జగానికే తెలిపేసింది అతిలోకసుందరి అంటే తానేనని.

తమిళంలో అరంగేట్రం చేసి.. తెలుగులో డ్రీం గర్ల్ గా మారిన శ్రీదేవి.. బాలీవుడ్ లో థండర్ థైస్ గా అదరగొట్టింది. హిమ్మత్ వాలా.. సద్మా.. చాందినీ.. చాల్ బాజ్.. వంటి సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ నెంబర్ గేమ్ లో నంబర్ వన్ అయింది. కెరీర్ లో శ్రీదేవికి ఇప్పటి వరకూ ఒక్క నేషనల్ అవార్డు రాలేదు కానీ ప్రేక్షకుల నుంచి బోలెడెన్ని రివార్డులు వచ్చాయి. నటనలో శ్రీదేవిది స్పెషల్ మోర్. ఇప్పటికి మానసిక అనారోగ్యం ఉన్న పాత్రలు ఎవరైనా హీరోయిన్ చేయాలంటే వసంత కోకిలలో శ్రీదేవినే తమ గైడ్ గా భావిస్తారు.తమిళ చిత్ర సీమలో పదేళ్లపాటు అగ్రహీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది శ్రీదేవి. తర్వాత తెలుగులోనూ టాప్ హీరోయిన్ అయింది. తెలుగులో చేస్తున్నప్పుడే బాలీవుడ్ కు వెళ్లింది. ఇక్కడి క్రేజ్ అక్కడ ఆఫర్స్ ఇచ్చింది కానీ, హిట్స్ ఇవ్వలేదు. అప్పుడు రాఘవేంద్రరావు ఊరికి మొనగాడు చిత్రాన్ని హిందీలో హిమ్మత్ వాలాగా తీస్తూ శ్రీదేవిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాడు. హిమ్మత్ వాలా సూపర్ హిట్ కావడంతో ఈ దేవి హవా మొదలైంది. బాలీవుడ్ లో ఎక్కువగా జితేంద్ర, మిథున్ చక్రవర్తితోలతోనే నటించిందీ సోయగం. 80వ దశకంలో మిస్టర్‌ ఇండియా, నగీనా, జాన్‌బాజ్‌, కర్మ, ఘర్‌ సన్సార్‌ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలు శ్రీదేవిని బాలీవుడ్‌లో టాప్‌హీరోయిన్‌గా నిలబెట్టాయి. ఈ దేవి దెబ్బకు అప్పటి వరకూ ఉన్న బ్యూటీస్ అంతా సర్దేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. 

దక్షిణాదిలో ఎంతమంది అభిమానులను సంపాదించుకుందో అంతకంటే రెట్టింపు దేశమంతా ఫ్యాన్స్ అయ్యారామెకు. ఎలాంటి పాత్ర చేసినా శ్రీదేవి అందంలో ప్రధాన ఆకర్షణ తన అమాయకత్వమే.హిమ్మత్ వాలాలో అహంకారం ప్రదర్శించినా.. ఈ అమాయకత్వమూ కనిపిస్తుంది. అదే శ్రీదేవితో ఎక్కువమంది ప్రేమలో పడటానికి కారణం. అదే.. కొన్ని కోట్ల మంది ఈ దేవిని ఆరాధించడానికి కారణం. ఇంకా చెప్పాలంటే ఎన్నో శరీరాల్లో యవ్వనాన్ని వెలిగించిన రూపం శ్రీదేవి. శ్రీదేవి పెళ్లి చేసుకుంది. ఈ మాట విని ఎన్ని గుండెలు పగిలిపోయాయో చెప్పలేం. ఎన్ని హృదయాలు తల్లడిల్లిపోయాయో ఊహించలేం. అభిమానం ఆరాధనగా మారి.. ఆమె తమ లోకంగా జీవితంగా ఊహించుకున్నవారెందరో.. అలాంటి వారందరినీ ఒంటరులను చేసి తను జంటగా మారింది. ఆ పెళ్లి అచ్చమైన అభిమానులకు నచ్చలేదు. కానీ జీవితం ఊహలకు తగ్గట్టుగా ఉండదు కదా. తర్వాత సినిమాలకు ఫుల్ స్టాప్. మధ్యలో బుల్లితెర ప్రవేశం. ఏదైతేనేం.. శ్రీదేవి పెళ్లి చేసుకుంది.. మళ్లీ సినిమాలు చేయడం లేదు. ఈ మాట అభిమానుల్ని తీవ్రంగా కలచివేసింది. కొన్ని అభిమానాలు సమకాలీనంగా మాత్రమే ఉండవు. శ్రీదేవి విషయంలో ఇది నిజం. అందుకే తను మళ్లీ సినిమాలు మానేసినా ఆమెపై అభిమానం తగ్గలేదు. అందుకే మళ్లీ సినిమా చేస్తుందంటే ఆనందపడ్డవాళ్లెందరో. రీ ఎంట్రీ ఇస్తూ శ్రీదేవి చేసిన మూవీ ఇంగ్లిష్ వింగ్లిష్.. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై శ్రీదేవి మ్యాజిక్ ను చూపించింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తో మరోసారి ఆడియన్స్ ను ఫిదా చేసింది. దేశవిదేశాల్లోనూ మంచి కలెక్షన్లు కూడా సాధించిన ఈ సినిమాను సౌత్ లోనూ రిలీజ్ చేశారు. ఇదే టైమ్ లో ప్రభుత్వం నుంచి పద్మశ్రీ కూడా వచ్చింది. ఇంగ్లిష్ వింగ్లిష్ తర్వాత.. చాలా గ్యాప్ తీసుకుని మామ్ అనే సినిమాతో మరోసారి మెస్మరైజ్ చేసింది.సినిమాలు చేసినా చేయకున్నా.. ఏ తెరపైనా కనిపించకపోయినా అసలు శ్రీదేవి లేని ఫిల్మ్ ఇండస్ట్రీని ఊహించలేం. అంతలా తనదైన ముద్రవేసిన నటి తను. కొన్నాళ్ల క్రితమే తెలుగులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరై తెలుగువారిపై అభిమానం చాటుకుంది. రాజమౌళికి సంబంధించిన వివాదంలోనూ ఎంతో హుందాగా ప్రవర్తించి మరోసారి మనసులు దోచుకుంది.

ఏమైతేనేం.. శ్రీదేవి వెళ్లిపోయింది. తను వచ్చిన లోకం, అమరపురికి తిరిగి వెళ్లిపోయింది. ఎక్స్ పైరీ డేట్ లేని అందం, తరాలకూ తరగని అభిమానుల్ని సంపాదించుకుని.. ఇప్పుడు వాళ్లందరి హృదయాల్ని బద్ధలు చేసి నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోయింది. దక్షిణాదిలో ఒక్కోతరాన్ని ఒక్కో హీరోయిన్ ప్రభావితం చేసింది. కానీ ఎన్నో తరాలను ప్రభావితం చేసిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. ఇప్పుడా దేవిని దేవుడే తీసుకువెళ్లిపోయాడు.. అందానికి చిరునామా అదృశ్యమైంది.. సమ్మోహననానికి సర్వోన్నత రూపం శాశ్వతంగా చెరిగిపోయింది. ప్రేక్షకులకు ఎన్నటికీ తరగని జ్ఞాపలకాలను, కుటుంబానికి ఎప్పటికీ తీరని వ్యాకులతను మిగిల్చి అందం అస్తమించింది.. జీర్ణించుకోవడం కష్టమే అయినా.. శ్రీదేవి చనిపోయింది.. అమరపురి అధినేత కూతురు.. ఆయన వద్దకు వెళ్లిపోయింది.. 


 

More Related Stories