English   

శ్రీ‌దేవి షాక్.. అస‌లేం జ‌రిగింది..?

Sridevi
2018-02-25 19:08:03

అంతా ఓ క‌ల‌లా జ‌రిగిపోయింది. తెల్లారేలోపు శ్రీ‌దేవి జీవితం కూడా తెల్లారిపోయింది. కొన్ని గంట‌ల కింది వ‌ర‌కు పెళ్లిలో అంద‌రితో పాటే ఆడిపాడిన శ్రీ‌దేవి.. తెల్లారేస‌రికి ప్రాణం లేకుండా మారిపోయిందంటే న‌మ్మ‌డానికి ఎవ‌రి మ‌న‌సులు ఒప్పుకోలేదు. అస‌లు ఇది ఎలా నిజం అయిందంటూ త‌మ‌ను తామే గిల్లి చూసుకున్నారు కూడా. అప్ప‌ట్లో ఓ సారి శ్రీ‌దేవి ఇలాగే చ‌నిపోయిందంటూ ఓ ఫేక్ న్యూస్ వ‌చ్చింది. కానీ అది త‌ర్వాత అబ‌ద్ధం అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ సారి దేవుడు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాడు. అబ‌ద్ధం అవుతుందేమో అనుకున్న వార్త కాస్తా నిజ‌మే అయింది. ఈ సారి నిజంగానే శ్రీ‌దేవి.. మ‌న‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయింది.

మొన్న‌టి వ‌ర‌కు ఆరోగ్యంగానే క‌నిపించిన శ్రీ‌దేవి.. ఇంత స‌డ‌న్ గా మ‌ర‌ణించ‌డం అంద‌రికి షాక్ ఇస్తుంది. అసలేం జ‌రిగిందా అంటూ ఆరా తీస్తున్నారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. వారం రోజుల కింద దుబాయ్ కు బోనీక‌పూర్ బంధువు మోహిత్ మ‌ర్వా పెళ్లికి వెళ్ళింది శ్రీ‌దేవి. అక్క‌డే కొన్ని రోజులుగా పెళ్లి వేడుక‌లు ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకో రకంగా మ‌నీష్ మ‌ల్హోత్రా డిజైన్ చేసిన క్యాస్ట్యూమ్స్ లో చిన్న కూతురు ఖుషీతో క‌లిసి క‌నిపించింది శ్రీ‌దేవి. రోజూ మాదిరే ఫిబ్ర‌వ‌రి 25న కూడా మెరిసిపోయింది శ్రీ‌దేవి. రాత్రి 11 గంట‌ల ప్రాంతంలో అంద‌రితో ఆడిపాడింది శ్రీ‌దేవి. ఆ త‌ర్వాత బాత్రూమ్ కు వెళ్లిన శ్రీ‌దేవి.. అక్క‌డే చ‌ల‌నం లేకుండా ప‌డిపోయింది.

ఎంత‌సేప‌టికి రాక‌పోవ‌డంతో శ్రీ‌దేవి కోసం వెళ్లిన కుటుంబం.. ఆమెను అచేత‌నంగా చూసి షాక్ అయ్యారు. వెంట‌నే దుబాయ్ లోని ఓ హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఆమె తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీక‌రించారు. అప్ప‌టి వ‌ర‌కు త‌మ మ‌ధ్యే ఉన్న శ్రీ‌దేవి.. ఇక లేద‌ని తెలిసి నిర్ఘాంత పోయారు కుటుంబ స‌భ్యులు. పెళ్లి వేడుక కాస్తా విషాద వేదిక‌గా మారిపోయింది. ఇప్ప‌టికీ ఇండియాకు శ్రీ‌దేవి భౌతిక‌కాయం రాలేదు. అనిల్ అంబానీ స్పెష‌ల్ ఫ్లైట్ లో ఆమె పార్థివ దేహాన్ని తీసుకొస్తున్నారు.

More Related Stories