అయ్యో పాపం.. అతిలోకసుందరి..!

54 ఏళ్ల జీవితంలో.. 50 ఏళ్లు ఇండస్ట్రీలోనే ఉంది. చనిపోయే వరకు కూడా నటనే ఊపిరిగా బతికింది. ఎన్నో అవార్డులు.. మరెన్నో రివార్డులు.. ఇంకెన్నో రికార్డులు.. ప్రేక్షకుల మన్ననలు.. వెలకట్టలేని అభిమానం.. కదిలించలేని క్రేజ్ కోట.. ఇవన్నీ చూసింది శ్రీదేవి. కానీ ఎన్ని అవార్డులు చూసినా అందరూ జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని కలలు కనే నేషనల్ అవార్డ్ మాత్రం శ్రీదేవికి రాలేదు. చాలా సినిమాల్లో అద్భుతమైన అభినయం చూపించినా కూడా ఎందుకో శ్రీదేవికి రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది.. అది కూడా ఆమె చనిపోయిన తర్వాత. ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించింది. ఆమె కన్నుమూసిన రెండు నెలలకు ఇప్పుడు నేషనల్ అవార్డ్ వచ్చింది. గతేడాది ఆమె నటించిన మామ్ సినిమాకు అవార్డులు బాగానే వచ్చాయి. ఈ చిత్రానికి బెస్ట్ ఆర్ఆర్ అవార్డ్ వచ్చింది. ఇక ఉత్తమనటిగా శ్రీదేవికి జాతీయ అవార్డు వచ్చింది. ఆమె ఉండుంటే జీవితంలో ఇప్పుడున్న సంతోషంగా ఎప్పుడూ ఉండేది కాదేమో..?