English   

శ్రీ‌నివాస క‌ళ్యాణం రివ్యూ

Srinivasa-Kalyanam-Review
2018-08-09 13:28:03

శ‌త‌మానం భ‌వ‌తి లాంటి సినిమా త‌ర్వాత స‌తీష్ వేగేశ్న‌-దిల్ రాజు కాంబినేష‌న్ అంటే ఉండే అంచ‌నాలు వేరు. శ్రీ‌నివాస క‌ళ్యాణంపై ఉన్న అంచ‌నాలు ఇవే ముందు నుంచి. సినిమా ఎలా ఉంటుంది అని అడ‌క్కుండా.. ఎంత బాగుంటుంద‌నే ఆలోచించారంతా. మ‌రి వాళ్ల అంచ‌నాల‌ను ఈ సినిమా ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టింది..?

క‌థ‌: శ్రీ‌నివాస్(నితిన్) చంఢీఘ‌ర్ లో ఆర్కిటెక్ట్. కుటుంబ విలువ‌లు తెలిసిన వాడు. ఫ్యామిలీ అంటే ప్రాణం ఇస్తాడు. అలాంటి శ్రీ‌నివాస్ లైఫ్ లోకి శ్రీ‌దేవి(రాశీఖ‌న్నా) వ‌స్తుంది. కోటీశ్వ‌రుడు ఆర్కె(ప్ర‌కాశ్ రాజ్) కూతురు అయినా కూడా సొంతంగా ప‌ని చేస్తుంటుంది. శ్రీ‌నివాస్ లైఫ్ చూసి అత‌న్ని ఇష్ట‌ప‌డుతుంది. పెళ్లికి కూడా ఒప్పిస్తుంది. అయితే శ్రీ‌నివాస్, శ్రీ పెళ్లి జ‌ర‌గాలంటే ఓ అగ్రీమెంట్ కావాలంటాడు ఆర్కె. అప్పుడు శ్రీ‌నివాస్ ఏం చేస్తాడు..? అస‌లు ఈ పెళ్లి కోసం ఏ అగ్రిమెంట్ పెట్టాడు..? అందుకు వ‌రుడి కుటుంబ స‌భ్యులు ఏం అన్నారు అనేది మిగిలిన క‌థ‌.. 

క‌థ‌నం: పెళ్ళి గొప్ప‌త‌నం చెబుతూ ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. అందులో కొన్ని అద్భుత‌మైన చిత్రాలున్నాయి.. వ‌రుడు లాంటి డిజాస్ట‌ర్స్ కూడా ఉన్నాయి. అయితే శ్రీ‌నివాస క‌ళ్యాణం మాత్రం మ‌ధ్య‌లో నిలిచిపోయింది. ఈ సినిమా గురించి యూనిట్ చెప్పుకున్న‌ట్లు అద్భుతం అని చెప్ప‌లేం.. అలాగ‌ని తీపిపారేసేంత సినిమా కూడా కాదు. క్లైమాక్స్ చూసిన త‌ర్వాత మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ తోనే బ‌య‌టికి వ‌స్తారు ప్రేక్ష‌కులు కానీ దానికి ముందు ఒక్క‌సారి రీ కాల్ చేసుకుంటే సినిమాలో ఏముంది అనే అనుమానం కూడా వ‌స్తుంది. అంటే అప్పుడే స‌తీష్ ఈ సారి పూర్తిగా స‌క్సెస్ కాలేద‌ని అర్థ‌మైపోతుంది. శ‌త‌మానం భ‌వ‌తి కూడా పాత క‌థే. కానీ దీన్ని డీల్ చేసినంత క‌సి ఎందుకో శ్రీ‌నివాస క‌ళ్యాణంలో క‌నిపించ లేదు. ఫ‌స్టాఫ్ అంతా కేవ‌లం హీరో హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ‌.. మ‌ధ్య‌లో ఇంటికి హీరో చేసే ఫోన్లు.. నాయ‌న‌మ్మ సంప్ర‌దాయ‌పు క్లాసులు త‌ప్పిస్తే ఏం క‌నిపించ‌దు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు అస‌లు క‌థ మొద‌లు కాక‌పోవ‌డంతో శ్రీ‌నివాస క‌ళ్యాణం మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ‌స్తాయి. అయితే ఇంట‌ర్వెల్ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌లైంది. పెళ్లి గురించి తాను చెప్పాల‌నుకున్న‌ది.. చూపించాల‌నుకున్న‌ది అప్ప‌ట్నుంచి మొద‌లు పెట్టాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ వ‌ర‌కు ఆర్డ‌ర్ వేసుకుంటూ ఒక్కో పెళ్లి ప‌నితో పాటు అందులోని గొప్ప‌త‌నాన్ని చూపిస్తూ వెళ్లిపోయాడు. ఇది ఆస‌క్తి క‌రంగానే సాగింది. అయితే శ‌త‌మానం భ‌వ‌తి స్థాయిలో మాత్రం ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్స్ ఇందులో ఉండ‌వు. క్లైమాక్స్ సీన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అక్క‌డ మ‌రోసారి స‌తీష్ వేగేశ్న త‌న పెన్ ప‌వ‌ర్ చూపించాడు. పెళ్లిలో ఉన్న ప్ర‌తీ గొప్ప‌త‌నం గురించి చెబుతూ నితిన్, ప్ర‌కాశ్ రాజ్ చెప్పే డైలాగుల‌తో సినిమా రేంజ్ పెరుగుతుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఫీలింగ్స్ అన్నీ పోయి మంచి సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ వ‌స్తుంది. ఇదొక్క‌టే శ్రీ‌నివాస క‌ళ్యాణంకు క‌లిసొచ్చే అంశం.

న‌టీన‌టులు: నితిన్ చ‌క్క‌గా న‌టించాడు. అయితే త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర కావ‌డంతో రొటీన్ నుంచి కొంచెం కొత్త‌గా అనిపించింది. క్లైమాక్స్ లో అంత భారీ డైలాగులు నితిన్ నుంచి ఊహించ‌డం క‌ష్ట‌మే. కానీ క‌ష్ట‌ప‌డ్డాడు. ఇక రాశీఖ‌న్నా క్యూట్ గా త‌న పాత్ర త‌ను చేసుకుంటూ వెళ్లిపోయింది. నందిత‌శ్వేత ప‌ర్ ఫెక్ట్ తెలుగింటి మ‌రద‌లిగా ఫిక్సైపోయింది. ఆమె పాత్ర‌కు స్కోప్ లేక‌పోయినా త‌న న‌ట‌న‌తో గుర్తు చేసింది. ప్ర‌కాశ్ రాజ్, జ‌య‌సుధ‌, న‌రేష్, రాజేంద్ర ప్ర‌సాద్, సితార‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఈ చిత్రంలో. అంతా త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు.

టెక్నిక‌ల్ టీం: మిక్కీ జే మేయ‌ర్ మ‌రోసారి త‌న‌దైన శైలిలో సంగీతం అందించాడు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. శ్రీ‌నివాస క‌ళ్యాణం టైటిల్ సాంగ్ ఇప్ప‌టికే హైలైట్ అయిపోయింది. ఇది సినిమాలో ఇంకా బాగుంది. మిగిలిన పాట‌లు కూడా బాగున్నాయి. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్. పెళ్లి పాట బాగుంది. మ‌ధు ఎడిటింగ్ ప‌ర్లేద‌నిపించింది. ఫ‌స్టాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా వెళ్లిన‌ట్లు అనిపించాయి. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక సతీష్ వేగేశ్న ద‌ర్శ‌కుడిగా యావ‌రేజ్ మార్కులే వేయించుకున్నాడు ఈ సారి. ర‌చ‌యిత‌గా కూడా శ‌త‌మానం భ‌వ‌తి మాదిరి నేరుగా గుచ్చుకునే మాట‌లు లేవు. అయితే భార్య గురించి చెప్పే సీన్ తో పాటు మ‌రికొన్ని స‌న్నివేశాల్లో రైటింగ్ బాగుంది.

చివ‌ర‌గా:  శ్రీ‌నివాస క‌ళ్యాణం.. మ‌న పెళ్లిలాగే సా......గుతుంది..!

రేటింగ్: 3/5

More Related Stories