దిల్ రాజు బ్యాడ్ టైమ్ @ 2018..

ఏ దేవుడు కరుణించాడో కానీ 2017 మొత్తం దిల్ రాజుకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. వచ్చిన సినిమా వచ్చినట్లు హిట్ కొట్టి ఏకంగా అరడజన్ సినిమాలతో రాజుగారి పంట పండించాయి. అయితే ఇదే మ్యాజిక్ ఇదే ఏడాది కూడా కొనసాగిద్దాం అనుకున్న దిల్ రాజుకు 2018 వరస షాకులు ఇస్తుంది. ఇప్పటికే ఈ ఏడాది విడుదలైన లవర్ డిజాస్టర్ గా నిలిచింది. అంత ఈజీగా కుర్ర దర్శకులను నమ్మని దిల్ రాజు.. అనీష్ కృష్ణ విషయంలో మోసపోయాడు.
సాధారణంగా దిల్ రాజు లెక్క అంత ఈజీగా తప్పదు. కానీ అప్పుడేదో మాయలో సునీల్ విషయంలో మోసపోయాడు ఈ నిర్మాత. తన దగ్గరే ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వాసువర్మ చెప్పిన కథ నచ్చి.. నమ్మి కృష్ణాష్టమి నిర్మించాడు రాజు. ఈ చిత్రం కనీసం రెండు రోజులు కూడా ఆడలేదు. దిల్ రాజు కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచిపోయింది ఈ చిత్రం. ఈ చిత్రం తర్వాత మళ్లీ లవర్ తోనే డిజాస్టర్ అందుకున్నాడు దిల్ రాజు. రాజ్ తరుణ్ కెరీర్ ను ఈ చిత్రం కూడా కాపాడలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంకు కూడా టాక్ తేడాగా రావడంతో ఆలోచనలో పడుతున్నాడు దిల్ రాజు.
కథల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. వరసగా రెండు సినిమాలు తేడా కొట్టడం అంటే చిన్న విషయం కాదు. మళ్లీ రాజుగారి కథల జడ్జిమెంట్ పైనే లేనిపోని అనుమానాలు వచ్చేస్తాయి ప్రేక్షకులకు. ఇప్పుడు ఈయన మూడు సినిమాలతో రానున్నాడు. ఇప్పటికే రామ్ హలో గురు ప్రేమకోసమే అక్టోబర్ 18న ఫిక్స్ అయిపోయింది. ఇక సంక్రాంతికి అనిల్ రావిపూడి ఎఫ్ 2.. ఎప్రిల్ 5న మహేశ్ మహర్షి సినిమాలు రానున్నాయి. మరి వీటితో దిల్ రాజు మళ్లీ ఫామ్ లోకి వస్తాడేమో..?