అప్పుడు విశాల్.. ఇప్పుడు సూర్య..

హీరో అంటే అర్థం అందరికీ మంచి చేసేవాడు అని. సినిమాల్లో మాత్రమే మన హీరోలు మంచి చేస్తుంటారు. అక్కడ త్యాగాలు చేస్తుంటారు.. ఆస్తుల్ని కూడా వెంట్రుకతో సమానంగా రాసిచ్చేస్తుంటారు. కానీ రియల్ లైఫ్ లో ఎంతమంది అలా ఉంటారు..? కనీసం ఒక్కరు ఇద్దరైనా అలా ఉంటారా..? మన హీరోల్లో ఎంతమంది అలా ఉన్నారో తెలియదు కానీ తమిళనాట మాత్రం చాలా మందే ఉన్నారు. అక్కడి వాళ్లు కష్టం అంటే చాలు కన్నీరు కార్చడమే కాదు.. కార్చే కన్నీరును తుడుస్తున్నారు కూడా. ఆ మధ్య ఎప్పుడో పేపర్ లో ఓ రైతు అప్పు గురించి చదివి 20 లక్షలు కట్టేసాడు విశాల్. ఆ తర్వాత తన అభిమన్యుడు సినిమాకు తెగిన టికెట్స్ లో ప్రతీ టికెట్ పై ఒక్క రూపాయి రైతులకు ఇచ్చాడు. ఇప్పుడు సూర్య కూడా ఇంతే మంచి పని చేస్తున్నాడు. ఈ హీరో కూడా తన అగరం ఫౌండేషన్ నుంచి రైతులకు కోటి రూపాయలు విరాళం అందించాడు.
ఇప్పటికే తన ఇంటిని అనాథల కోసం రాసిచ్చేసాడు ఈ హీరో. ఈ అగరం ఫౌండేషన్ లో వేలాది మంది పేద పిల్లలు ఉచితంగా చదువుకుంటున్నారు. జ్యోతిక దీన్ని దగ్గరుండి చూసుకుంటుంది. అంతేకాదు.. బాగా చదువుకునే పేద పిల్లలకు స్కాలర్ షిప్ లు ఇస్తున్నాడు. ఇక ఇప్పుడు ఇదే క్రమంలోనే రైతులకు కోటిరూపాయల విరాళం ఇచ్చాడు. ఈ మధ్యే సూర్య నిర్మించిన కడైకుట్టి సింగం పూర్తిగా రైతుల కథతోనే వచ్చింది. ఇందులో హీరో కార్తి రైతు. ఈ సినిమా తెలుగులో చినబాబుగా వచ్చి ఫ్లాపైంది కానీ తమిళ్ లో మాత్రం హిట్టైంది. ఈ విజయోత్సవ వేడుకలోనే కోటి విరాళాన్ని ప్రకటించాడు సూర్య. ఈయన తీసుకున్న నిర్ణయంతో అభిమానులు కూడా కాలర్ ఎత్తి తిరుగుతున్నారు.